US: అమెరికా గగనతలంలోకి వస్తున్నవి.. గ్రహాంతర జీవులేనా?

తమ గగనతలంలోకి ప్రవేశించిన మరో గుర్తుతెలియని వస్తువును అమెరికా కూల్చేసింది. మూడు రోజుల్లో ఇది మూడో ఘటన. ఇంతకీ అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్న ఆ వస్తువులు ఏంటీ? వరుసగా కన్పిస్తున్న ఆ గుర్తులు.. గ్రహాంతర జీవులకు చెందినవేనా?

Updated : 13 Feb 2023 16:10 IST

వాషింగ్టన్‌: గగనతలంలో అనుమానాస్పద వస్తువుల కదలికలు అమెరికా (America)ను కలవరపెడుతున్నాయి. వరుసగా మూడో రోజు నింగిలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును అగ్రరాజ్యం కూల్చేసింది. మిచిగాన్‌ రాష్ట్రంలోని హ్యూరన్‌ సరస్సుపై ఆదివారం 20వేల అడుగుల ఎత్తులో కన్పించిన ఆ వస్తువును ఎఫ్‌-16 యుద్ధ విమానంతో కూల్చేసినట్లు పెంటగాన్‌ (Pentagon) మీడియా కార్యదర్శి బ్రిగేడియర్‌ జనరల్ పాట్రిక్‌ రైడర్‌ వెల్లడించారు.

చైనాకు చెందిన ఓ అనుమానిత నిఘా బెలూన్‌ను ఇటీవల అమెరికా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి ఇలాంటి అనుమానాస్పద వస్తువుల (Unidentified Object) కదలికలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. గత శుక్రవారం అలస్కాలో, శనివారం కెనడాలోని యూకాన్‌ ప్రాంతంలో ఈ గుర్తుతెలియని వస్తువులు కన్పించగా.. అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఆదేశాలతో యూఎస్‌ (US) మిలిటరీ వాటిని కూల్చేసింది. తాజాగా మిచిగాన్‌ రాష్ట్రంలో కూల్చివేత జరిగింది. పౌర విమానాల రాకపోకలకు ముప్పుగా భావించి ఆ వస్తువును కూల్చేసినట్లు పెంటగాన్‌ తెలిపింది. అయితే ఆ శకలాల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ మూడు వస్తువులు ఏంటీ? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది.

ఏలియన్స్‌ వస్తున్నాయా?

వరుసగా ఇలాంటి వస్తువులు కన్పిస్తుండటంతో అవన్నీ గ్రహాంతరవాసుల (Aliens)కు సంబంధించినవి అయి ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గురించి ఉత్తర అమెరికా గగనతలాన్ని పర్యవేక్షించే యూఎస్‌ (US) ఎయిర్‌ఫోర్స్‌ జనరల్‌ గ్లెన్‌ వాన్‌హెర్క్‌ను ప్రశ్నించగా.. ఆ అనుమానాలను కొట్టిపారేయలేమని ఆయన సమాధానమివ్వడం గమనార్హం. ‘‘ఆ వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటి లక్ష్యం ఏంటీ? అనేది మేం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం అన్ని కోణాల్లో ముప్పును అంచనా వేస్తున్నాం. అయితే అవి బెలూన్లు అని కాకుండా వస్తువులనే చెప్పగలం. దానికి కొన్ని కారణాలున్నాయి. ఆ వస్తువులు ఏంటీ అనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంటెలిజెన్స్‌ నిపుణులు వాటిని గుర్తిస్తారు. అయితే వీటి వెనుక ఎలాంటి అనుమానాలనూ ప్రస్తుతానికి కొట్టిపారేయలేం’’ అని వాన్‌హెర్క్‌ తెలిపారు.

ఇటీవల కొన్నేళ్లుగా గ్రహాంతరవాసుల అంశంపై పెంటగాన్‌ విస్తృత పరిశోధనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అంతరిక్షం, గగనతలం లేదా నీటి అడుగున అసాధారణ, గుర్తుతెలియని వస్తువులు ఉన్నాయా అనేది గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, గ్రహాంతర జీవులు (aliens) భూమిపైకి వచ్చాయని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను కనుగొనలేకపోయామని పెంటగాన్‌ (Pentagon) వర్గాలు వెల్లడించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని