Shanghai: ముద్దులు, కౌగిలింతలు వద్దు.. వేరుగా పడుకోండి..!

కరోనాను కట్టడి చేసే విషయంలో చైనా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు షాంఘై నగరం వైరస్‌ కోరల్లో చిక్కుకోగా.. అక్కడి ప్రజలు కఠిన లాక్‌డౌన్‌లో మగ్గుతున్నారు.

Updated : 07 Apr 2022 18:07 IST

షాంఘై వాసుల్ని హెచ్చరించిన ప్రభుత్వం

షాంఘై: కరోనాను కట్టడి చేసే విషయంలో చైనా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు షాంఘై నగరం వైరస్‌ కోరల్లో చిక్కుకోగా.. అక్కడి ప్రజలు కఠిన లాక్‌డౌన్‌లో మగ్గుతున్నారు. ఈ సమయంలో వారు కనీస సదుపాయాల కొరతను కూడా ఎదుర్కొంటున్నారు. దానిపై బాల్కనీల్లో నిలబడి పాటల ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం డ్రోన్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా హెచ్చరికలను పంపింది.  

‘తాము ఎదుర్కొంటోన్న కొరత గురించి షాంఘై ప్రజలు బాల్కనీల్లోకి వచ్చి పాటల రూపంలో నిరసన తెలిపారు. ఆ వెంటనే ఒక డ్రోన్‌ ప్రత్యక్షమైంది. ‘కొవిడ్ నిబంధనలు పాటించండి. స్వేచ్ఛ కోసం మీ మనస్సులో నిండిన కోరికను నియంత్రించుకోండి. కిటికీలు తెరవకండి. పాడకండి’ అంటూ ఓ నెటిజన్ డ్రోన్ ప్రకటన వీడియోను షేర్ చేశారు. అలాగే ఇంకో ట్వీట్‌లో ఆరోగ్య కార్యకర్తల ప్రకటనకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ‘ఈ రాత్రి నుంచి ఇంట్లో జంటలు వేర్వేరుగా పడుకోవాలి. ముద్దులు, కౌగలింతలు వంటివి వద్దు. భోజనం కూడా విడిగానే చేయాలి’ అంటూ ప్రకటించడం కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం రోబోలు గస్తీ తిరిగిన వీడియోలు చక్కర్లు కొట్టాయి. 

షాంఘైలో విధించిన లాక్‌డౌన్ కారణంగా 26 మిలియన్ల మంది ప్రజలు ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో అంతరాయం ఏర్పడి, ప్రజలు అవస్థ పడుతున్నారు. తాము ఈ సమస్యను గుర్తించామని, పరిస్థితి మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని