Vivek Ramaswamy: వివేక్‌ రామస్వామితో డిన్నర్‌ ఆఫర్‌.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!

వివేక్‌ రామస్వామి ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ కోసం అమెరికాలో పలువురు వ్యాపారవేత్తలు ‘ప్రత్యేక విందు’ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు 50 వేల డాలర్ల పైనే చెల్లించాల్సి ఉంటుందట.

Published : 23 Sep 2023 13:48 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఆయన రెండో స్థానంలో ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే వివేక్‌ ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం పలువురు సిలికాన్‌ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొచ్చారు. వివేక్‌ రామస్వామి ప్రత్యేక అతిథిగా ఈ నెల 29న ఓ విందు (Intimate Dinner)కు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 50 వేల డాలర్లు ఆపైనే చెల్లించాల్సి ఉంటుందట.

అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని సోషల్‌ క్యాపిటల్‌ సంస్థ సీఈవో చామాత్‌ పలిహపిటియా నివాసంలో ఈ విందు నిర్వహించనున్నారు. పలువురు వ్యాపారవేత్తలూ ఈ కార్యక్రమ నిర్వహణలో భాగమయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. డిన్నర్‌ క్రమంలో వివేక్‌తో చర్చలకూ అవకాశం కల్పించనున్నారు. 10 లక్షల డాలర్ల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నా పాపులారిటీని తట్టుకోలేకపోతున్నారు.. అనుభవం లేదంటున్నారు..!

మరోవైపు.. ప్రచారంలో భాగంగా భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి తనదైన హామీలు కురిపిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో 75 శాతం ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్‌బీఐని (FBI) మూసివేస్తానని ప్రకటించారు. లాటరీ ఆధారిత హెచ్‌-1బీ వీసా ప్రక్రియకు స్వస్తిచెప్పి దాని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తానని పేర్కొన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే భారత్‌, ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, చిలీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని