Isarel: హమాస్‌ అంతుచూడకపోతే వాళ్లు మళ్లీ వస్తారు: నెతన్యాహు

హమాస్‌ మిలిటెంట్లను అంతమొందించకపోతే.. వాళ్లు మళ్లీ వస్తారని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. సోమవారం ఆయన హమాస్‌తో యుద్ధంలో పాల్గొంటున్న సైనికులను నేరుగా కలుసుకొని మాట్లాడారు. 

Updated : 14 Nov 2023 04:59 IST

టెల్‌ అవీవ్‌: హమాస్‌ (Hamas)ను అంతమొందించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) మరోసారి స్పష్టం చేశారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు వద్దకు నెతన్యాహు తరచూ వెళ్లి వారిలో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన.. క్యారకాల్‌ బెటాలియన్‌ సైనికులతో మాట్లాడారు. ఈ యుద్ధం హమాస్‌ మిలిటెంట్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనే నిరంతర పోరాటమని చెప్పారు. ఇది ఆర్మీ చేపట్టే సాధారణ ఆపరేషన్‌ కాదని, హమాస్‌ను తుదిముట్టించే వరకు కొనసాగే యుద్ధమని తెలిపారు. సైనికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇది మాటలతో అయ్యే పనికాదని, హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయకపోతే.. వాళ్లు మళ్లీ వస్తారని చెప్పారు. 

అల్‌-షిఫా ఆసుపత్రి చుట్టూ పోరు

నెతన్యాహు ఆదేశాల మేరకు ఇప్పటికే ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ స్థావరాలున్న గాజాను పూర్తిగా చుట్టుముట్టి దాడులు చేస్తోంది. అల్‌-ఖుద్స్‌ ఆస్పత్రిలో పౌరుల మధ్యలో నక్కిన హమాస్‌కు చెందిన ఓ గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకొని సోమవారం దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. ఆస్పత్రి ఆవరణ నుంచి మిలిటెంట్లు కాల్పులు జరిపారని, వారిపై తాము జరిపిన కాల్పుల్లో 21 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వెల్లడించింది.

మరోవైపు ఇజ్రాయెల్‌తో జరుగుతోన్న యుద్ధంలో ఇప్పటి వరకు తమవైపు 11,240 మంది మృతి చెందారని గాజాలోని హమాస్‌ ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో 4,630 మంది చిన్నారులు, 3,130 మంది మహిళలు ఉన్నారని, మరో 29వేల మంది గాయపడ్డారని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని