Ukraine Crisis: రష్యాకు ఏం టైమింగ్‌లో వచ్చాను: పాక్ ప్రధాని

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రకటించడంతో.. తదుపరి పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటోంది.

Published : 24 Feb 2022 14:10 IST

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రకటించడంతో.. తదుపరి పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠతో ఉంది. ప్రజలంతా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటుంటే.. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి రష్యాలో పర్యటిస్తోన్న ఆయన.. చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. 

ఉక్రెయిన్, రష్యా మధ్య తీవ్ర వివాదం నెలకొన్న సమయంలో ఇమ్రాన్‌ ఖాన్ రష్యాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పాకిస్థాన్‌ నుంచి బయలుదేరి అక్కడకు చేరుకున్నారు. రెండు దశాబ్దాల కాలంలో పాక్‌ ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపనున్నారు. కాగా, ఇమ్రాన్ విమానాశ్రయంలో దిగగానే.. ఆ దేశ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆ దేశ అధికారితో మాట్లాడుతూ.. ‘ఏం  టైమింగ్‌లో వచ్చాను. చాలా ఉత్సాహంగా ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. రష్యా ఇటీవల తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ వేర్పాటువాద భూభాగాలను స్వయంప్రతిపత్తి ఉన్న ప్రాంతాలుగా గుర్తించింది. దాంతో అమెరికా, దాని మిత్ర పక్షాలు రష్యాపై ఆంక్షలు కఠినతరం చేశాయి. ఆ సమయంలో పాక్‌ ప్రధాని పర్యటనను ఉద్దేశించి అమెరికా స్పందించింది. రష్యా చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రతి బాధ్యతాయుత దేశానికి ఉన్న బాధ్యతని వ్యాఖ్యానించింది. ఈ వివాదం సద్దుమణిగేందుకు దౌత్యపరంగా చేస్తోన్న ప్రయత్నాలను పాకిస్థాన్‌కు వివరించినట్లు పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని