Deepfake: అమెరికాకు డీప్‌ఫేక్ సెగ.. ఆందోళన వ్యక్తం చేసిన వైట్‌హౌస్‌

అమెరికాలో డీప్‌ఫేక్‌ కలకలం సృష్టించింది. అధ్యక్షుడి వాయిస్‌ను అనుకరిస్తూ ఫేక్‌ కాల్స్‌ రావడంపై వైట్‌హౌస్(White House) స్పందించింది. 

Updated : 27 Jan 2024 19:35 IST

వాషింగ్టన్‌: అమెరికా(USA)లో డీప్‌ఫేక్‌(Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఆ సెగ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden), ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌(Taylor Swift)ను తాకింది. బైడెన్‌ వాయిస్ అనుకరిస్తూ ముందుగానే రికార్డ్‌ చేసిన ఫోన్‌కాల్స్‌(AI-generated robocall), గాయనికి చెందిన అభ్యంతరకర దృశ్యాలపై వైట్‌హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

డీప్‌ఫేక్‌... మాయలో పడొద్దు!

‘తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తాం’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. దీనిని కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలదే కీలక పాత్ర అని అన్నారు. ఎక్స్‌(ట్విటర్‌) వంటి సంస్థల్లో నిబంధనలు ఉన్నప్పటికీ.. టేలర్‌ స్విఫ్ట్(Taylor Swift)కు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను తొలగించలేకపోయారు. అవి  17 గంటల పాటు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. 45 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ చిత్రాలపై ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం ప్రైమరీ పోల్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత వారం న్యూహాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ఓటర్లకు బైడెన్‌ చెప్పినట్టుగా ముందుగా రికార్డు చేసిన కొన్ని ఫోన్‌ కాల్స్ వచ్చాయి. ఈ ఎన్నికలో ఓటు వేయొద్దని ఆయన ఓటర్లను కోరినట్లు వాటి సారాంశం. ఈ ఏఐ జనరేటెడ్‌ కాల్స్‌పై ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఈ సాంకేతికత అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది. బైడెన్ వాయిస్‌ను అనుకరించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని