Finland: విమర్శకుల దిమ్మతిరిగేలా.. మారిన్‌కు మద్దతుగా కాలు కదిపిన మహిళా లోకం

అనుకోని వివాదంలో చిక్కుకున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్‌కు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళాలోకం కాలు కదిపింది.........

Published : 24 Aug 2022 02:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుకోని వివాదంలో చిక్కుకున్న ఫిన్లాండ్(Finland) ప్రధాని సనా మారిన్‌కు(Sanna Marin) మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా మహిళాలోకం కదిలింది. విమర్శకులకు చెంపపెట్టులా పలువురు మహిళలు వినూత్న రీతిలో స్పందిస్తున్నారు. మారిన్‌కు సంబంధించిన ఏ వీడియోనైతే చూపిస్తూ విమర్శలు చేస్తున్నారో.. అదే తరహాలో వారు కూడా డ్యాన్సులు చేస్తూ ఫిన్లాండ్‌ ప్రధానికి తమ మద్దతును ప్రకటిస్తున్నారు. తమ డ్యాన్స్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. ఇప్పుడు మేము కూడా డ్రగ్స్‌ తీసుకున్నామని మీరు అనగలరా? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‘మనమందరం ఇంకాస్త ఎక్కువ నృత్యం చేయాలి. సన్నాకు సంఘీభావంగా నిలుస్తున్నా’ అంటూ ఓ దేశానికి చెందిన మహిళ పేర్కొంది. మారిన్‌కు సపోర్ట్‌గా #SolidarityWithSanna అనే యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇటీవల ప్రధాని మారిన్‌తో సహా ఆరుగురు మహిళలు డ్యాన్సులు చేస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో నేలపై మోకాళ్ల మీద కూర్చొని ఆమె ఓ పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేతలు.. ఆమె డ్రగ్స్‌ తీసుకున్నారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పలువురు ఆమెపై విమర్శలు గుప్పించారు. కాగా ఆ విమర్శలను ప్రధాని ఖండించారు. కేవలం ఆల్కహాల్‌ తప్ప ఎటువంటి డ్రగ్స్‌ తీసుకోలేదని వెల్లడించారు.

అయినప్పటికీ అందరి అనుమానాలు నివృత్తి  చేసేందుకు మారిన్ డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. నమూనాలను పరీక్షించగా నెగెటివ్‌గా తేలింది. ‘ప్రధాని సనా మారిన్‌ నుంచి ఆగస్టు 19, 2022న నమూనాలు సేకరించాం. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. నిబంధనలకు అనుగుణంగానే ఈ పరీక్ష జరిగింది’ అని ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని