World Population: 800కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా 800కోట్లను అధిగమించింది. మంగళవారం 800వ కోట్ల చిన్నారి ఈ భూమ్మీదకు వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Updated : 15 Nov 2022 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ జనాభా (World Population) మరో మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న జనాల సంఖ్య 800కోట్లను తాకింది. మంగళవారం 800వ కోట్ల శిశువు ఈ భూమ్మీదకు వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది. 48 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. 1974లో ప్రపంచ జనాభా 400కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది. మరో 15ఏళ్లకు అంటే.. 2037 నాటికి ప్రపంచ జనాభా 900కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేసింది.

క్రీస్తు పూర్వం 8000 సంవత్సరం సమయంలో ప్రపంచ జనాభా దాదాపు 50 లక్షలుగా ఉండేదని అంచనా. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు మాత్రం 30 కోట్లు, 60 కోట్లు అని కూడా చెబుతున్నాయి. 1804 సంవత్సరంలో ప్రపంచంలో మానవుల సంఖ్య వంద కోట్లకు చేరింది. పారిశ్రామిక విప్లవంతో ఆర్థిక పురోభివృద్ధి ఊపందుకుంది. వైద్యంలో అద్భుత పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా శిశువుల్లో అకాల మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారితీసింది.

ఇదీ చదవండి: మూలిగే నక్కపై తాటికాయలా అధిక జనాభా

ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభా 200 కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 ఏళ్లు (1930 సంవత్సరంలో) పట్టింది. 300 కోట్ల మార్కుకు మరో 30 ఏళ్లు (1960), 400 కోట్ల స్థాయికి 14 ఏళ్లు (1974), 500 కోట్ల మార్కును తాకడానికి 13 ఏళ్లు (1987) పట్టింది. 600 కోట్ల స్థాయిని మాత్రం చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే (1998) మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల స్థాయిని తాకడానికి 12 ఏళ్లు (2010) పట్టింది. ఆ తర్వాత మళ్లీ పుష్కర కాలానికి నేడు (నవంబరు 15, 2022) 800కోట్ల మార్కును తాకింది.

2023లో భారత్‌ నంబర్‌ వన్‌..

2023 నాటికి చైనా (China)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిని దేశంగా భారత్‌ (India) నిలుస్తుందని ఐరాస అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో జనసంఖ్య 141.2కోట్ల మేర ఉండగా.. 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ఇక, చైనా జనాభా ప్రస్తుతం 145.2కోట్లు ఉండగా.. 2050 నాటికి 130 కోట్లకు తగ్గొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని