Ukraine Flight : ఉక్రెయిన్ ‘కల’ చెదిరింది.. కథ మారింది..
ప్రపంచంలోనే (world) అతిపెద్ద కార్గో విమానంగా పేరుతెచ్చుకున్న ఉక్రెయిన్ (Ukraine) విమానం ఇది. దీని పేరు ఏఎన్-225 ‘మ్రియా’ (An-225 mriya). మ్రియా అంటే ఉక్రెయిన్ భాషలో కల (Dream) అని అర్థం. ఆ ‘కల’ ప్రస్తుతం కళావిహీనంగా దర్శనమిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russian-ukraine war) కారణంగా అనేక అపురూప కళాఖండాలు ధ్వంసమయ్యాయి. అందులో ఒకటి ఈ విమానమని (Flight) నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ఉక్రెయిన్ (Ukraine) రాజధాని కీవ్ (Kyiv) నగరానికి వెలుపల హొస్టోమెల్ విమానాశ్రయం ఉంది. గతేడాది ఫిబ్రవరిలో మరమ్మతుల కోసం ప్రపంచంలోనే అతి పెద్ద కార్గో విమానం ఏఎన్-225 (An-225 mriya)ను అక్కడే నిలిపి ఉంచిన క్రమంలో రష్యన్ (Russian) బలగాలు ఈ ప్రాంతంపై శతఘ్నులు, రాకెట్లతో దాడి చేశాయి. ఫలితంగా మ్రియా విమానం (Flight) దగ్ధమైంది. హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. మరమ్మతుల కోసం ఒక ఇంజిన్‌ను తొలగించాల్సి రావడం వల్ల ఈ విమానాన్ని వేరే ప్రాంతానికి తరలించడం కుదరలేదని అప్పట్లో అధికారులు తెలిపారు.
గ‘ఘన’ చరిత్ర
ప్రపంచంలో ఉన్న ఏఎన్-225 విమానం ఇది ఒక్కటి మాత్రమే. 1980వ దశకంలో ఉక్రెయిన్.. సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు దీని నిర్మాణం మొదలుపెట్టారు. నాడు అమెరికా, సోవియట్ మధ్య అంతరిక్ష పోటీ తీవ్రంగా ఉండేది. అప్పట్లో అమెరికా స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని చేపట్టింది. పోటీగా ‘బురాన్’ వ్యోమనౌక రూపకల్పనకు సోవియట్ సిద్ధమైంది. ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ను చేరవేయడానికి మ్రియాను రూపొందించింది. 1988 డిసెంబరు 21న ఈ విమానం తొలిసారి గాల్లో ఎగిరింది. 1989లో జరిగిన ప్యారిస్ ఎయిర్ షో సహా అనేక దేశాల్లో నిర్వహించిన ఎయిర్ షోల్లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటిది మరొకటి తయారు చేయాలనే ఉద్దేశంతో పనులు మొదలుపెట్టారు. ఆ నిర్మాణం 2009 వరకు నత్తనడకన సాగింది. దాంతో ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశారు. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలాక బురాన్ ప్రాజెక్టు రద్దయింది. నాటి నుంచి మ్రియాను భారీ సరకులను చేరవేయడానికి వినియోగించేవారు. పొరుగు దేశాల్లో విపత్తులు సంభవించినప్పుడు సహాయ సామగ్రిని చేరవేయడానికి మ్రియాను ఎక్కువగా వాడారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన మొదట్లో ఇది అనేక దేశాలకు వైద్య సరఫరాలను బట్వాడా చేసింది. 2016 మే 13న ఈ దిగ్గజ విమానం హైదరాబాద్ వచ్చింది.
‘రహస్య సంస్థ’లో తయారీ!
మ్రియాను ఆంటోనోవ్ స్టేట్ కంపెనీ రూపొందించింది. గతంలో దాన్ని ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో అని పిలిచేవారు. 1946లో నోవోసెబియస్క్‌లో ఈ కంపెనీని స్థాపించారు. ఇది అత్యంత రహస్య సంస్థగా పేరు గడిచింది. ఒలెగ్ అంటోనోవ్ అనే వ్యక్తి ఈ కంపెనీని విజయవంతంగా నడిపించారు. భారీ పరిమాణంలో ఉండే విమానాలను తయారు చేయడంలో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సరిగా సిద్ధం కాని రన్‌వేలపై కూడా ఈ కంపెనీ విమానాలకు రాకపోకలు సాగించే నైపుణ్యం ఉండేదట. 2017 జులైలో ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని ఆయుధ తయారీ కర్మాగారం ఉక్రోబోరాన్‌ప్రోమ్, ఆంటోనోవ్, దేశంలోని ఇతర తయారీ సంస్థలను కలిపి ఉక్రెయిన్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేశారు.
విమానం ప్రత్యేకతలివే..!
విమానం పొడవు 84 మీటర్లు. లోపల ఒకేసారి 50 కార్లను ఉంచి తరలించవచ్చట. విమానం పై భాగంలో కాక్‌పిట్ ఉంటుంది. అందులోకి ఒక నిచ్చెన గుండా వెళ్లాలి. ఈ విమానంలో ఆరు జెడ్ఎంకేబీ ప్రోగ్రెస్ లోటరెవ్ డి-18టి టర్బో ఫ్యాన్ ఇంజిన్లున్నాయి. దాంతో 36 వేల అడుగుల ఎత్తులో సైతం గంటకు 849 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఇందులోని ఇంధన ట్యాంకు సామర్థ్యం కూడా ఎక్కువే. ఫలితంగా లండన్- ఆస్ట్రేలియా మధ్యనున్న 9569 మైళ్ల దూరాన్ని విరామం లేకుండా చేరుకోవచ్చు. 32 వీల్ ల్యాండింగ్ గేర్‌లో 20 స్టీరబుల్ వీల్స్ ఉన్నాయి. బోయింగ్ 747 కంటే రెండు రెట్లు బరువు మోసుకెళ్లగలిగేలా మ్రియాను అభివృద్ధి చేశారు. గరిష్ఠంగా 640 టన్నుల టేకాఫ్ బరువు మోసుకెళ్తుంది. దీనిలో 130 టన్నుల జనరేటర్లు, గాలిమర బ్లేడ్‌లు, డీజిల్ లోకోమోటివ్‌లను రవాణా చేసేవారు. విమానాన్ని నిలిపి ఉంచాలంటే ఒక ఫుట్‌బాల్ మైదానానికి సమానమైన స్థలం కావాలి.
భారీ ఖర్చు.. యుద్ధం ఆగలేదు
‘ఏఎన్-225’ గతేడాది ఫిబ్రవరిలో ధ్వంసమైంది. అరుదైన ఈ విమానాన్ని మళ్లీ నిర్మిస్తామని ఉక్రెయిన్ అధికారులు ప్రతినబూనారు. ఆంటోనోవ్ కంపెనీ సీఈవో సెర్గీ బైచ్కోవ్ కూడా విమానం నిర్మించాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. దాంతో పునర్నిర్మాణం సాధ్యపడలేదు. విమానం నిర్మించాలంటే 3 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు అభిప్రాయం కోరిన న్యాయమూర్తి
-
Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?
-
IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్‌కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన