Zelenskyy: జెలెన్‌స్కీ ఖాకీ జాకెట్‌ వేలం.. ఎంతకు అమ్ముడుపోయిందంటే!

యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి! ఈ క్రమంలోనే మొదటి నుంచి అండగా నిలుస్తోన్న బ్రిటన్‌.. తాజాగా ఉక్రెనియన్ల మానవతా సాయం కోసం నిధుల సమీకరణకు నడుం బిగించింది...

Published : 09 May 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి! ఈ క్రమంలోనే మొదటి నుంచి అండగా నిలుస్తున్న బ్రిటన్‌.. తాజాగా ఉక్రెనియన్ల మానవతా సాయం కోసం నిధుల సమీకరణకు నడుం బిగించింది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన ఓ దాతృత్వ వేలంలో.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఖాకీ జాకెట్‌.. ఏకంగా రూ.85.46 లక్షల (90 వేల పౌండ్లు)కు అమ్ముడుపోవడం విశేషం. లండన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.

రష్యా దండయాత్ర క్రమంలో.. జెలెన్‌స్కీ మొక్కవోని ధైర్యానికి ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన ట్రేడ్‌మార్క్ గ్రీన్ మిలిటరీ దుస్తులకు ప్రసిద్ధి. ఖాకీ జాకెట్‌ ధరించి.. రాజధాని కీవ్‌లో పర్యటించిన చిత్రాలు పలు సందర్భాల్లో వైరల్‌ అయ్యాయి. వేలంలో ఈ జాకెట్‌ ప్రారంభ ధరను 50 వేల పౌండ్లుగా నిర్ణయించగా.. మరింత ఎక్కువకు కొనుగోలు చేయాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్కడున్నవారికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే భారీ ధరకు అమ్ముడుపోవడం గమనార్హం. బోరిస్‌ జాన్సన్‌ గతంలో జెలెన్‌స్కీతో కలిసి కీవ్‌ వీధుల్లో పర్యటించిన సందర్భంగా అందుకున్న కాకరెల్ జగ్‌ సహా అనేక వస్తువులనూ వేలంలో ఉంచారు. కీవ్‌ మేయర్ విటాలి క్లిట్‌ష్కోతో నగర సందర్శన ప్యాకేజీ కూడా ఈ జాబితాలో ఉంది.

‘మేయర్ క్లిట్‌ష్కోతో కలిసి కీవ్‌లో పర్యటించా. అదొక అందమైన నగరం. ఈ టూర్‌ కోసం వీలైనంత ఖర్చు చేయొచ్చు’ అని జాన్సన్‌.. వేలంలో పాల్గొన్నవారిని ఉత్సాహ పరిచారు. ఈ విపత్కర సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా.. పురాతన యూరోపియన్ నగరం కీవ్‌కు మళ్లీ ఎప్పటికీ ముప్పు ఉండదని, ఆ దేశం మరోసారి స్వేచ్ఛగా మనగలుగుతుందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ప్రజల స్ఫూర్తిని పుతిన్‌ ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని ప్రకటించారు. ఈ సందర్భంగానే.. బ్రిటన్‌ చేస్తున్న సాయానికి జెలెన్‌స్కీ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని