ఐస్‌ ఐస్‌... షేవ్‌ ఐస్‌!

ఐస్‌క్రీముల్లో వందలకొద్దీ ఫ్లేవర్లూ వేలకొద్దీ రుచులూ ఉన్నప్పటికీ పుల్లైస్‌ అన్నా ఐస్‌గోలా అన్నా ఇప్పటికీ అందరికీ క్రేజే. అందుకే అది ఇప్పుడు మరిన్ని రూపాల్నీ రుచుల్నీ సంతరించు కుంటోంది. అవునండీ...

Updated : 13 Mar 2022 02:00 IST

ఐస్‌ ఐస్‌... షేవ్‌ ఐస్‌!

ఐస్‌క్రీముల్లో వందలకొద్దీ ఫ్లేవర్లూ వేలకొద్దీ రుచులూ ఉన్నప్పటికీ పుల్లైస్‌ అన్నా ఐస్‌గోలా అన్నా ఇప్పటికీ అందరికీ క్రేజే. అందుకే అది ఇప్పుడు మరిన్ని రూపాల్నీ రుచుల్నీ సంతరించు కుంటోంది. అవునండీ... ఒకప్పటి ఐస్‌గోలానే నేడు అంతటా షేవ్‌ ఐస్‌ పేరుతో చప్పరించేస్తున్నారు.

షేవ్‌ ఐస్‌... ఇదేంపేరు అనిపిస్తోంది కదూ. నిజమే, ఐస్‌క్యూబ్స్‌ని పెన్సిల్‌ చెక్కినట్లుగా ఓ పద్ధతిలో చెక్కితే వచ్చే పొట్టులా ఉండటం వల్లే కాబోలు, ఈ ఐస్‌ డెజర్ట్‌ని ఆ పేరుతోనే పిలుస్తున్నారు. అయితే మిగిలిన దేశాలకు ఇది కొత్త కావచ్చుగానీ హవాయ్‌ వాసులకు మాత్రం పాతదేనట. ఇంటికి వచ్చినవాళ్లకే కాదు, తమ దేశానికి వచ్చిన ముఖ్యులకీ దీన్ని రుచి చూపించకుండా ఉండరు హవాయ్‌ వాసులు. అక్కడి బీచ్‌ల్లో పార్కుల్లో ఎయిర్‌పోర్టుల్లో ఎక్కడంటే అక్కడ ఈ షేవ్‌ ఐస్‌ను అమ్ముతారు. చిత్రమేమంటే- నేటి హవాయ్‌ షేవ్‌ ఐస్‌ మూలాలు జపాన్‌లోనే ఉన్నాయట. కాకిగోరి పేరుతో క్రష్‌డ్‌ ఐస్‌కి రంగులు అద్ది తినే అలవాటు జపనీయులకి ఏడెనిమిది శతాబ్దాల నుంచీ ఉండేది. కేవలం అక్కడనే కాదు, ఐసుముక్కల పొడికి రకరకాల ఫ్లేవర్డ్‌ రంగుల్నీ పాలనీ ఇతర పదార్థాలనీ జోడించి తినడం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. కాకపోతే మనం ఐస్‌గోలా అన్నట్లే అమెరికన్లు స్నో ఐస్‌ అనీ, దక్షిణ అమెరికాలో రాస్పెడోస్‌ అనీ... ఇలా ఒక్కోచోట ఒక్కోపేరుతో పిలుస్తుంటారు. అయితే చెరకు తోటల్లో పనులకోసం హవాయ్‌కి వెళ్లిన జపాన్‌ వాసుల ద్వారానే ఇది అక్కడివాళ్లకు పరిచయమై షేవ్‌ ఐస్‌ రూపాన్ని సంతరిం చుకుంది. అదెలా అంటే- హవాయ్‌లోని జపనీయులు తమ దగ్గర ఉన్న రకరకాల పనిముట్లతో ఐస్‌ని ఫ్లేక్స్‌ మాదిరిగా చెక్కేవారట. పైగా అలా చెక్కిన ఐస్‌ మెత్తని పొడిలా ఉండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేదట. దాంతో ఐస్‌ క్రషింగ్‌ మెషీన్లలో అచ్చం పెన్సిల్‌ చెక్కినప్పుడు వచ్చే పొట్టులా ఉండే బ్లేడ్లని వాడటం ప్రారంభించారు. దీనికి రకరకాల టాపింగ్స్‌ చేర్చి దుకాణాల్లో అమ్మడం ప్రారంభించారట. దాన్ని అక్కడ తోటల్లో పనిచేయడానికి వచ్చిన కార్మికులంతా ఇష్టంగా తినేవారట. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రష్‌డ్‌ ఐస్‌ కాస్తా హవాయ్‌లో ఐస్‌ షేవ్‌గా రూపాంతరం చెందిందన్నమాట. అది కాస్తా ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా అన్ని దేశాలకీ చేరడంతో ఇప్పుడు మనదగ్గరా ఇష్టంగా చప్పరించేస్తున్నారు.

అయితే ఐస్‌గోలాకోసం ఐసుముక్కల్ని మెషీన్‌లో వేసి పలుకుపలుకుగా ఉండేలానే దంచి దానిమీద పంచదారతో కూడిన కలర్డ్‌ సిరప్‌ని వేస్తారు. దీన్నే పాశ్చాత్య దేశాల్లో స్నో కోన్స్‌ అనీ పిలుస్తుంటారు. కానీ షేవ్‌ ఐస్‌లో వాడే ఐస్‌ మెత్తని పొడిలా ఉంటుంది. దీన్ని పుల్లకు గుచ్చి కాకుండా కప్పుల్లోనూ ప్లేట్లలోనూ పెట్టి ఇస్తారు. దీన్నే కొత్తగా వచ్చిన మెషీన్లతో సన్నని నూడుల్స్‌లానూ చేస్తున్నారు. పైగా షేవ్‌ ఐస్‌లో పైనాపిల్‌, జామ, పేషన్‌ ఫ్రూట్‌, లిచీ, నిమ్మ, నారింజ, మామిడి...వంటి పండ్ల రసాల్నీ పండ్ల ముక్కలతోపాటు కండెన్స్‌డ్‌ మిల్క్‌, నట్స్‌, ఐస్‌క్రీమ్‌, మాచా టీ, ... ఇలా ఎన్నో రకాలు జోడించి రకరకాల రుచుల్లోనూ రంగుల్లోనూ అందిస్తున్నారు. కేవలం ఐస్‌తోనే కాదు, కొన్నిచోట్ల కండెన్స్‌డ్‌ మిల్క్‌ ఎక్కువగా ఉన్న ఐస్‌నీ ఐస్‌క్రీమ్‌ని కూడా ఫ్లేక్స్‌లా చేస్తూ షేవ్‌ లేదా షేవ్డ్‌ ఐస్‌క్రీమ్‌గా అమ్ముతున్నారు. సో, ఎండల్లో ఈ ఐస్‌ డెజర్ట్‌ని చల్లచల్లగా మనమూ ఆస్వాదించేద్దామా?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..