అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ల్లో... ప్రకటనలు!

ఉదయం వేళ సూర్యుడొచ్చినా రాకున్నా ఏవో ప్రకటనల కరపత్రాలు మాత్రం వాకిలి ముందు వచ్చిపడుతుంటాయి. ఇంటి గేటుకి తాళం ఉన్నా లేకున్నా చిన్నపాటి డిస్‌ప్లే బోర్డులు పలకరిస్తుంటాయి. వీధిలో పాదం మోపితే చాలు... నాలుగడుగులకో యాడ్‌ ఊరిస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా అపార్ట్‌మెంటుల లిఫ్టుల్లోనూ లాబీల్లోనూ కూడా ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి.

Published : 29 May 2022 03:25 IST

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌ల్లో... ప్రకటనలు!

ఉదయం వేళ సూర్యుడొచ్చినా రాకున్నా ఏవో ప్రకటనల కరపత్రాలు మాత్రం వాకిలి ముందు వచ్చిపడుతుంటాయి. ఇంటి గేటుకి తాళం ఉన్నా లేకున్నా చిన్నపాటి డిస్‌ప్లే బోర్డులు పలకరిస్తుంటాయి. వీధిలో పాదం మోపితే చాలు... నాలుగడుగులకో యాడ్‌ ఊరిస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా అపార్ట్‌మెంటుల లిఫ్టుల్లోనూ లాబీల్లోనూ కూడా ప్రకటనలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందుకోసం - అపార్ట్‌మెంటువాసులకు కొంత డబ్బూ యాడ్‌ ఇచ్చే షాపుల ద్వారా రాయితీలూ అందుతున్నాయి.

హైదరాబాద్‌ శివారులో... సుమారు వందకుపైగా మధ్యతరగతి కుటుంబాలు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ అది. దాన్ని నిర్మించిన బిల్డర్‌ ఏడాదిపాటు అపార్ట్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల్ని భరించి... ఒప్పందం ప్రకారం ఆ బాధ్యతని ఫ్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌కి అప్పగించాడు. కొత్తగా ఏర్పడ్డ ఆ అసోసియేన్‌కేమో ఆది నుంచే ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఫ్లాట్‌ ఓనర్స్‌లో కొందరు నెలవారీ మెయింటెనెన్స్‌ సకాలంలో ఇవ్వక... ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడే ఆ అసోసియేషన్‌ని ప్రకటనల సంస్థలవాళ్లు చుట్టుముట్టారు. అపార్ట్‌మెంటు లిఫ్ట్‌ల్లోనూ, లాబీల్లోనూ ప్రకటనలని ప్రదర్శించే డిజిటల్‌ స్క్రీన్‌లు ఏర్పాటుచేస్తామని అడిగారు. అసోసియేషన్‌ ఓకే అనగానే- ఆ అపార్ట్‌మెంట్‌లోని పది లిఫ్టుల్లో స్క్రీన్‌లని ఏర్పాటుచేశారు. వాటిల్లో చుట్టుపక్కలున్న వస్త్రాలూ, నగల షాపులకి చెందిన డిజిటల్‌ ప్రకటనల్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇందుగ్గాను ఆ అసోసియేషన్‌కి నెలకి ఇరవైవేల రూపాయలదాకా చెల్లిస్తున్నారు. అసోసియేషన్‌కి అయ్యే నిర్వహణ ఖర్చులో అది చిన్నమొత్తమే కావొచ్చుకానీ వేణ్నీళ్లకి చన్నీళ్లలా అది ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఆ స్క్రీన్‌లు అపార్ట్‌మెంటువాసుల ఇంటి బర్త్‌డేలూ పెళ్ళిరోజుల విశేషాలని పంచుకోవడానికీ చక్కగా ఉపయోగ పడుతున్నాయి. అంతేకాదు, ఈ అపార్ట్‌మెంట్‌ చుట్టుపక్కల ఉన్న షాపులవాళ్లు వీళ్లకంటూ ప్రత్యేక రాయితీలూ అందిస్తున్నారు! ...ఈ ‘లిఫ్ట్‌ లాబీ’ ప్రకటనల ఉభయతారక పథకాలకి ఇదో చిన్న ఉదాహరణ. తెలుగు రాష్ట్రాల్లోని వేలాది అపార్ట్‌మెంట్లు ఈ ప్రకటనల ఆదాయానికి ఇప్పుడిప్పుడే తెరతీస్తున్నాయి. 

‘లాక్‌డౌన్‌’తో పెరిగాయివి..

‘లిఫ్ట్‌ లాబీ’ ప్రకటనలు చైనాలో బాగా ఫేమస్‌. ఆ పద్ధతి 2003లోనే మనదేశంలో మొదలైంది కానీ... పెద్దగా క్లిక్‌ కాలేదు. అప్పట్లో యాడ్‌ ఏజెన్సీలు వివిధ షాపులూ కంపెనీల నుంచి స్లైడ్స్‌ తెచ్చుకుని... వాటిని సీడీల్లోనూ పెన్‌డ్రైవుల్లోనూ భద్రపరిచేవారు. అందువల్ల అపార్ట్‌మెంటుల్లో పెట్టే ప్రతి స్క్రీన్‌కీ ఓ సీడీయో/పెన్‌డ్రైవో వాడాల్సి వచ్చేది. పైగా, అప్పట్లో ఈ తెరలు మందంగా భారీ సైజులో ఉండేవి. వీటితో ఖర్చు తడిసిమోపెడు కావడంతో ఇది అంత పాపులర్‌ కాలేదు. 2015 తర్వాత ఎలక్ట్రానిక్స్‌ రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి సరికొత్త సాంకేతికతలు వచ్చాయి. వీటితో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా- ఏ అపార్ట్‌మెంటులోనైనా- స్క్రీన్‌లని నియంత్రించే వెసులుబాటు దొరికింది. కాకపోతే, అప్పట్లో దిల్లీలో తప్ప ఇవి ఎక్కడా కనిపించేవి కావు. కానీ కొవిడ్‌ లాక్‌డౌన్‌లు ఆ పరిస్థితిని మార్చేశాయి. అపార్ట్‌మెంటువాసులెవరూ రోడ్లపైకొచ్చి యాడ్స్‌ని చూసే పరిస్థితి లేకపోవడం, ‘గేటెడ్‌ కమ్యూనిటీ’ల్లో అసలు సేల్స్‌ రిప్రెజెంటేటివ్స్‌నే అనుమతించకపోవడంతో... ప్రకటనల సంస్థలకి ఈ ‘లిఫ్ట్‌-లాబీ యాడ్స్‌’ ఆలోచన అందివచ్చింది. 

మొదట్లో ప్రీమియం..

తెలుగు రాష్ట్రాల్లో 2020 ఏడాదిలోనే ఈ ట్రెండు అడుగుపెట్టినా మొదట్లో ‘ప్రీమియం’ విల్లాల్లోనే వీటిని వాడటం మొదలుపెట్టారు. వాళ్లు ఆదాయంకన్నా- లాక్‌డౌన్‌లో తమ ఇంటి సంబరాలని పంచుకోవడానికే వీటిని ఎక్కువగా ఉపయోగించుకునేవారు. ఆ తర్వాత యాడ్‌ ఏజెన్సీలు... మామూలు అపార్ట్‌మెంట్‌లనీ ఆకర్షించాలని స్క్రీన్‌లపైన అందించే ఆదాయాన్ని పెంచాయి. ఒకప్పుడు ఈ ప్రకటనలు ప్రదర్శించే ప్రతి తెరకీ రూ.450 ఇస్తే... ఇప్పుడు రూ.650 నుంచి రూ.1100 కూడా ఇస్తున్నారు. అంతేకాదు, కంపెనీల ద్వారా ఆయా అపార్ట్‌మెంట్‌లకి ప్రత్యేక రాయితీలూ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగువేల అపార్ట్‌మెంట్లలో ఈ తరహా ప్రకటనలు కనిపిస్తుంటే... హైదరాబాద్‌, విశాఖ నగరాలు ఈ విషయంలో ముందున్నాయి. ‘యాడ్‌ ఆన్‌ మో’,  ‘యాడింగ్‌’, ‘బెల్‌ ప్లస్‌’ వంటి సంస్థలూ పోటాపోటీగా ఈ స్క్రీన్‌లని పెడుతున్నాయి. వీటి మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతుండడంతో- అచిరకాలంలోనే అన్ని అపార్ట్‌మెంట్‌లలోనూ ప్రకటనలు కనిపిస్తాయని చెబుతున్నారు.  


చిన్నారుల కోసం... చిట్టితోటల కిట్‌!

‘ఎంతసేపని ఆడుకుంటాం... ఇంకెంతసేపని టీవీ చూస్తాం... మరేదైనా కొత్తగా ప్రయత్నిద్దాం’ అనుకునే పిల్లల కోసం ‘ఫెయిరీ మినియేచర్‌ గార్డెన్‌ కిట్స్‌’ దొరుకుతున్నాయి. వీటితో సరదాగా ఆడుకుంటూనే పిల్లల ఊహలకు రెక్కలు తొడగొచ్చు. ఓ అందమైన చిట్టితోటను పెంచేయొచ్చు. అదెలాగో మీరూ చూసేయండి మరి!

ఆడుకుంటూనే పిల్లల్లో సృజనాత్మకత పెంచడానికి చిన్నారుల కోసం ఆట బొమ్మలు చాలానే ఉన్నాయి. ఒక్కో చదరంలో ఒక్కో రంగును కలుపుతూ ఆడే రూబిక్‌ క్యూబ్‌ దగ్గర్నుంచి ఒకదానిమీద ఒకటి పెడుతూ చేసే బిల్డింగ్‌ బ్లాక్స్‌ వరకూ ఎన్నెన్నో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఇవేనా... బోర్‌ కొట్టేయవూ అనుకున్నారేమో తయారీదారులు వాటికి కాస్త భిన్నంగా ‘ఫెయిరీ మినియేచర్‌ గార్డెన్‌ కిట్స్‌’ను తీసుకొచ్చారు. ఇవి చిన్నారులకు కాలక్షేపాన్ని ఇవ్వడంతో పాటూ ఊహాశక్తికి పదును పెట్టి వారిలోని సృజననూ బయటకుతీస్తాయి. అంతేకాదు... మొక్కల పెంపకం పట్ల అవగాహననూ పెంచుతాయి. పిల్లల అభిరుచిని బట్టి మార్కెట్లో రకరకాల థీముల్లో దొరుకుతున్నాయివి.  

అసలేంటీ గార్డెన్స్‌..
పిల్లల గార్డెన్లు అనగానే ఉత్తుత్తి బొమ్మ కుండీలు  అనుకునేరు. ఇవి నిజమైనవే. పైగా ఈ కిట్స్‌లో మొక్కల విత్తనాలూ, సక్యులెంట్‌ మొక్కలూ, చక్కని కుండీలే కాదు... వాటితో ఓ అద్భుతమైన బుల్లి తోటను ఏర్పాటుచేయడానికి కావాల్సిన సరంజామా అంతా వస్తుంది. జానపద కథల్లోని యువరాణుల బొమ్మలతో పాటు చిట్టి ఇల్లు, బుడ్డి బుడ్డి కుర్చీలు, బల్ల, నిచ్చెన, ఊయల, చిన్ని వంతెన, బావి, చెట్లు ఇంకా కుక్క, కుందేలు, నత్త, బాతు లాంటి జంతువుల బొమ్మలెన్నో ఇందులో ఉంటాయి. వీటిని ఉపయోగిస్తూ, రంగురంగుల రాళ్లు పేర్చుతూ కుండీల్లోనే జానపద కథల్లోని సన్నివేశాల్నీ ఏర్పాటుచేయొచ్చు. అందమైన బుల్లి తోటను సృష్టించేయొచ్చు. ఒకవేళ ఎవరికివారే సొంతంగా ఓ సన్నివేశాన్ని కల్పించాలనుకుంటే... ఈ గార్డెన్‌ కిట్స్‌తో పాటు ఫెయిరీ థీమ్‌ల బొమ్మల సెట్లు విడివిడిగానూ దొరుకుతున్నాయి. ఆసక్తినీ, ఆలోచననీ బట్టి నచ్చిన అంశానికి సంబంధించిన సెట్‌ కొనుక్కుని ఇంట్లోని కుండీనే ముచ్చటైన ఫెయిరీ గార్డెన్‌లా మార్చేయొచ్చు. క్రాఫ్ట్స్‌ అంటే ఇష్టపడే పిల్లల చేతుల్లో ఈ ఫెయిరీ గార్డెన్‌ కిట్‌ను బహుమతిగా పెట్టిచూడండి. రకరకాల మొక్కల్ని జాగ్రత్తగా పెంచడమే కాకుండా తమ సృజనాత్మకతను చూపిస్తూ చిట్టి తోటను అందంగా అలంకరించి చూపిస్తారు. ఒకవైపు పిల్లల నైపుణ్యాన్ని పెంచుతూనే మరో వైపు ఖాళీ సమయాల్లో చక్కని వ్యాపకంలా ఉన్న ఈ గార్డెన్‌ తయారీ ఆలోచన అదిరింది కదూ!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..