నేడే నవ్వుల పండగ

సంతోషానికీ, ఆనందానికీ బాహ్య సంకేతం నవ్వు. గిలిగింతలకీ, ఛలోక్తులకీ మాత్రమే కాదు నైట్రస్‌ ఆక్సైడ్‌ పీల్చినప్పుడూ, కొన్ని మాదకద్రవ్యాలు వాడినప్పుడు కూడా బిగ్గరగా నవ్వుతారు.

Published : 01 May 2022 00:55 IST

నేడే నవ్వుల పండగ

సంతోషానికీ, ఆనందానికీ బాహ్య సంకేతం నవ్వు. గిలిగింతలకీ, ఛలోక్తులకీ మాత్రమే కాదు నైట్రస్‌ ఆక్సైడ్‌ పీల్చినప్పుడూ, కొన్ని మాదకద్రవ్యాలు వాడినప్పుడు కూడా బిగ్గరగా నవ్వుతారు. అందుకే  నైట్రస్‌ ఆక్సైడ్‌ని నవ్వుల వాయువు (లాఫింగ్‌ గ్యాస్‌) అని పిలుస్తారు.


నవ్వడం వల్ల రక్త నాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.


నవ్వెందుకు వస్తుంది... అసలెందుకు నవ్వాలి... వంటి విషయాలను గురించి తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన శాస్త్రం జెలొటాలజీ చదవాల్సిందే.


1950ల్లో ప్రజలు రోజుకి సుమారు 18 నిమిషాల పాటు నవ్వేవారు. ప్రస్తుతం ఆ సమయం 4-6 నిమిషాలకు పడిపోయిందట.


నవ్వినప్పుడు 12 ముఖ కండరాలు కదులుతాయి. ఫలితంగా ముఖానికి చక్కటి వ్యాయామం అంది చర్మం నిగారింపుగా కనిపిస్తుంది. అందుకే ఎంత ఎక్కువ నవ్వితే అంత అందంగా కనిపిస్తారట.


నవ్వితే... నొప్పుల నివారణకు ఉపయోగపడే ఎండార్ఫిన్‌ హార్మోను శరీరంలో విడుదల అవుతుంది.


నవ్వడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అందుకే పాశ్చాత్య దేశాల్లో హ్యూమర్‌, జోకర్‌ థెరపీలతో పాటు లాఫింగ్‌ ఆసుపత్రులూ ఆదరణ పొందుతున్నాయట.


‘కురు’ అనే వ్యాధికి లోనైన వారు ఒళ్లంతా కదిలేలా ఆపకుండా నవ్వుతూ...అలానే ప్రాణాలు పోగొట్టుకుంటారు. కురు అంటే వణుకు అని అర్థం. దీన్నే లాఫింగ్‌ సిక్‌నెస్‌ అని కూడా పిలుస్తారు. పపువా న్యూగినియాలోని ఫోరె అనే తెగలో ఎక్కువమంది ఈ వ్యాధితో మరణించారని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.


టెక్నాలజీ పెరిగాక... మెసేజీలకు ప్రాధాన్యం పెరిగింది. వినియోగదారులు తమ సంతోషాన్నీ, నవ్వునీ వ్యక్తపరిచేందుకు 2010 నుంచి లాఫింగ్‌ ఎమోజీని వాడటం మొదలుపెట్టారు. దీన్నే ‘ది ఫేస్‌ విత్‌ టియర్స్‌ ఆఫ్‌ ఎమోజీ’గా పిలుస్తారు. నవ్వీ నవ్వీ కళ్లల్లోంచి నీళ్లొచ్చినట్లుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది ఈ బొమ్మ. ఇంటర్నెట్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువసార్లు ఉపయోగించిన ఎమోజీ కూడా ఇదే.


మనుషులే కాదు. కుక్కలూ, కోతులూ, గొరిల్లాల వంటి జంతువులూ నవ్వుతాయి.


ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా, ఎవ్వరితోనైనా మాట్లాడగలిగే భాష నవ్వే.


ఏ దేశంలోనైనా సరే హహ్హహ్హ... హొహ్హొహ్హొ... హిహ్హిహ్హి అనే నవ్వుతారట.


సాధారణంగా మనిషి రోజుకి 13-15 సార్లు నవ్వుతారనేది ఓ అంచనా. అదే ఆరేళ్లలోపు పిల్లలైతే సుమారు 400 సార్లు నవ్వుతారట. 


ఎంత ఎక్కువ నవ్వితే ఊపిరితిత్తులకు అంత బాగా ఆక్సిజన్‌ అందుతుంది. అయితే, విపరీతంగా నవ్వినప్పుడు మాత్రం ఊపిరి తీసుకోవడం కాస్త కష్టమే. విచిత్రంగా ఉంది కదూ!


పదిహేను నిమిషాల నవ్వు రెండుగంటల నిద్రతో సమానం. రోజుకి 15 సెకన్లు ఎక్కువగా నవ్వితే ఆయుష్షు మరో రెండు రోజులు పెరిగినట్లే.


ఎవరు నవ్వినా తమను చూసే నవ్వుతున్నారని బాధపడడం ఓ రుగ్మత. దీన్ని జెలటోఫోబియా అంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..