Updated : 05 Dec 2021 06:10 IST

పర్యావరణహితులు!

ప్లాస్టిక్‌ ఎంత ప్రమాదకరమో చదువుతున్నాం... వ్యర్థాలతో అనర్థాలనూ ప్రత్యక్షంగా చూస్తున్నాం. న్యాయస్థానాలూ, ప్రభుత్వాలూ ఎంత నిషేధం విధిస్తున్నా ఆశించిన ప్రయోజనం ఒనగూరడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొందరు కాలుష్య కారక వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తున్నారు. వారి పర్యావరణహిత ఆలోచనలను అంకుర సంస్థల రూపంలో ఆచరణలోకి తీసుకొస్తున్నారు. అలాంటివే ఇవి...


ప్లాస్టిక్‌ నుంచి వస్త్రం

ఆదిత్యది రాజస్థాన్‌లోని ఓ టెక్స్‌టైల్‌ వ్యాపార కుటుంబం. కాలేజీలో స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ చదవాల్సిన వయసులోనే ఓ అంకుర సంస్థను నెలకొల్పాడతను. రెండేళ్ల క్రితం అతడి మావయ్య చైనా వెళ్తుంటే తనూ కూడా వెళ్లాడు. అక్కడి పరిశ్రమల్లో అధునాతన యంత్రాలనూ వాటి పనితీరునూ గమనించాడు. తిరిగొచ్చాక, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్‌ నుంచి ఫ్యాబ్రిక్‌(వస్త్రం) తయారు చేయాలనుకున్నాడు. కుటుంబ సభ్యులూ సరేననడంతో... ‘ట్రాష్‌ టు ట్రెజర్‌’ నినాదంతో గత జనవరిలో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టాడు. కొన్ని ఏజెన్సీల నుంచి కవర్లూ, బాటిళ్లూ, ఇతర ప్లాస్టిక్‌ సంబంధిత వస్తువులూ సేకరిస్తూ వాటి నుంచి మందపాటి వస్త్రం తయారు చేయడం ప్రారంభించాడు. ఈ సంస్థ ఇప్పటివరకు పది టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసింది. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా నేరుగా తమకు అందించాలని తమ ప్రాంత ప్రజలకు సూచిస్తున్నాడీ యువపారిశ్రామికవేత్త.


కవర్లూ బాటిళ్లతో బూట్లు

ప్లాస్టిక్‌ పునర్వినియోగ ఆలోచనతో పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు అందుకున్నాడో యువకుడు. నిండా పాతికేళ్లు లేని అజయ్‌ భావె స్థాపించిన అంకుర సంస్థలో పెట్టుబడి కూడా పెడతానని భరోసా కల్పించారాయన. ప్లాస్టిక్‌ కవర్లూ, బాటిళ్లను రీసైకిల్‌ చేసి బూట్లు(స్నీకర్స్‌) తయారు చేస్తుందీ స్టార్టప్‌. దుబాయ్‌కి చెందిన అజయ్‌ బీబీఏ చదువుకుంటూనే ప్లాస్టిక్‌ను ఫ్యాబ్రిక్‌గా మార్చే అంశంపై రెండేళ్లపాటు వివిధ పరిశోధనలు చేసి ఒక నమూనాను రూపొందించాడు. ఆ ఫ్యాబ్రిక్‌ను లెదర్‌ తరహాలో షూ తయారీకి వాడొచ్చని నిర్ధారించుకున్నాడు. ఆ నమూనాను తాను చదువుతున్న యూనివర్సిటీ నిర్వహించిన స్టార్టప్‌ పోటీలకు పంపాడు. ఉత్తమ ఆలోచనగా అవార్డూ దక్కించుకున్నాడు. చాలామంది పెట్టుబడి పెట్టడానికి ముందుకురావడంతో ఆ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి ఒక నమూనా షూ(స్నీకర్‌) తయారు చేశాడు. కొన్ని పరిశీలనల తర్వాత దానికి మరికొన్ని మార్పులూ చేర్పులూ చేశాడు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు హిందీలో ప్లాస్టిక్‌ అన్న అర్థమొచ్చేలా ‘థేలే’ పేరిట గత జులైలో అంకుర సంస్థను ప్రారంభించాడు. దాని ద్వారా ప్లాస్టిక్‌ సంచులూ, బాటిళ్లనూ కరిగించి చేసిన ఫ్యాబ్రిక్‌తో స్నీకర్స్‌ తయారీకి శ్రీకారం చుట్టాడు. దేశంలోని పలు చెత్త నిర్వహణ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుందీ సంస్థ. వారి నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను గురుగ్రామ్‌, జలంధర్‌లో ఉన్న కర్మాగారాలకు తరలిస్తారు. అక్కడ వివిధ దశల్లో బూట్లను తయారు చేస్తారు. ఈ క్రమంలో వినియోగించే ఫ్యాబ్రిక్‌, దారం, గ్లూ, ప్యాకేజీ కవర్‌, అట్టపెట్టెలు సహా ప్రతి ఒక్కటీ రీసైకిల్‌ చేసినవే. బూట్లు వేసుకున్నాక, ఆ అట్టపెట్టెను ముక్కలుగా కత్తిరించి భూమిలో పాతితే పది రోజుల్లో అందులోంచి మొక్క మొలుస్తుంది. ఈ సంస్థ ఇప్పటివరకు 50 వేల ప్లాస్టిక్‌ సంచులూ, 35 వేల ప్లాస్టిక్‌ బాటిళ్లనూ రీసైకిల్‌ చేసింది. ‘ఒక షూ తయారీకి 12 ప్లాస్టిక్‌ బాటిళ్లూ, 10 కవర్లూ అవసరమవుతాయి. మా షూస్‌ వంద శాతం వీగన్‌’ అని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అజయ్‌ గర్వంగా ప్రకటిస్తున్నాడు.  


పరిశ్రమల్లో వినియోగించేలా...

చెన్నైకి చెందిన అయిదుగురు యువకులు ‘సముద్యోగ’ పేరిట బృందంగా 2018లో ఐఐటీ మద్రాస్‌ నిర్వహించిన ‘కార్బన్‌ జీరో ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 9 శాతం ప్లాస్టిక్‌ను మాత్రమే రీసైకిల్‌ చేస్తున్నారని తెలుసుకున్నారు. తర్వాత స్థానికంగా ఉన్న కొన్ని రీసైౖక్లింగ్‌ ప్లాంట్లకు వెళ్లి పరిశీలించారు. వాటి పనితీరు సాధారణంగా ఉన్నట్లు గమనించి.. ప్లాస్టిక్‌ పునర్వినియోగానికి సొంతంగా ఓ నమూనాను రూపొందించారు. వారి ఆలోచన నచ్చడంతో ఓ సంస్థ రూ.కోటి ఫండింగ్‌ అందించింది. దాంతో గత జనవరిలో ‘సముద్యోగ వేస్ట్‌ చక్ర’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టిందా బృందం. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పరిశ్రమల్లో వినియోగానికి అనువైన ఆయిల్‌ తీయడం వీరి లక్ష్యం. జులైలో పైలట్‌ ప్రాజెక్టుగా రోజుకి 250 కేజీల వ్యర్థాల నుంచి 200 లీటర్ల ఆయిల్‌ తీయగలిగే సామర్థ్యంతో ప్లాంట్‌ను ప్రారంభించారు.


 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని