చాట్‌.. చకచకా చేసేద్దాం!

చాట్‌ ఇష్టపడని పిల్లలుండరు. వాళ్లు ఖాళీగా ఇళ్లల్లో ఉండే ఈ సమయంలో... తరచూ బయట చాట్‌ తినిపించాలంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగని ఇంట్లో చేద్దామంటే సెనగలు నానబెట్టి, ఉడికించి ఇతర పదార్థాలు కలిపి.. అమ్మో చాలా పని. అందుకే వాటితో పనిలేకుండానే అప్పుడప్పుడూ  ఇలాంటి చాట్‌ రుచుల్ని పిల్లలకు చూపించేయండి మరి.  

Updated : 22 May 2022 06:15 IST

చాట్‌.. చకచకా చేసేద్దాం!

చాట్‌ ఇష్టపడని పిల్లలుండరు. వాళ్లు ఖాళీగా ఇళ్లల్లో ఉండే ఈ సమయంలో... తరచూ బయట చాట్‌ తినిపించాలంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగని ఇంట్లో చేద్దామంటే సెనగలు నానబెట్టి, ఉడికించి ఇతర పదార్థాలు కలిపి.. అమ్మో చాలా పని. అందుకే వాటితో పనిలేకుండానే అప్పుడప్పుడూ  ఇలాంటి చాట్‌ రుచుల్ని పిల్లలకు చూపించేయండి మరి.


బ్రెడ్‌ పకోడీ చాట్‌

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: నాలుగైదు, సెనగపిండి: కప్పు, ఉల్లిపాయలు: రెండు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పసుపు: పావుచెంచా, పచ్చిమిర్చి: రెండు, జీలకర్ర: చెంచా, కారం: పావుచెంచా, ఉప్పు: తగినంత, తియ్యని పెరుగు: కప్పు, స్వీట్‌చట్నీ: పావుకప్పు, గ్రీన్‌చట్నీ: పావుకప్పు, జీలకర్రపొడి: పావుచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, సన్నకారప్పూస: అరకప్పు, దానిమ్మగింజలు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీవిధానం: ఓ గిన్నెలో సెనగపిండి, జీలకర్ర, ఒక ఉల్లిపాయ తరుగు, సగం కొత్తిమీర తరుగు, పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం వేసుకుని కలిపి.. నీళ్లు పోసి బజ్జీల పిండిలా చేసుకోవాలి. ఒక్కో బ్రెడ్‌స్లైసునీ ఈ పిండిలో ముంచి... నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. వీటిని చిన్నచిన్న ముక్కల్లా కోసి ప్లేటులో సర్దుకుని వాటిపైన పెరుగు వేసి తరవాత స్వీట్‌చట్నీ, గ్రీన్‌చట్నీ, జీలకర్రపొడి, మరో ఉల్లిపాయ తరుగు, చాట్‌మసాలా, సన్నకారప్పూస, మిగిలిన కొత్తిమీర తరుగు వేయాలి. చివరగా దానిమ్మగింజలు చల్లితే సరి.


కార్న్‌ఫ్లేక్స్‌తో...

కావలసినవి: కార్న్‌ఫేక్ల్స్‌: ఒకటిన్నర కప్పు, వెన్న: చెంచా, టొమాటో ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: మూడు, ఉల్లిపాయముక్కలు: కప్పు, కీరదోస తరుగు: అరకప్పు, ఉడికించిన స్వీట్‌కార్న్‌: పావుకప్పు, చాట్‌మసాలా: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, సన్న కారప్పూస: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, నిమ్మకాయ: సగంచెక్క.

తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి వెన్న వేయాలి. అది వేడెక్కాక కార్న్‌ఫ్లేక్స్‌ను దోరగా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడి కొద్దిగా తగ్గాక మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలిపి చివరగా నిమ్మరసం పిండాలి.


ఆలూ పట్టీ చాట్‌

కావలసినవి: ఉడికించిన బంగాళాదుంపలు: ఆరు, వేయించిన జీలకర్ర: చెంచా, దనియాలపొడి: రెండు చెంచాలు, చాట్‌మసాలా: ఒకటిన్నర చెంచా, కారం: చెంచా, గరంమసాలా: అరచెంచా, పచ్చిమిర్చి: మూడు, కొత్తిమీర తరుగు: అరకప్పు, ఉప్పు: తగినంత, బ్రెడ్‌పొడి: పావుకప్పు, నూనె: కప్పు, తియ్యని పెరుగు: కప్పు, స్వీట్‌చట్నీ: రెండు చెంచాలు, గ్రీన్‌చట్నీ: రెండు చెంచాలు, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, సన్నకారప్పూస: పావుకప్పు.

తయారీవిధానం: బంగాళాదుంపల్ని తురుముకుని ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో బ్రెడ్‌పొడి, దనియాలపొడి, జీలకర్ర, సగం చాట్‌మసాలా, కారం, గరంమసాలా, పచ్చిమిర్చి తరుగు, పావుకప్పు కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని టిక్కీల్లా చేసుకోవాలి. తరవాత వాటిని పెనంమీద ఉంచి... నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఈ టిక్కీలను ఓ ప్లేటులో సర్దుకుని... పైన పెరుగు, స్వీట్‌చట్నీ, గ్రీన్‌చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, మిగిలిన కొత్తిమీర తరుగు, చాట్‌మసాలా, సన్నకారప్పూస వేసుకుంటే చాలు.


చిట్కా

ఆ చట్నీలు ఎలాగంటే...

చాట్‌, సమోసాల్లోకి తినే స్వీట్‌చట్నీ, గ్రీన్‌చట్నీలను ఇంట్లోనే హోటల్‌ రుచిలో ఎలా చేసుకోవాలంటే...

* గ్రీన్‌చట్నీ: ఇందుకోసం అరకప్పు పుదీనా, కప్పు కొత్తిమీర, రెండు టేబుల్‌స్పూన్ల వేయించిన పల్లీలు, చిన్న అల్లంముక్క, మూడు వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా చొప్పున జీలకర్ర- చాట్‌మసాలా, రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, పావుచెంచా చక్కెర, తగినంత ఉప్పు, మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుంటే చాలు.

* స్వీట్‌చట్నీ: కప్పు గింజలు తీసేసిన ఖర్జూరాలు, నిమ్మకాయంత చింతపండు, అరకప్పు బెల్లం తరుగు, అరచెంచా కారం, చెంచా జీలకర్రపొడి, తగినంత ఉప్పు తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి.. ఈ పదార్థాలన్నీ వేయాలి. ఇరవై నిమిషాలయ్యాక స్టౌని కట్టేసి.. ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి తరువాత మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకుని వడకట్టుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..