ప్రమాదంలో పాడైన ముఖం... 3డి ప్రింట్‌తో యథాతథం!

ఐఐటీ-మద్రాస్‌... ఆ మధ్య అత్యాధునిక ‘3డీ ప్రింటింగ్‌’ సాయంతో అతితక్కువ కాలంలోనే ఇళ్ళని నిర్మించిన సంగతి వినే ఉంటారు.

Updated : 11 Feb 2024 09:45 IST

ఐఐటీ-మద్రాస్‌... ఆ మధ్య అత్యాధునిక ‘3డీ ప్రింటింగ్‌’ సాయంతో అతితక్కువ కాలంలోనే ఇళ్ళని నిర్మించిన సంగతి వినే ఉంటారు. ఇప్పుడు అదే సాంకేతికతని- ప్రమాదాల వల్లో, క్యాన్సర్‌ కారణంగానో ముఖాకృతిని కోల్పోయిన వాళ్ళ కోసం ఉపయోగిస్తోంది ఆ సంస్థ. సాధారణంగా ఇటువంటి బాధితులకి ముఖంలోని కీలక ఎముకల్ని తీసేస్తుంటారు. వాటిని మళ్లీ కృత్రిమంగా అమర్చాలంటే కనీసం యాభై లక్షలదాకా ఖర్చవుతుండేది. ఐఐటీ సాంకేతికత పుణ్యమాని ఇప్పుడు ఆ ఖర్చు భారీగా తగ్గడమే కాదు... పేదవాళ్ళకి ఉచితంగానూ చికిత్స చేయగలుగుతున్నారు!

ప్రమాదాలు, క్యాన్సర్‌, ఇతర కణితుల వల్లే కాదు... ‘బ్లాక్‌ ఫంగస్‌’ వ్యాధి వల్ల కూడా కొందరికి ముఖంలోని కీలక భాగాల్ని తీసేయాల్సి వస్తుంది. 2021 కరోనా రెండో ఉద్ధృతి సమయంలో మనదేశంలో వేలాదిమందికి ఇలాంటి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన అరవై ఏళ్ళ కిషన్‌ వారిలో ఒకరు. చిరువ్యాపారిగా  స్వయంకృషితో ఎదిగినవాడాయన. కరోనా సమయంలో కిషన్‌, ఆయన భార్యా ఆ వ్యాధి బారినపడ్డారు. ఇద్దరికీ బ్లాక్‌ ఫంగస్‌ కూడా సోకింది. సమస్యని పసిగట్టకముందే ఆయన భార్య చనిపోయారు. కిషన్‌ పరిస్థితి కూడా విషమించడంతో వైద్యులు ఆయన ముఖంలో బ్లాక్‌ఫంగస్‌ సోకిన భాగాల్ని తొలగించారు. అలా ఎడమకన్ను, ముఖం మధ్యనున్న ఎముక(పై దవడ), కింది దవడ ఎముకలన్నీ తొలగించేశారు. దాంతో బతికిబయటపడ్డా మాట కోల్పోయారు, ద్రవాహారం తప్ప ఏమీ తీసుకోలేకపోయారు. అరవై ఏళ్ళకే జీవచ్ఛవంలా మారిన ఆయనకి కొత్త జీవితాన్నివ్వాలనుకున్నారు ఆయన పిల్లలు. ఇలాంటివాళ్ళకి ‘ఫేషియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ ఆపరేషన్‌ చేస్తారని వాళ్ళు విన్నారు. కానీ, మనదేశంలో దానికి కనీసం 30 లక్షల రూపాయలన్నా అవుతాయని తెలిసి నిరాశలో కూరుకుపోయారు. ఐఐటీ- మద్రాస్‌ సాంకేతికత కిషన్‌ కుటుంబాన్ని ఆదుకుంది. అదెలాగో చూసేముందు... ‘ఫేషియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ ఆపరేషన్‌ గురించి కొద్దిగా తెలుసుకోవాలి...

18 గంటల ఆపరేషన్‌...

‘ఫేషియల్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ ఆపరేషన్‌లో పక్కటెముకలు, కటి, కాళ్ళ నుంచి చిన్నసైజులో ఎముకల్ని తీసి ముఖంలో పెడతారు. ‘గ్రాఫ్టింగ్‌’ పద్ధతిలో అవి ఎదిగేలా చూస్తారు. కొత్తగా పెట్టిన ఎముకకి అనుగుణంగా చుట్టుపక్కలున్న సున్నితమైన కండరాలనీ, నరాలనీ జాగ్రత్తగా అతికిస్తారు. ఈ ‘మైక్రోవాస్క్యులర్‌ సర్జరీ’కి 18 గంటల సమయం పడుతుంది! ఇంతచేసీ- ఆపరేషన్‌ జరిగిన రెండేళ్ళకిగాని రోగులు ఆహారం తినలేరు, మాట్లాడలేరు. చెన్నైకి చెందిన డాక్టర్‌ కార్తిక్‌ బాలాజీ ఈ శస్త్రచికిత్సని సులువుగా మార్చడానికి గత పాతికేళ్ళుగా పరిశోధిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగానే గ్రాఫ్టింగ్‌ పద్ధతిలో ఎముకలు కాస్త ఎదిగాక- వాటికి అదనంగా కృత్రిమ అవయవాలు (ఇంప్లాంట్స్‌) జతచేసే పద్ధతిని తెచ్చాడు. ఈ పద్ధతిలో పేషెంట్స్‌ కోలుకునే సమయం ఏడాదికి తగ్గింది. ఇలాంటి కృత్రిమ అవయవాలపైన పరిశోధన, తయారీ కోసమే జోరియా-ఎక్స్‌ అనే స్టార్టప్‌ని ప్రారంభించాడు. కానీ ఆ పరికరాలని పూర్తిస్థాయిలో తయారుచేయలేక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండేవాడు. దాంతో ఖర్చు కనీసం పాతిక లక్షల రూపాయలదాకా అయ్యేది. అయినాసరే, ఆ అవయవాలు- రెడీమేడ్‌ డ్రెస్సుల్లాగా- పేషెంట్‌ అవసరానికన్నా తక్కువో ఎక్కువో ఉండేవి. అందువల్ల ఆపరేషన్‌ సంక్లిష్టంగా మారేది. అలా కాకుండా- అణువంత కూడా ఎక్కువ తక్కువలు లేకుండా, మనిషి ఆకారానికి తగినట్లుగా పూర్తి కచ్చితత్వంతో కృత్రిమ అవయవాల తయారీ కోసం అన్వేషిస్తుండేవాడు డాక్టర్‌ కార్తిక్‌. ఈ సమస్యని ఓ సారి ఐఐటీ- మద్రాసులోని మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులతో చర్చించాడు. అప్పుడే వాళ్ళు ‘3డీ ప్రింటర్‌’తో ఇది సాధ్యమని చెప్పారు. చెప్పడమే కాదు- కొద్ది రోజుల్లోనే... అలాంటి 3డీ ప్రింటర్‌ని తయారుచేయగలిగారు. దీంతో ఫేస్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సర్జరీలో ఓ విప్లవమే చోటుచేసుకుంది. 18 గంటల ఆపరేషన్‌ సమయం కాస్తా రెండుగంటలకి తగ్గిపోయింది. రోగులు ఏళ్ళ తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నెలలోనే తింటున్నారు, మాట్లాడుతున్నారు. కొత్త పలువరసతో చక్కగా నవ్వగలుగుతున్నారు. ఇప్పటిదాకా 450 మందికి ఈ శస్త్రచికిత్స చేశారు. వాళ్ళలో హైదరాబాద్‌కి చెందిన కిషన్‌ ఒకరు!

నిరుపేదల కోసం...

ఐఐటీ మద్రాసు 3డీ ప్రింటర్‌తో- ఒకప్పుడు పాతికలక్షలున్న కృత్రిమ అవయవాల ధర రూ.8 లక్షలకి తగ్గింది. అది కూడా నిరుపేదలకి భారమే కదా! ఈ నేపథ్యంలోనే... ఐఐటీ-మద్రాసు, జోరియా-ఎక్స్‌ కలిసి ‘రైట్‌టుఫేస్‌’ అనే పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా- దాతల సాయంతో నిరుపేదలకి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. తెలంగాణ సహా దేశంలోని పలురాష్ట్రాల ఆసుపత్రులు ఇందులో భాగస్వాములుగా ఉంటున్నాయి. అక్కడి సర్జన్‌లు సిఫార్సు చేసిన పేషెంట్‌లకి పూర్తి చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు.... ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా అరవైమంది ఇలా లబ్ధిపొందారు. వాళ్ళలో - ఒక్క హైదరాబాద్‌ కేంద్రంగానే డజనుమంది ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..