జనం కోసం స్థలం ఇచ్చేశారు!

సొంత స్థలం ఉంటే బాగా ధర వచ్చాక అమ్మడమో లేదంటే వాటిలో కమర్షియల్‌ భవనాలు కట్టి వ్యాపారం చేయడమో చేస్తుంటారు చాలామంది.

Updated : 11 Dec 2022 05:41 IST

జనం కోసం స్థలం ఇచ్చేశారు!

సొంత స్థలం ఉంటే బాగా ధర వచ్చాక అమ్మడమో లేదంటే వాటిలో కమర్షియల్‌ భవనాలు కట్టి వ్యాపారం చేయడమో చేస్తుంటారు చాలామంది. కానీ, వీళ్లు మాత్రం సాటివారి మేలు కోసం విలువైన తమ స్థలాలను దానం చేసి  మంచి మనసును చాటుకుంటున్నారు.  


ఊరి కోసం...

ఆరేళ్ల వయసులో అమ్మానాన్నలను పోగొట్టుకుని అనాథ అయ్యాడు... ఊరి వాళ్ల సాయంతో చదువుకున్నాడు... టీచర్‌ ఉద్యోగం సంపాదించాడు... మరి తనను తల్లిలా ఆదరించిన పల్లె రుణం ఎలా తీర్చుకోవాలి? యూపీలోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌శరణ్‌ శాక్య అదే ఆలోచించాడు ... తనకు వారసత్వంగా వచ్చిన ఎకరం భూమిని స్వగ్రామం నాగ్లా అంగద్‌ బాగుకోసం ఆనందంగా రాసిచ్చేశాడు.

ఆ ఊళ్లో బడి లేకపోవడంతో అక్కడి విద్యార్థులు బయటి గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. దాంతో చాలామంది మధ్యలోనే చదువులకు దూరమయ్యే వాళ్లు. కొన్నాళ్ల క్రితం ఆ ఊరికి ఒక ప్రాథమిక పాఠశాల మంజూరైంది. అందుకోసమని విద్యాశాఖాధికారులు స్థలం కోసం వెతుకుతుంటే... రామ్‌శరణ్‌ లక్షలు ఖరీదు చేసే తన భూమిని పెద్ద మనసుతో వాళ్లకు  అప్పగించాడు. అతడి ఆధ్వర్యంలోనే 117 మందితో ప్రారంభమైన ఆ బడిలో ఇప్పుడు మూడొందల మందికిపైగా చదువుకుంటున్నారు. అక్కడ ఓనమాలు దిద్ది ఉన్నతోద్యోగాలు సాధించిన ఎంతోమంది ఇప్పటికీ అదంతా ‘రామ్‌శరణ్‌ మాస్టారి చలవే’ అంటుంటారు.


అమ్మ జ్ఞాపకార్థం...

సిటీలో అరవై సెంట్లకు పైగా స్థలం అంటే ఎంత రేటు ఉంటుంది? అందులోనూ కొచ్చీ లాంటి నగరంలోని రద్దీ ప్రాంతంలో అంటే- అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది కదా. కానీ, కె.ఎల్‌.జోసెఫ్‌ అలోసియస్‌ అనే 76 ఏళ్ల పెద్దాయన మాత్రం అలా కమర్షియల్‌గా ఆలోచించలేదు. పేదలకు కొంత భూమిని ఉదారంగా ఇచ్చేశాడు. మిగిలినది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రోడ్డు నిర్మాణాలకోసం కొచ్చి నగరపాలక సంస్థకు ఉచితంగా అందించాడు. కేరళ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు రిటైర్డ్‌ ఇంజినీర్‌ అయిన జోసెఫ్‌కు పది సెంట్ల స్థలముంది. ఆయన తల్లి నుంచి మరో యాభై సెంట్ల స్థలం వాటాగా వచ్చింది. అయితే, సొంత భూమి అంటూ లేని 12 కుటుంబాలు... ఎన్నో ఏళ్లుగా ఆ ఖాళీ స్థలంలోనే నివాసముంటున్నాయి. వాళ్లను ఖాళీ చేయించి అక్కడ కమర్షియల్‌ భవనం కడితే నెల తిరిగేసరికి లక్షల రూపాయల అద్దెలు వచ్చిపడతాయి. కానీ జోసెఫ్‌కు అలా చేయడం ఇష్టం లేదు. పెద్ద మనసుతో తన భూమిలో 42.75 సెంట్ల స్థలాన్ని గూడులేని ఆ పేదలకు రాసిచ్చేశాడు. మిగిలినదాన్ని ప్రాథమిక ఆసుపత్రి నిర్మాణం కోసం, మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రాసిచ్చేశాడు. ఎందుకు అలా చేశావంటే... ‘కష్టాల్లో ఉన్నవాళ్లకి సాయపడమని అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. ఆమె స్ఫూర్తితోనే ఈ  మంచి పనిచేశా...’ అంటాడు జోసెఫ్‌.


నాన్న కలను నెరవేర్చడానికి...

తన భూమిని ఊళ్లోని పాఠశాలకు ఇచ్చి, ఆ బడి మరింత వృద్ధిలోకి వస్తే చూడాలన్నది మహమ్మద్‌ జాఫర్‌ కల. అది నెరవేరకుండానే ఆరేళ్ల క్రితం అతడు మరణించాడు. జాఫర్‌ కలను నెరవేర్చేందుకు అతడి నలుగురు పిల్లలూ నిస్వార్థంగా ముందుకొచ్చారు. తండ్రి గుర్తుగా దాదాపు రెండున్నర ఎకరాల భూమిని ఈ మధ్యనే  కర్ణాటకలోని మైసూర్‌కు సమీపంలోని బచెగౌడనహళ్లి గ్రామంలోని స్కూలుకి అప్పగించారు. ఒకటి నుంచి ఏడో తరగతి దాకా రెండొందల మందికి పైగా పిల్లలు చదువుకుంటున్న ఆ స్కూలు పబ్లిక్‌ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌ కావాలంటే ఆటస్థలం ఉండాలి. జాఫర్‌ పిల్లలు ఇచ్చిన భూమి అందుకు ఉపయోగపడుతుంది. అక్కడ ఎకరం రూ.20 లక్షలు పలుకుతోందట. కానీ, జాఫర్‌ కుటుంబం మాత్రం ఆ సొమ్ముకు ఆశపడలేదు. ఆస్తికోసం తల్లిదండ్రులను వేధించుకుతింటున్న పిల్లలు ఉన్న కాలమిది. అటువంటిది చనిపోయిన తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ముందుకు రావడం... స్కూల్‌ పేరిట భూమి రాసివ్వడం అభినందనీయం కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..