ఆయన ఫోన్‌ చేస్తే... నమ్మలేకపోయా!

తెలుగు తెరపై ఉప్పెనలా ఎగసింది కృతిశెట్టి. వరస హిట్లతో కుర్రకారు గుండెల్లో బుల్లెట్‌ బండిలా దూసుకుపోతోంది. పదహారణాల తెలుగమ్మాయి బేబమ్మగా ప్రేక్షకులకు పరిచయమై... మోడ్రన్‌ లుక్‌లో బేబీగా విజిల్‌ వేస్తున్న కృతి తన సినీ ప్రయాణం ఎలా సాగిందో చెబుతోందిలా...

Updated : 15 Aug 2022 17:20 IST

ఆయన ఫోన్‌ చేస్తే... నమ్మలేకపోయా!

తెలుగు తెరపై ఉప్పెనలా ఎగసింది కృతిశెట్టి. వరస హిట్లతో కుర్రకారు గుండెల్లో బుల్లెట్‌ బండిలా దూసుకుపోతోంది. పదహారణాల తెలుగమ్మాయి బేబమ్మగా ప్రేక్షకులకు పరిచయమై... మోడ్రన్‌ లుక్‌లో బేబీగా విజిల్‌ వేస్తున్న కృతి తన సినీ ప్రయాణం ఎలా సాగిందో చెబుతోందిలా...

చాలామంది నటీనటులు ‘డాక్టర్ని కాబోయి యాక్టర్ని అయ్యా’నని చెప్పడం నాకు తెలుసు. ప్రాస కోసం వాళ్లలా చెబుతున్నారులే అని నవ్వుకునేదాన్ని. స్నేహితులతో కలిసి జోకులు కూడా వేస్తుండేదాన్ని. ఇప్పుడు ప్రేక్షకులు నన్ను కూడా అలానే అనుకుంటున్నారేమో. ఎందుకంటే నేను కూడా చిన్నప్పట్నుంచీ డాక్టర్ని అవ్వాలని ఎన్నో కలలు కన్నా. దానికి కారణం- ముంబయిలో మా ఇంటి దగ్గరలోని ఓ డాక్టరు... డబ్బుకోసం అనవసరమైన మందులు రాసివ్వడం, పేదవారని కూడా చూడకుండా ఎక్కువ ఫీజు తీసుకోవడం వంటివి చేసేవాడు. ఆయన్ని చూశాక డాక్టర్ని అయి- రోగుల పట్ల నిజాయతీగా ఉంటూ, పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనుకున్నా. అంతేతప్ప నటన, సినిమాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.

మా అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌ కావడంతో తనకు తెలిసిన వాళ్ల వల్ల ఆరో తరగతిలో ఉన్నప్పుడే యాడ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. దాంతో చదువుకుంటూనే ప్రకటనలు చేసేదాన్ని. ఇంటర్‌లో ఉన్నప్పుడు అందుకు సంబంధించిన ఓ వర్క్‌షాపులో పాల్గొన్నా. అప్పుడే నాకు హృతిక్‌రోషన్‌ హీరోగా నటించిన, ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌ ‘సూపర్‌ 30’లో నటించే అవకాశం వచ్చింది. విద్యార్థినిగా చిన్న రోల్‌లో సరదాగా నటించా. అప్పటికీ నాకు సినిమాల్లో నటించాలనే ఆలోచనే లేదు. ఆ తరవాత తెలిసిన ఒకతను నాకు చెప్పకుండానే డైరెక్టర్‌ బుచ్చిబాబుకు నా ఫొటోలు పంపాడు. వాటిని చూసిన దర్శకుడు అమ్మానాన్నల్ని సంప్రదించి ‘ఉప్పెన’ అవకాశం గురించి చెప్పారు. సినిమాల గురించి అసలేమీ తెలియని నేను నో చెప్పాలనుకున్నా. అమ్మానాన్నలు మాత్రం ‘ఏం ఫర్వాలేదు నటించు...నువ్వు తప్పకుండా స్టార్‌ అవుతావు. ముందు ప్రయత్నించు...’ అని ప్రోత్సహించి హైదరాబాద్‌ పంపారు. ‘ఉప్పెన’ కథ విన్నాక నాకే మనస్ఫూర్తిగా చేయాలనిపించింది. తెలియకుండానే బేబమ్మ పాత్రలో లీనమైపోయి పల్లెటూరి అమ్మాయిలు ఎలా ఉంటారూ, ఎలా నడుస్తారూ, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తారూ వంటివన్నీ తెలుసుకున్నా. హీరోయిన్లను పల్లెటూరి అమ్మాయిలా చూపించిన కొన్ని తెలుగు సినిమాలు చూసి ఓ నోట్స్‌ రాసుకున్నా. అలానే తెలుగు నేర్చుకోవడం కూడా మొదలుపెట్టా. దర్శకుడు అందుకు సంబంధించి కొన్ని వర్క్‌షాపులు కూడా నిర్వహించారు. సెట్‌లో తెలుగులోనే మాట్లాడాలనే షరతు పెట్టడంతో షూటింగ్‌ సమయంలో టీమ్‌ అందరితోనూ మాట్లాడుతూ.. వారు చెప్పేది వింటూ తెలుగు ప్రాక్టీస్‌ చేశా. అలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ శ్రద్ధగా నటించా. అయితే లాక్‌డౌన్‌ వల్ల సినిమా విడుదల వాయిదాపడినా ‘నీ కళ్లు నీలి సముద్రం...’ పాటకు వచ్చిన ఆదరణ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నటించొచ్చనే ధైర్యాన్నిచ్చింది. ఆ సినిమా విడుదల కాకముందే కొన్ని అవకాశాలూ వచ్చాయి. అదెందుకో నాకు శుభసంకేతంగా అనిపించి ముందడుగు వేశా. ఈ లోపు లాక్‌డౌన్‌ ముగిసి ‘ఉప్పెన’ కూడా విడుదల కావడంతో నేను ఊహించిన దానికంటే ఎక్కువ పేరొచ్చింది. ప్రేక్షకులు కూడా నన్ను పదహారణాల తెలుగమ్మాయిలా ఓన్‌ చేసుకున్నారు. ఎక్కడికెళ్లినా ‘బేబమ్మా’ అని ప్రేమగా పిలిచేవారు. ఇప్పటికీ చాలామంది అలానే పిలుస్తారు.

సిగరెట్‌ తాగా...

‘ఉప్పెన’ కోసం చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ దాని తరవాత వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాకి కూడా పనికొచ్చింది. అందులో సర్పంచ్‌ నాగలక్ష్మిగా గ్రామ ప్రజలకు స్పీచ్‌ ఇచ్చే సీన్‌ ఒకటుంటుంది. అందుకోసం వేదికపైన మైక్‌ ముందు నిలబడి జనాల ముందు డైలాగులు చెప్పే సందర్భంలో చాలా ఇబ్బంది పడ్డా. ఎందుకంటే నేను చాలా సిగ్గరిని తొందరగా మాట్లాడను. కెమెరా ముందు నటించాను కానీ జనాల ముందు స్పీచ్‌ ఇచ్చే సీన్‌లో బెరుకుగా అనిపించింది. ఎక్కువ టేకులు తీసుకున్నా ఫైనల్‌గా బాగానే చేశా. అలా నటించిన సర్పంచ్‌ నాగలక్ష్మి పాత్రకు మంచి గుర్తింపు వచ్చినా వరసగా రెండు సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల కాస్త అసంతృప్తి ఉంది. అందుకే ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మోడ్రన్‌ పాత్ర రావడంతో ఎగిరి గంతేశా. అంతేకాదు, ఆ పాత్ర మగరాయుడిలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా. అందుకే సిగరెట్‌ తాగే సీన్‌ పెట్టారు. అది చూసిన చాలామంది నిజంగానే నేను సిగరెట్‌ తాగుతానని అనుకున్నారు. నాకసలు ఆ వాసనే పడదు. దర్శకుడు నాకోసం ప్రత్యేకంగా పొగాకు లేని సిగరెట్లు తెప్పించడంతో మూడు రోజులు ప్రాక్టీస్‌ చేసి- సిగరెట్‌ తాగే సన్నివేశంలో నటించా. పాత్రలో లీనమైపోవాలి కాబట్టి కొన్ని ఆంగ్ల సినిమాలు చూసి స్మోకింగ్‌ ఎక్స్‌ప్రెషన్లు నేర్చుకున్నా. దాని తరవాత చెప్పుకోవాల్సింది ‘ది వారియర్‌’ గురించి. దర్శకుడు లింగు స్వామి ఫోన్‌ చేసి ఈ సినిమా గురించి చెబితే నమ్మలేకపోయా. ఆయన చేసిన ‘ఆవారా’కు నేను పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది తన సినిమాలో నాకు అవకాశమివ్వడం కలలా అనిపించింది. మరోవైపు సవాలుగానూ తీసుకున్నా. వీధిలో కాకా హోటల్‌ దగ్గర్నుంచీ ఇన్‌స్టా రీల్స్‌ వరకూ ఇప్పుడు ఎక్కడికెళ్లినా వినిపించే ‘కమాన్‌ బేబీ లెట్స్‌ గో ఆన్‌ ద బుల్లెట్టు... ఆన్‌ ద వేలో పాడుకుందాం డ్యూయెట్టు...’ పాట కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తోంది. దానికొచ్చిన ఆదరణ చూశాక నా కష్టం మర్చిపోయా. ఆ పాటకు రామ్‌తో పోటీ పడి డాన్స్‌ చేయడానికి ఎంత కష్టపడ్డానో. ఒకానొక టైమ్‌లో రామ్‌ ఎనర్జీ లెవెల్‌కి మ్యాచ్‌ అవ్వలేనేమోనని భయమేసింది. సాంగ్‌ చిత్రీకరణ మొదలయ్యాక ఆ ఫ్లోలో నేనూ హుషారుగా డాన్స్‌ చేశా. అలానే ఆర్జే విజిల్‌ మహాలక్ష్మిగా కొన్ని సీన్లలో విజిల్‌ వేయడంతో ఇప్పుడు ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు విజిల్‌ వేయమంటున్నారు. అందుకే సినిమా ఒప్పుకోగానే నాలుగురోజులు ప్రాక్టీసు చేసి మరీ విజిల్‌ నేర్చుకున్నా. ఈ సినిమా తరవాత వచ్చే నెల్లో ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధమైంది. అలానే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాగచైతన్య, సూర్య పక్కన మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నా. చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉన్న నేను ఇప్పుడు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నా. కష్టమైనా సరే తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మనల్ని విజయం దిశగా నడిపిస్తాయని నా నమ్మకం. అందుకే భాష నేర్చుకునే విషయంలో నేను అంత పక్కాగా ఉంటా.


మిస్‌ అవుతున్నా...

మాది కర్ణాటకలోని ఉడుపి. నాన్న వ్యాపారం రీత్యా ముంబయిలో స్థిరపడ్డాం. అమ్మ ఫ్యాషన్‌ డిజైనర్‌. నేను ఒక్కదాన్నే సంతానం కావడంతో అమ్మానాన్నలు నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. అందుకే నేనెప్పుడూ వాళ్లు కోరుకున్నట్టే ఉండటానికి ఇష్టపడుతుంటా. కథల ఎంపిక విషయంలో అమ్మ సాయపడుతుంది. నాన్నేమో  నలుగురిలో ఎలా ఉండాలో చెబుతారు. నిజానికి ఆయన వల్లే నేను పాజిటివ్‌ థింకింగ్‌ అలవాటు చేసుకున్నా. మన నోటి నుంచి మంచి విషయాలే రావాలి, మన బుర్రలోనూ వాటికే స్థానముండాలి అని పదే పదే చెబుతుంటారు. ఈ మధ్య వరస షూటింగులు ఉండటంతో అమ్మా, నేనూ హైదరాబాద్‌కి షిఫ్టు అయ్యాం. దాంతో నాన్నని బాగా మిస్‌ అవుతున్నా.


ఏడుపొచ్చేస్తుంది

లియా భట్‌ని చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందా. ఆమె కథలు ఎంచుకునే తీరు బాగుంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో వేరియేషన్‌ ఉంటుంది. నటన చాలా సహజంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి తానేంటో చూపించింది.

* ‘ఉప్పెన’ విడుదలయ్యాక చిరంజీవి సర్‌ ఓ లేఖ రాసి దాంతోపాటు ఓ గిఫ్ట్‌ను ప్యాక్‌ చేసి పంపారు. అది నాకెప్పటికీ ప్రత్యేకమైన జ్ఞాపకం.  

* నేను ‘రంగస్థలం’ చూశాక రామ్‌చరణ్‌కి అభిమానినయ్యా. అలానే కార్తి, శివకార్తికేయన్‌ సినిమాలూ నచ్చుతాయి. నిజం చెప్పాలంటే శివకార్తికేయన్‌ నా ఫస్ట్‌ క్రష్‌. ఆయన  నటించిన సినిమాలన్నీ చూశా.  నటనకూ పడిపోయా.

* స్వీట్స్‌ అంటే పిచ్చి. ఫిట్‌నెస్‌ కోసం బలవంతంగా మానేశా. ఎప్పుడైనా కారులో వెళుతుంటే స్వీటు షాపు కనిపిస్తే నాకెంత బాధేస్తుందో. ఎంతో కష్టపడితేనే చక్కని శరీరాకృతి సొంతమవుతుందని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

* ముంబయిలో ఉండటం వల్ల చపాతీ, రోటీ తినడం బాగా అలవాటు. అన్నం ఎప్పుడో ఒకసారి తినేదాన్ని. బేబమ్మ పాత్ర కోసం కాస్త బరువు పెరగమని దర్శకుడు చెప్పినప్పుడు అన్నం, స్వీట్లు బాగా తిన్నా. అంతేకాదు అప్పుడే మొదటిసారి పెరుగన్నం తినడం అలవాటు చేసుకున్నా. ఇప్పుడేమో అలవాటైపోయి తినకుండా ఉండలేకపోతున్నా.

* సాధారణంగా నాకు కోపం రాదు. ఒకవేళ వచ్చిందంటే కామ్‌గా గదిలోకి వెళ్లిపోయి తలుపేసుకుని నిద్రపోతా. మెలకువ వచ్చేసరికి తగ్గిపోతుంది. అలా ఉండటమే నా బలం.

* ఎమోషన్‌ సీన్లలో గ్లిజరిన్‌ లేకుండానే ఏడుస్తా. ఎవరన్నా గట్టిగా మాట్లాడినా, నన్ను కసురుకున్నా, నా ముందు గొడవ పడినా నాకు వెంటనే ఏడుపొచ్చేస్తుంది. అదే నా బలహీనత.

* నాకు సెంటిమెంట్స్‌ చాలా ఎక్కువ. భక్తి ఉంది. ఏదైనా ఓ కొత్త పని చేయాలంటే ముందు గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకున్నాకే అది మొదలుపెడతా. అలా చేస్తే పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని నమ్ముతా.

* యాక్షన్‌ సినిమాల్లో నటించడం ఇష్టం. ‘బాహుబలి’లో అనుష్క నటించిన ‘దేవసేన’ పాత్రలాంటివి చేయడం నా డ్రీమ్‌.

* ప్రస్తుతం నేను డిగ్రీ(సైకాలజీ) చదువుతున్నా. కాలేజీకి వెళ్లే తీరిక లేకపోవడంతో సమయం దొరికితే ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవుతున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..