ఈ గ్రామస్థులది ఒకే మాట ఒకే బాట

కొన్ని గ్రామాల తీరు చూస్తే భలే ముచ్చటేస్తుంది. గ్రామస్థులంతా ఒకమాట మీద నిలబడి కొత్త విషయాలు నేర్చుకుంటూ అభివృద్ధి బాటలో నడుస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇవి అలాంటి గ్రామాలే..

Updated : 02 Oct 2022 02:37 IST

ఈ గ్రామస్థులది ఒకే మాట ఒకే బాట

కొన్ని గ్రామాల తీరు చూస్తే భలే ముచ్చటేస్తుంది. గ్రామస్థులంతా ఒకమాట మీద నిలబడి కొత్త విషయాలు నేర్చుకుంటూ అభివృద్ధి బాటలో నడుస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇవి అలాంటి గ్రామాలే..


ఖర్చు తగ్గించాలని..

కొందరు పసుపూ, మెహెందీ అంటూ పెళ్లికి ముందు సరదాగా రకరకాల వేడుకల్ని నిర్వహిస్తుంటారు. మరికొందరికి అవి జరపడం ఆనవాయితీ. అందుకోసమని వేదికను అలంకరించడం, వేడుకకు తగినట్టు దుస్తుల్ని డిజైన్‌ చేయించుకోవడం వంటివి ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చేస్తుంటారు. అయితే ఏ హడావుడీ, ఆర్భాటం లేకుండా పెళ్లి తంతుని జరపాలని నిర్ణయించుకున్నాయి రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న పందొమ్మిది గ్రామాలు. అక్కడి వారంతా కుమావత్‌ వర్గానికి చెందినవారే. పెళ్లి సమయంలో డీజేలూ, బారాత్‌లూ, ఇతర సంప్రదాయ వేడుకలు జరపాల్సి ఉంటుంది. భోజనాల్లో పలు రకాల పదార్థాలు వడ్డించడం వారి ఆనవాయితీ. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులకు అవన్నీ భారమని, పెళ్లిళ్లని సింపుల్‌గా జరపాలని నిర్ణయించారు కుమావత్‌ వర్గం పెద్దలు. అలా ఆదా చేసిన డబ్బుతో ఆడపిల్లలకు బంగారం కొనివ్వాలనే నియమమూ పెట్టారు. ఈ నిర్ణయంతో ఆ గ్రామాల్లోని ఎందరో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊరట లభించింది. అప్పుల పాలవ్వకుండా పెళ్లిళ్లను సాదాసీదాగా జరుపుతూ... మిగిలిన కొద్దోగొప్పో డబ్బుతో తమ కూతుళ్లకు బంగారం కానుకగా ఇస్తున్నారు.


డిజిటల్‌ గ్రామం

కేరళలోని పల్లంపుర గ్రామానికి వెళితే అక్కడ తొంభై ఏళ్ల వారు కూడా వీడియో కాల్స్‌ మాట్లాడుతుంటారు. వాయిస్‌ మెసేజ్‌లు చేస్తుంటారు. ఎనభై పైబడిన వాళ్లు ఆన్‌లైన్‌లోనే బ్యాంకు బ్యాలన్స్‌ చెక్‌ చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ తక్కువ ధరలోనే తమకు కావాల్సినవి ఇంటికి తెప్పించుకుంటూ కనిపిస్తారు. అలాగని చదువురాని ఆ గ్రామస్థులు ఈ డిజిటల్‌ సేవలకోసం ఎవరి మీదా ఆధారపడరు. అన్నీ సొంతంగానే చేసుకుంటుంటారు.

‘డిజీ పల్లంపుర’ పేరుతో గ్రామ పంచాయతీ ప్రారంభించిన ప్రాజెక్టే అందుకు కారణం. గ్రామంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌గా జీవించాలనే ఉద్దేశంతో సర్పంచి రాజేశ్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ పాఠాలు నేర్పించాలనుకున్నాడు. ఆ విషయం తెలిసిన స్థానిక కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా విద్యార్థులనే ఆ గ్రామానికి పంపి స్మార్ట్‌ ఫోన్‌ వాడకం తెలియని 3300 మందిని గుర్తించింది. వారిలో ఆరొందల మంది అనారోగ్యంతో మంచానపడటంతో మిగతా వారందరి ఎన్‌ఎస్‌ఎస్‌లో భాగంగా డిజిటల్‌ పాఠాలు నేర్పించేందుకు ముందుకొచ్చింది కాలేజి. ఫోన్‌ చేయడం- వాట్సాప్‌లో వాయిస్‌ కాల్‌,
మెసేజ్‌, ఫొటోలు పంపడం, ఇతర సామాజిక మాధ్యమాలు వాడటం, వీడియో, ఆడియో రికార్డు చేయడం, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు వినియోగించడంతోపాటు చదవడం, రాయడం కూడా నేర్పించారు. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా నేర్చుకుని స్మార్ట్‌గా మారిపోవడంతో ఇప్పుడా పల్లంపుర దేశంలోనే పూర్తిస్థాయిలో డిజిటల్‌ అక్షరాస్యత సాధించిన గ్రామంగా గుర్తింపు పొందింది.


అడవి తల్లిని కాపాడారు!

నాగాలాండ్‌కు ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖోనోమాను... కేంద్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి పచ్చని గ్రామంగా గుర్తించింది. ఆ గుర్తింపు వెనక గ్రామస్థుల ఐకమత్యం దాగుంది. ఒకప్పుడు వేటాడుతూ, చెట్లను నరికి కలపను విక్రయిస్తూ జీవనం సాగించిన ఆ గ్రామస్థులు క్రమంగా అడవిని మోడుబార్చారు. ప్రాణి సంపదకూ హాని తలపెట్టారు. మరోవైపు అడవిపైన కన్నేసిన అక్రమార్కులు కలపనూ, వనమూలికల్నీ దోచుకునేవారు. అదంతా గమనించని పల్లె ప్రజలకు కొందరు ప్రకృతి ప్రేమికులు- అడవి తల్లికి జరుగుతున్న నష్టాన్నీ, పర్యావరణానికి తలెత్తే ముప్పునూ వివరించి చెప్పారు. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి దృశ్యరూపంలోనూ ఆ ప్రభావాన్ని వాళ్ల కళ్లకు కట్టారు. అప్పట్నుంచి చెట్లను నరకకూడదనీ, వేటాడకూడదనీ ఏకగ్రీవంగా తీర్మానించుకున్న గ్రామస్థులకు ఎన్జీవోలూ, ప్రభుత్వం కూడా తోడ్పడ్డాయి. అలా వారంతా అడవిలో కలపను కాపాడుకుంటూ, చెట్లను నరికిన చోట కొత్త మొక్కల్ని నాటడం, ఔషధవనాల్ని పెంచడం మొదలుపెట్టారు. అంతరించిపోయిన నెమలి జాతికి చెందిన ట్రాగోపన్‌ అనే పక్షుల సంఖ్యా వృద్ధి చెందడంతో ప్రభుత్వం ‘ఖోనోమా నేచర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ ట్రాగోపన్‌ అభయారణ్యం’ ఏర్పాటు చేసి పర్యటకుల్ని ఆకట్టుకుంటోంది. మరోవైపు ఖోనోమా వాసులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ, గ్రామంలోనూ పెద్ద ఎత్తున మొక్కల్ని పెంచుతున్నారు. సోలార్‌ విద్యుత్తుని వాడుతూ పర్యావరణహితంగా జీవిస్తున్నారు. తమ ఇళ్లను అందంగా తీర్చిదిద్దుకుని పర్యటకులకు హోమ్‌స్టే వసతీ కల్పిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..