ఆఫీసు బాయ్‌ నుంచి కోట్ల వ్యాపారం దాకా!

‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా దరిచేరలేదు!’ ఈ ఆలోచనే తనని నిత్యం తొలుస్తుందంటారు ఫణిరాజు జాలిగామా. ఏదో సాధించేశాననుకున్న ప్రతిసారీ ఈ భావన ములుకర్రలా ముందుకు తోస్తోందని చెబుతారు.

Updated : 22 May 2022 06:17 IST

ఆఫీసు బాయ్‌ నుంచి కోట్ల వ్యాపారం దాకా!

‘ఇది కాదు... ఇది కానే కాదు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు... నేను చేరుకోవాల్సిన గమ్యం ఇది కాదు... అందుకోవాల్సిన లక్ష్యం ఇంకా నా దరిచేరలేదు!’ ఈ ఆలోచనే తనని నిత్యం తొలుస్తుందంటారు ఫణిరాజు జాలిగామా. ఏదో సాధించేశాననుకున్న ప్రతిసారీ ఈ భావన ములుకర్రలా ముందుకు తోస్తోందని చెబుతారు. బహుశా, అదే కోర్టు వాకిట సెక్యూరిటీగార్డుగా పనిచేసిన ఆయన్ని కోట్ల వ్యాపారం చేసే ఐటీ సంస్థ ‘ఓజస్‌ ఇన్నొవేటివ్‌ టెక్నాలజీ’కి అధినేతని చేసిందని చెప్పాలి. ఆ ఆసక్తికరమైన ప్రయాణం ఇది...

'కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి టౌన్‌ మాది. నాన్న అక్కడ రిజిస్టర్‌ స్టాంపులు అమ్ముతుండేవారు. ఓ దశలో నాన్నకి వ్యాపారం చేయడం రాక మేం మా తాతలిచ్చిన కొద్దిపాటి ఆస్తితోనే రోజులు గడపాల్సి వచ్చింది. నేను పదో తరగతికి వచ్చేటప్పటికీ ఆ ఆస్తి కూడా కరిగిపోయింది. దాంతో ఎస్‌ఎస్‌సీలో 85 శాతం మార్కులు తెచ్చుకున్న నేను అంతటితో చదువు మానేయాల్సి వచ్చింది. ఓ పాన్‌ షాపులో పనికి చేరాను. కొంతకాలం స్వాతి వీక్లీకి ఏజెంట్‌గా కుదిరాను. అలా వచ్చిన డబ్బుతోనే ఐటీఐలో చేరి ఎలక్ట్రీషియన్‌ కోర్సు చదివాను. ఆ పనులతో వచ్చేఆదాయంతో ఇంటర్‌లో జాయినయ్యాను. ఇంటర్‌ పాసై డ్రైవింగ్‌ నేర్చుకుని కారు డ్రైవర్‌గా మారాను. అప్పుడే కరీంనగర్‌ జిల్లా కోర్టులో ఆఫీసుబాయ్‌ ఉద్యోగాలున్నాయని తెలిసి దరఖాస్తు చేశాను. కోర్టులో ఆఫీసుబాయ్‌ ఉద్యోగాలకి పదో తరగతి కనీసార్హతతోపాటూ డ్రైవింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు వంటివి తెలిసినవాళ్లకి ప్రాధాన్యం ఇస్తారు. నాకు ఆ రెండూ తెలియడం కలిసొచ్చి సర్కారు కొలువులో కుదురుకున్నాను. కోర్టుకెళ్లాక, అక్కడ క్లర్కుకున్న ప్రాధాన్యం చూశాక... ఆ ఉద్యోగం సాధించడమే నా కలగా మారింది! కానీ నేను చేస్తున్న ‘అటెండర్‌’ స్థాయి నుంచి ఒక్కో ప్రమోషనూ అందుకుంటూ క్లర్కు స్థాయి (ఎల్‌డీసీ)కి వెళ్లాలంటే కనీసం ఇరవైయేళ్లు పడుతుందని చెప్పారు. కానీ షార్ట్‌హ్యాండ్‌ పాసైతే ‘కాపీయిస్టు’గా అదే హోదా ఉన్న ఉద్యోగం సాధించవచ్చన్నారు. అప్పట్లో షార్ట్‌హ్యాండ్‌ నేర్చుకోవాలంటే హైదరాబాద్‌కి వెళ్లకతప్పదు. మరి నా డ్యూటీని వదులుకుని ఎలా వెళ్లను... అందుకే మా జడ్జి మస్తానమ్మని అడిగి రాత్రిళ్లు కోర్టుకి సెక్యూరిటీగార్డుగా చేసేందుకు అనుమతి తీసుకున్నాను. అలా రాత్రంతా గార్డుగా పనిచేసి... ఉదయాన్నే హైదరాబాద్‌ వెళ్లి షార్ట్‌హ్యాండ్‌ నేర్చుకుని వచ్చేవాణ్ణి. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేవాణ్ణి. అలా రెండు నెలల్లోనే నిమిషానికి 225 పదాలు రాసేంతగా షార్ట్‌హ్యాండ్‌లో పట్టుసాధించాను... కనీసం ఏడాది ప్రాక్టీస్‌ చేస్తేకానీ రాని స్పీడ్‌ అది! అంతేకాదు, పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాను. ఆ ఏడాది జిల్లా న్యాయస్థానంలో  కాపీయిస్టుల కోసం జరిగిన పోటీలకి హాజరై ఆ ఉద్యోగం సాధించాను. ఈలోపు నా మరదలు శ్రీలలితతో పెళ్ళైంది.

ఐటీరంగంలోకి...

పెళ్ళినాటికే మా ఆవిడ ఎంసీఏ పూర్తి చేసింది. తనకి ఎలాగూ ఐటీ ఉద్యోగం వస్తుంది కాబట్టి... నేను నా పనికి రాజీనామా చేసి ఎంబీఏ చదువుదామనుకున్నాను. కానీ అది 2000 సంవత్సరం... వై2కెతో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా ఏ ఐటీ కంపెనీలోనూ ‘ఫ్రెషర్స్‌’ని తీసుకునేవాళ్లు కాదు. నాలుగేళ్ల ప్రయత్నంలోనూ తనకి ఉద్యోగం రాలేదు. నేను అప్పటికే కరస్పాండెన్స్‌లో డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత ఏంబీఏ చేయాలన్న తొందరలో తనపైన ఒత్తిడి తేసాగాను. ఓ దశలో తను ‘నీకున్న ప్రతిభకి నాకన్నా నీకే ఐటీ ఉద్యోగం కరెక్ట్‌గా ఉంటుంది. ప్రయత్నించు...’ అంది. ఆ రోజు ఏ కళనున్నానో తెలియదు కానీ... ప్రభుత్వ ఉద్యోగానికి సుదీర్ఘ సెలవుపెట్టి కంప్యూటర్స్‌ నేర్చుకోవడం మొదలుపెట్టాను. పుణెలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. చేరిన ఆరునెలల్లోనే ఇక ఐటీదే భవిష్యత్తని అర్థమైపోయింది. బంధువులు వద్దంటున్నా వినకుండా నా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐటీ రంగంలో ఎదగాలని ఎంబీఏ కూడా పూర్తిచేసి... టీసీఎస్‌లో సీనియర్‌ మేనేజర్‌గా చేరాను. అలా 15 వేల రూపాయల జీతంతో ఐటీరంగంలోకి అడుగుపెట్టిన నేను... ఈ హోదాతో నెలకి నాలుగున్నర లక్షల జీతం అందుకోసాగాను. ఆ తర్వాత కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సంస్థలో అసోసియేట్‌ డైరెక్టర్‌గా వెళ్లాను. అప్పుడే నా మిత్రుడు అరుణ్‌తో కలిసి సొంతంగా సంస్థని స్థాపించాలనే ఆలోచన వచ్చి ‘ఓజస్‌ ఇన్నొవేటివ్‌ టెక్నాలజీస్‌’ సంస్థని స్థాపించాం. ఒకప్పుడు మా భార్యల నగలమ్మి స్థాపించిన సంస్థ ఇప్పుడు ఏటా సుమారు యాభై కోట్ల టర్నోవర్‌ అందుకుంటోంది. అమెరికాలోని సీమన్స్‌, ఇన్‌ఫ్యుజన్‌ సాఫ్ట్‌ వంటి పెద్ద సంస్థలు మా వినియోగదారులు.

ఏ డిగ్రీ అయినా...
ఐటీ రంగంలోకి అడుగుపెట్టడానికి నేనూ నా భార్యా పడ్డ ఇబ్బందులు... నేటి యువతరానికి ఉండకూడదన్నది మా సంస్థ లక్ష్యాల్లో ఒకటి. అందుకే- టాప్‌ కాలేజీల్లో ఉన్న ర్యాంకర్లనే కాకుండా... అమీర్‌పేటలో అవస్థలు పడుతున్నవాళ్లనీ ఉద్యోగులుగా చేర్చుకుంటున్నాం. మేమే శిక్షణ ఇచ్చి... ఐదులక్షలదాకా ప్యాకేజీ ఇస్తున్నాం. మా సంస్థకి అనుబంధంగా ఇటీవల ‘హ్యాష్‌బ్లాక్స్‌’ అన్న సంస్థని ప్రారంభించాం. దీని ద్వారా బీఏ బీకామ్‌లాంటివి చదివినవాళ్లకీ, ఇతర రంగాల్లో ఉండి ఐటీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకున్నవాళ్లకీ శిక్షణ ఇచ్చి ‘ఓజస్‌’లో చేర్చుకుంటున్నాం. 
మనదేశంలో ‘జోహో’ తర్వాత ఇలాంటి ప్రయోగం చేస్తున్న సంస్థ మాదే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..