పాత పట్టుచీరలకు బోలెడంత డబ్బు..!

ఇంట్లో అమ్మమ్మ కట్టుకున్న జరీ అంచు చీరలు అటక మీద అలాగే ఉన్నాయి. అమ్మ వేసుకున్న పట్టు పరికిణీలను పెట్టెలో ఇప్పటికీ చూడొచ్చు.

Updated : 11 Feb 2024 11:20 IST

ఇంట్లో అమ్మమ్మ కట్టుకున్న జరీ అంచు చీరలు అటక మీద అలాగే ఉన్నాయి. అమ్మ వేసుకున్న పట్టు పరికిణీలను పెట్టెలో ఇప్పటికీ చూడొచ్చు. ఇవే కాదు, ఇలాంటి పాత పట్టుబట్టలు దాదాపుగా అందరి ఇళ్లల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు పనికిరాని ఆ బట్టలే వందల నుంచి వేల రూపాయలు తెచ్చిపెట్టగలవు. ఎలాగంటారా... జరీ పోగులకు సరైన విలువ కడుతూ ఆ పట్టువస్త్రాల్ని కొనుక్కుంటున్నాయి కొన్ని సంస్థలు!

ల్మారా తెరిచి చూస్తే రోజూ వేసుకునే దుస్తులతో పాటూ పక్కన పెట్టేసిన బట్టలూ బోలెడన్ని కనిపిస్తాయి. అవి సాదాసీదాగానే ఉంటే ఎవరికో ఒకరికి ఇచ్చేయడమో లేదంటే బయట పారేయడమో చేస్తుంటాం. అదే... అమ్మ తొలిసారి కట్టుకున్న కంచి పట్టుచీరనో, అక్కయ్య మొదటి జీతంతో కొనుక్కున్న బనారస్‌ శారీనో, బుజ్జి బాబు నామకరణానికి కట్టిన పట్టుపంచెనో అయితే... కచ్చితంగా వాటిని అంత సులువుగా పారేయలేం. ఆ బట్టలు ఎంతగా చీకిపోయినా, పూర్తిగా చిరుగులతో ఉన్నా సరే... వేలు పోసి కొన్నామన్న ఆలోచనతో అల్మారాలో అలాగే అట్టిపెట్టుకుంటాం. కానీ ఇలా ఎన్నాళ్లని దాచుకోగలం. అందుకే ఆ సమస్యకు సరైన మార్గం చూపిస్తున్నాయి ఓల్డ్‌జరీ, సేల్‌జరీ, సద్గురు సిల్వర్‌ జరీ ఓల్డ్‌ పట్టు శారీబయర్స్‌ లాంటి కొన్ని సంస్థలు.

స్టార్‌ హోటలే మన హాస్టల్‌ అయితే?!

పాత పట్టుబట్టలకు సరైన రేటునిస్తూ మన దగ్గర కొనుక్కోవడానికి ఇంటికే వస్తున్నాయివి. 

సాధారణంగా పాత బట్టలు కొనే చిన్న చిన్న వ్యాపారులు కొంతమంది ఇంటి దగ్గరకే వచ్చి పాత చీరల్ని తీసుకుని పదో పరకో చేతిలో పెట్టడమో లేదంటే చీరలకు బదులుగా ఏవైనా వస్తువులు ఇవ్వడమో చేస్తుంటారు. కానీ అలా చేస్తే నాణ్యమైన జరీ చీరలకు సరైన ధర రాక మోసపోతుంటాం. అదే ఈ సంస్థలైతే జరీ పోగుల నాణ్యతను బట్టి కచ్చితమైన రేటు ఫిక్స్‌ చేస్తాయట.  

ఎలా పనిచేస్తాయంటే...

వెబ్‌సైట్‌ లేదా సోషల్‌ మీడియా ద్వారా వీరిని సంప్రదించామంటే... అందులో పూర్తి వివరాలుంటాయి. మన దగ్గరున్న పాత జరీ బట్టలు- చీరల దగ్గర్నుంచి జాకెట్‌ ముక్కల వరకూ ఏదైనా సరే వీళ్లకు అమ్మవచ్చు. ఫొటో పంపితే జరీని బట్టి సుమారుగా ధర చెబుతారు. ఆ తర్వాత మన వీలునుబట్టి వాళ్లే ఇంటికొచ్చి తీసుకెళ్తారు. ఇందుకు ఎలాంటి అదనపు రుసుమూ ఉండదు. చీర ఎంత పాతదైనా కానీ జరీ నాణ్యత ఆధారంగానే ధర ఫిక్స్‌ చేసి, మనకా డబ్బులు అందిస్తారు. ఇచ్చే జరీని లెక్కగడుతూ వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ ఉంటాయా ధరలు. ఓల్డ్‌జరీ సంస్థ కస్టమర్ల నుంచి కొనుక్కున్న పాతజరీ చీరలకు-  కనీసం 300 రూపాయల నుంచి ఎక్కువలో ఎక్కువ 48,000 రూపాయల వరకూ చెల్లించిందట. తెలుగు రాష్ట్రాలతో పాటూ మనదేశంలోని వివిధ నగరాల్లోనూ ఈ సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి.

‘అబ్బా పాత బట్టలకే వేల రూపాయలంటే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని ఇందుకే అంటారేమో’ అని అనుకుంటున్నారు కదూ. నిజమే కానీ ఇక్కడో చిన్న విషయం గమనించుకోవాలి. సిల్క్‌చీర అన్నారని ప్రతిదీ కొనరండోయ్‌. వెండి జరీ పట్టు వస్త్రాల్నే వీళ్ల దగ్గర అమ్ముకోవచ్చు.

ఇక ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న పాత జరీ అంచుల జాకెట్లూ లెహంగాలూ చొక్కాలూ పంచెల్ని చకచకా ఫొటోలు తీసేసి ఈ సైట్లలో అప్‌లోడ్‌ చేసేయండి. వాళ్లు ఇస్తామన్న ధర నచ్చితే అమ్మేయండి. వచ్చిన డబ్బులతో మళ్లీ కొత్త పట్టు వస్త్రాల్ని అల్మారాలోకి తెచ్చేసుకోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..