పులుసు, కూర... ఏదైనా ‘గుడ్డే’!

ఇంట్లో ఎలాంటి కూరగాయలూ లేకపోతే గుడ్డుతో ఏదో ఒక కూర వండేయడం మామూలే. ఈసారి అదే గుడ్డును ఇలాంటి రుచుల్లో చేసి చూడండి. అన్నం, రోటీ, పులావ్‌... దేనికైనా మంచి కాంబినేషన్‌ అవుతాయి.  

Updated : 14 May 2023 11:47 IST

ఇంట్లో ఎలాంటి కూరగాయలూ లేకపోతే గుడ్డుతో ఏదో ఒక కూర వండేయడం మామూలే. ఈసారి అదే గుడ్డును ఇలాంటి రుచుల్లో చేసి చూడండి. అన్నం, రోటీ, పులావ్‌... దేనికైనా మంచి కాంబినేషన్‌ అవుతాయి.  


ఎగ్‌ పాలక్‌ మసాలా

కావలసినవి: ఉడికించిన గుడ్లు: ఆరు, నూనె: పావుకప్పు, జీలకర్ర: చెంచా, బిర్యానీ ఆకులు: రెండు, యాలకులు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, ఉడికించిన పాలకూర: మూడు కప్పులు, పసుపు: అరచెంచా, దనియాలపొడి: ఒకటిన్నర చెంచా, కారం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా. 

తయారీ విధానం: ముందుగా ఉడికించిన పాలకూర తరుగును మిక్సీలో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకులు, యాలకులు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో తరుగు కూడా వేయించుకోవాలి. నిమిషమయ్యాక పసుపు, దనియాలపొడి, కారం, తగినంత ఉప్పు, గరంమసాలా వేయాలి. టొమాటో ముక్కలు మగ్గాక పాలకూర గుజ్జు, పావుకప్పు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు ఉడికించిన గుడ్డు ముక్కల్ని వేసి బాగా కలిపి స్టవ్‌ కట్టేయాలి.  


ఆమ్లెట్‌ కర్రీ

కావలసినవి: గుడ్లు: నాలుగు, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, కారం: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, నూనె: పావుకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, టొమాటో ముక్కలు: అరకప్పు, పసుపు: పావుచెంచా, దనియాలపొడి: టేబుల్‌ స్పూను, జీలకర్రపొడి: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, కొబ్బరి తురుము: అరకప్పు, గసగసాలు: చెంచా, జీడిపప్పు: పది, కొత్తిమీర: కట్ట.

తయారీ విధానం: ముందుగా కొబ్బరి, జీడిపప్పు, గసగసాలను కాసిని నీళ్లతో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఓ గిన్నెలో గుడ్ల సొన, తగినంత ఉప్పు, పావుచెంచా కారం, పావుకప్పు ఉల్లిపాయముక్కలు, పావుచెంచా గరంమసాలా వేసుకుని గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలో తీసుకుని ఆవిరిమీద గట్టిపడేవరకూ ఉడికించుకుని ముక్కల్లా కోయాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గాక ఆమ్లెట్‌ ముక్కలు, కొబ్బరి మిశ్రమం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి, కప్పు నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు కొబ్బరి మసాలా, ఆమ్లెట్‌ ముక్కలు వేసి కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేస్తే సరి.  


గుడ్డు పులుసుకూర

కావలసినవి: గుడ్లు: మూడు, నూనె: పావుకప్పు, ఆవాలు-జీలకర్ర-మినప్పప్పు: చెంచా చొప్పున, మెంతులు: పావుచెంచా, సోంపు: అరచెంచా, ఉల్లిపాయముక్కలు: కప్పు, టొమాటో తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, కొబ్బరి పేస్టు: పావుకప్పు, చింతపండు రసం: పావుకప్పు, పసుపు: పావుచెంచా, కారం: రెండు చెంచాలు, జీలకర్రపొడి- మిరియాలపొడి- దనియాలపొడి: చెంచా చొప్పున, ఉప్పు: తగినంత, బెల్లంముక్క: చిన్నది, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, సోంపు వేయించుకోవాలి. తరవాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, మిరియాలపొడి, తగినంత ఉప్పు, చింతపండురసం, బెల్లం ముక్క, కప్పు నీళ్లు పోసి కలపాలి. చింతపండు రసం మరుగు తున్నప్పుడు ఒక్కో గుడ్డు సొనను అందులో జాగ్రత్తగా వేయాలి. సొన కాస్త గట్టిపడుతున్నప్పుడు కొబ్బరి మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి కలిపి... దగ్గరకు అవుతున్నప్పుడు దింపేస్తే చాలు. 


పెరుగు కూర

కావలసినవి: ఉడికించిన గుడ్లు: మూడు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, తాజా పెరుగు: కప్పు, వేయించిన నువ్వులు: చెంచా, బిర్యానీ ఆకు: ఒకటి, జీలకర్ర: చెంచా, దాల్చినచెక్క: చిన్న ముక్క, పసుపు: పావుచెంచా, కారం- దనియాలపొడి- గరంమసాలా: చెంచా చొప్పున, కసూరీమేథీ: చెంచా, నూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టౌమీద కడాయిని పెట్టి రెండు చెంచాల నూనె వేసి.. ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి తరుగు, నువ్వులు మిక్సీలో తీసుకుని నీళ్లు చల్లుకుంటూ పేస్టులా చేసుకోవాలి. స్టౌమీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేసి బిర్యానీఆకు, దాల్చినచెక్క, జీలకర్ర వేయించుకోవాలి. ఇందులో గుడ్లు, కసూరీమేథీ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి అరకప్పు నీళ్లు పోయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు గుడ్డు ముక్కలు, కసూరీమేథీ వేసి... అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..