Robot Chess: రోబోతో చదరంగం.. బాలుడికి భయానక అనుభవం!

రోబోతో కలిసి చెస్‌ ఆడుతోన్న క్రమంలో ఓ ఏడేళ్ల బాలుడికి భయానక అనుభవం ఎదురైంది! పావులు కదిపే క్రమంలో ఆ యంత్రం కాస్త.. అతని చేతివేలిని గాయపర్చింది. ఇది గమనించిన అక్కడున్నవారు...

Updated : 25 Jul 2022 19:47 IST

మాస్కో: రోబోతో కలిసి చెస్‌ ఆడుతోన్న క్రమంలో ఓ ఏడేళ్ల బాలుడికి భయానక అనుభవం ఎదురైంది! పావులు కదిపే క్రమంలో ఆ యంత్రం కాస్త.. అతని చేతివేలిని గాయపర్చింది. ఇది గమనించిన అక్కడున్నవారు.. వెంటనే అప్రమత్తమై అతన్ని రోబో చేతినుంచి విడిపించారు. రష్యాలో నిర్వహించిన ‘మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌’లో ఈ ఘటన చోటుచేసుకుంది. రష్యా చెస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు సెర్గే స్మాగిన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆటలో భాగంగా రోబో వంతు పావు కదపడం పూర్తవకముందే బాలుడు చెయ్యి పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వీడియో ప్రకారం.. ఆటలో భాగంగా రోబో.. బాలుడి పావును తొలగించి అక్కడ తన పావును పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ ప్రక్రియ పూర్తవకముందే అతను వేగంగా తన పావును కదిపాడు. ఈ క్రమంలోనే రోబో చేయికింద అతని వేళ్లు ఇరుక్కుపోయాయి. దీంతో వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై అతన్ని విడిపించారు. ఆ బాలుడిని క్రిస్టోఫర్‌గా గుర్తించారు. మాస్కోలో తొమ్మిదేళ్లలోపు 30 మంది పేరుపొందిన చెస్ ఆటగాళ్లలో ఒకడు. ఘటన తర్వాత.. అతని వేలు విరిగింది. అయితే, అతను సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించినట్లు స్మాగిన్‌ తెలిపారు.

‘రోబో వంతు పావు కదపడం పూర్తయ్యేవరకు వేచి ఉండాల్సిన విషయాన్ని అతను గమనించలేదు. ఇది చాలా అరుదైన కేసు. నాకు తెలిసినంతవరకు ఇదే మొదటిది. గాయం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం అతను ఆటను కొనసాగించాడు’ అని వివరించారు. మరోవైపు ఈ ఘటనపై క్రిస్టోఫర్‌ తల్లిదండ్రులు.. మాస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని సంప్రదించాలని నిర్ణయించినట్లు ఓ స్థానిక వార్తాసంస్థ తెలిపింది. అయితే.. చెస్ ఫెడరేషనే ఈ వ్యవహారాన్ని చూసుకుంటుందని, అన్ని విధాలా సాయం చేస్తుందని అధికారులు చెప్పారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని