Viral videos: విమానంలో తల్లిదండ్రులకు ఊహించని సర్‌ప్రైజ్‌! వైరల్‌గా మారిన వీడియో

తమ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలి.. వారు గర్వపడేలా చేయాలనేది ప్రతి ఒక్కరి కల! ఇలాంటి స్వప్నాన్నే సాకారం చేస్తూ.. ఓ విమాన పైలట్‌ తన కన్నవారికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు...

Published : 23 Jul 2022 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలి.. వారు గర్వపడేలా చేయాలనేది ప్రతి ఒక్కరి కల! ఇలాంటి స్వప్నాన్నే సాకారం చేస్తూ.. ఓ విమాన పైలట్‌ తన కన్నవారికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ.. మరపురాని క్షణాలను అందజేశాడు. తాను పైలట్‌గా విధులు నిర్వహిస్తున్న విమానంలోనే తల్లిదండ్రులను దిల్లీ నుంచి స్వస్థలమైన రాజస్థాన్‌లోని జైపూర్‌కు తీసుకెళ్లడమే అతను చేసిన పని. అయితే, వారికి విమానం ఎక్కాక కానీ తెలియలేదు.. దాని పైలట్‌ తమ కుమారుడేనని. ఊహించని ఈ పరిణామానికి వారు ఎంతో ఆనందానికి లోనయ్యారు. పైలట్‌ కమల్‌ కుమార్‌ దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.

వీడియో ప్రకారం.. పైలట్‌ తల్లిదండ్రులు దిల్లీ- జైపూర్‌ విమానం ఎక్కారు. అయితే, తాము ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో విధుల్లో ఉన్నది తమ కుమారుడేనన్న విషయం అప్పటికి వారికి తెలియదు. అంతలోనే.. ఊహించని విధంగా కాక్‌పిట్ ప్రవేశద్వారం వద్ద అతన్ని చూశారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన తల్లి కాసేపు ఆగి.. కొడుకు చేయి పట్టుకుని మురిసిపోయింది. అనంతరం కాక్‌పిట్‌లో తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. కమల్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘పైలట్‌గా విధులు ప్రారంభించినప్పటి నుంచి ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నా. చివరకు జైపూర్‌లోని ఇంటికి వారిని తీసుకెళ్లే అవకాశం దక్కింది. ఇది చాలా గొప్ప అనుభూతి’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 20 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్ల మనసూ గెలుచుకొంది ఈ వీడియో. ప్రతి పైలట్‌ కల ఇది అని ఒకరు కామెంట్‌ పెట్టగా.. హృద్యంగా ఉందంటూ మరొకరు స్పందించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు