Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!

వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలువగా.. ఆ నీటిలోనే స్నానం చేస్తూ, బట్టలు ఉతుకుతూ, అందులోనే యోగా చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపాడు ఓ వ్యక్తి.......

Published : 10 Aug 2022 02:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వర్షాల కారణంగా రోడ్డుపై నీరు నిలిస్తే.. అక్కడ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం చూసుంటాం. లేదా అందులో నాటు వేయడం లాంటి నిరసనలు కూడా మనం చూసే ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించాడు. రోడ్డుపై ఉన్న మురుగు నీటిలోనే స్నానం చేస్తూ, బట్టలు ఉతుకుతూ, అందులోనే యోగా చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వర్షాల కారణంగా కేరళలోని మలప్పురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. స్థానిక నేతలు పట్టించుకోకపోవడంతో హమ్జా పోరాలి అనే వ్యక్తి ఈ వినూత్న నిరసనకు దిగాడు. ఒంటిపై టవల్‌తో బకెట్‌, సబ్బు పట్టుకొని వెళ్లి.. రోడ్డుపై ఉన్నఓ భారీ నీటి గుంతలో స్నానం చేశాడు. గుబురు గెడ్డం, జుట్టుతో  కనిపిస్తున్న అతడు.. ఆ నీటిలోనే పద్మాసనం, సూర్య నమస్కారాలు చేయడం గమనార్హం. ఈ వినూత్న నిరసనకు ప్రభుత్వం దిగొచ్చింది. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్‌ నేరుగా నిరసన చేస్తున్న హమ్జా వద్దకు వెళ్లి.. త్వరలోనే మరమ్మతులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది.

రోడ్లపై గుంతల కారణంగా కేరళ ఎర్నాకుళంలోని నెడుంబసెరీ హైవేపై జరిగిన ప్రమాదంలో కొద్దిరోజుల క్రితమే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 52ఏళ్ల ఆ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ గుంత కారణంగా రోడ్డుపై అదుపుతప్పి పడిపోగా.. అతడిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కేసును పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు వెంటనే గుంతలను పూడ్చాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)ని ఆదేశించింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని