SSC Results: 35 శాతంతో ‘పది’ పాస్‌.. పిల్లాడి తల్లిదండ్రుల సందడే సందడి!

పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించాలంటూ కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై తీసుకొచ్చే ఒత్తిడి అంతాఇంతా ఉండదు. మహారాష్ట్రలో మాత్రం పదో తరగతి ఫలితాల్లో తమ కుమారుడికి 35 శాతం మార్కులు రావడంపైనే ఓ తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు.

Updated : 09 Jun 2023 18:56 IST

ముంబయి: విద్యార్థులపై చదువుల భారం పెరిగిపోతోంది! ఎక్కువ మార్కులు సాధించాలన్న ఒత్తిడి (Exams Stress) సరేసరి. దీంతో పరీక్షలంటే హడలెత్తిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మార్కుల విషయంలో కొంతమంది తల్లిదండ్రుల తీవ్రమైన వ్యవహారశైలి.. విద్యార్థుల్లో మానసిక సమస్యలు, బలవన్మరణాలకూ దారితీస్తోంది. అయితే, మహారాష్ట్ర (Maharashtra)లో మాత్రం ఓ విద్యార్థికి పదో తరగతిలో 35 శాతం మార్కులు రావడంపైనే అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరణ్‌ (Awanish Sharan).. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. కేవలం మార్కుల ద్వారా ఒకరి ప్రతిభను అంచనా వేయలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ (Viral Video)గా మారింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో.. ఠాణెకు చెందిన ఓ విద్యార్థి అన్ని పరీక్షల్లో 35 మార్కులతో గట్టెక్కాడు. దీంతో కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది. విద్యార్థి తండ్రి ఓ ఆటో డ్రైవర్‌. తన తల్లిదండ్రుల నుంచి నిరంతర ప్రోత్సాహం కారణంగానే పాసైనట్లు విద్యార్థి తెలిపాడు. మరోవైపు నెటిజన్లు సైతం అతన్ని అభినందిస్తున్నారు. తల్లిదండ్రుల సానుకూల దృక్పథాన్ని కొనియాడుతున్నారు. గతంలో తనకూ తక్కువ మార్కులు వచ్చినప్పటికీ లడ్డూలు పంచినట్లు ఓ నెటిజన్‌ గుర్తుచేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. అవనీశ్‌ శరణ్‌ సైతం తనకు 10వ తరగతిలో 44.7 శాతం మార్కులే వచ్చినట్లు తెలిపారు. అయితేనేం.. డిగ్రీ అనంతరం సివిల్స్‌ రెండో ప్రయత్నంలో ఆలిండియా 77వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని