Ukraine Crisis: తరలింపునకు మరిన్ని మార్గాలు

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించేందుకు వీలుగా సరిహద్దుల వద్ద మరిన్ని మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు పొరుగు దేశాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయం ఆదివారం పేర్కొంది.

Updated : 28 Feb 2022 06:14 IST

ఆ దిశగా ఉక్రెయిన్‌ పొరుగు దేశాలతో చర్చిస్తున్నాం
తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న  భారతీయులు వీలైతే పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలి
అడ్వైజరీ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం

దిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించేందుకు వీలుగా సరిహద్దుల వద్ద మరిన్ని మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు పొరుగు దేశాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయం ఆదివారం పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, భారతీయుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. పరిస్థితులు కాస్త సజావుగా ఉన్నట్లు అనిపిస్తే ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ‘‘మీరున్న చోట కర్ఫ్యూ ఎత్తివేసినప్పుడు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛగా ఉన్నప్పుడు, దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లకు వెళ్లి పశ్చిమ ప్రాంతాలకు చేరుకోండి. రైల్వే మార్గాలు సురక్షితమైనవి. సాధారణ రైళ్లలో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. వీటితోపాటు ప్రజల తరలింపు కోసం ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వాటికి టికెట్లు అవసరం లేదు. అవసరమైనవాటినే బ్యాగులో తీసుకెళ్లండి. రాత్రిపూట మన్నికైన స్వెటర్లను ధరించండి. వీలైనంత ఎక్కువ నగదు, అవసరమైన ఔషధాలు దగ్గర ఉంచుకోండి’’ అని ఎంబసీ సూచించింది. ప్రయాణాలకు అనువైన పరిస్థితులు లేనిచోట, లేదా వేరే కారణాలతో బయటకు రాలేకపోతే పరిస్థితులు చక్కబడేవరకూ వేచి చూడాలని, సమూహాలుగా ఉంటూ పరస్పసరం అనుసంధానమై ఉండాలని సూచించింది.

పోలండ్‌లోకి వెళ్తున్న భారతీయులకు అడ్డంకులు

వార్సా: ఉక్రెయిన్‌ నుంచి పోలండ్‌లోకి వెళ్లడానికి యత్నిస్తున్న భారతీయులకు సరిహద్దులవద్ద చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం రొమేనియా, హంగరీల ద్వారా మాత్రమే భారతీయులను తరలిస్తోంది. ఇది తెలియని కొందరు ఆదివారం సరిహద్దులోని మెడికా ద్వారా పోలండ్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. అయితే అక్కడి అధికారులు వారిని అడ్డుకుని రొమేనియా సరిహద్దుకు వెళ్లాలని చెప్పారని పోలండ్‌లోని రుచిర్‌ కటారియా అనే వాలంటీర్‌ తెలిపారు. అప్పటికే సుదూర ప్రాంతాల నుంచి కాలి నడకన అక్కడికి వచ్చినవారు తిరిగి వందల కి.మీ. దూరంలో ఉన్న రొమేనియా సరిహద్దుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎలాగోలా పోలండ్‌లో ప్రవేశించిన భారతీయులను అక్కడి శిబిరాల్లో ఉండేందుకు అధికారులు అనుమతించడం లేదని, వాటిని ఉక్రెయిన్‌ జాతీయుల కోసమే ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు.

రష్యా సైనిక చర్య నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు ఉక్రెయిన్‌ నుంచి పోలండ్‌కు చేరుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఎలాంటి వీసా లేకుండానే ప్రవేశానికి అనుమతిస్తున్నామని భారత్‌లోని పోలండ్‌ రాయబారి ఆడమ్‌ పురాకోవిస్కీ ట్విటర్‌లో తెలిపారు.

ఒక్కో విమానానికి రూ.1.10 కోట్ల వ్యయం

ముంబయి: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సరిహద్దు దేశాల నుంచి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వానికి భారీగానే ఖర్చవుతున్నట్లు సమాచారం. భారతీయుల తరలింపు ప్రక్రియ కోసం ఎయిర్‌ ఇండియా ‘బోయింగ్‌ 787’ విమానాలను వినియోగిస్తోంది. ఈ విమానాలకు 250కిపైగా సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఈ రకం విమాన ప్రయాణానికి గంటకు రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకూ ఖర్చవుతుందని ఓ విమాన సంస్థ ఉద్యోగి తెలిపారు. ఒక్కో విమానం గమ్యస్థానాలైన రొమేనియాలోని బుకారెస్ట్‌, హంగరీలోని బుడాపెస్ట్‌లకు వెళ్లి తిరిగిరావడానికి రూ.1.10 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రయాణ దూరం, సమయం, ఇంధనం, సిబ్బంది సంఖ్య, ల్యాండింగ్‌, పార్కింగ్‌ ఛార్జీలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందన్నారు.


స్వదేశానికి చేరుకున్న మరో 688 మంది

దిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి వెళ్లిన మూడు ఎయిర్‌ ఇండియా విమానాలు ఆదివారం దిల్లీ చేరుకున్నాయి. వీటి ద్వారా మొత్తం 688 మంది స్వదేశంలో అడుగుపెట్టారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ నుంచి ఆదివారం 250 మందితో వచ్చిన విమానం ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్లవారుజామున 2.45 గంటలకు దిగింది. హంగరి రాజధాని బుడాపెస్ట్‌ నుంచి 240 మందితో వచ్చిన విమానం ఉదయం 9.20కి ల్యాండ్‌ అయింది. బుకారెస్ట్‌ నుంచి 198 మందితో బయల్దేరిన మరో విమానం సాయంత్రం 5.35కు చేరుకుంది. బుకారెస్ట్‌ నుంచి తొలి విమానంలో వచ్చినవారికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానాశ్రయంలో గులాబీలతో స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా శనివారం ముంబయి చేరుకున్న తొలి విమానంలో 219 మంది ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం నాలుగు విమానాల్లో 907 మంది స్వదేశానికి చేరుకున్నట్లయింది. ఎయిర్‌ ఇండియా మరో రెండు విమానాలను పంపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది భారతీయులను తరలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రుంగ్లా చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఇండిగో సంస్థ రెండు విమానాలను నడపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోమ, మంగళవారాల్లో ఇవి దిల్లీ నుంచి ఇస్తాంబుల్‌ మీదుగా బుడాపెస్ట్‌కు వెళ్తాయని పేర్కొన్నాయి. అదే మార్గంలో తిరిగొస్తాయని తెలిపాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని