Updated : 10 Apr 2022 06:47 IST

Andhra News: ఇప్పుడంత ఈజీగా లేదా..?

సునాయాసంగానే తొలి కేబినెట్‌ కూర్పు

తాజా జట్టు ఎంపికలో మాత్రం సుదీర్ఘంగా కసరత్తు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ 2019 జూన్‌లో తొలి మంత్రివర్గ కూర్పును సునాయాసంగా చేయగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి అంత ఈజీగా లేదంటున్నాయి వైకాపా వర్గాలు. సామాజిక సమీకరణాల దృష్ట్యా పాత మంత్రుల్లో ఒకరిద్దరిని కొనసాగించాలని ముఖ్యమంత్రి తొలుత నిర్ణయించారు. ఆ విషయాన్ని కొన్ని సందర్భాల్లో సూత్రప్రాయంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పారు. ‘మంత్రులంతా రాజీనామా చేయాలి. వారిలో కొనసాగించేవారితోపాటు, కొత్తవారితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తా’మని కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ ప్రకారమే అంతా జరిగిపోతుందని అంచనా వేశారు. కానీ, అంత సాఫీగా జరగట్లేదని దాని ప్రభావమే పాత మంత్రుల్లో ఒకరో ఇద్దరో కొనసాగుతారన్న ముఖ్యమంత్రి ప్రకటనలో మార్పు చేయాల్సిన పరిస్థితికి దారి తీసిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తొలుత ఒకరిద్దరని.. తర్వాత నలుగురైదుగురని.. ఇంకోసారి అయిదారుగురని.. మళ్లీ 10 మంది వరకు పాత వాళ్లకు అవకాశం ఉందని ఇలా పలు విధాలుగా అధికార పార్టీ నుంచి లీకులు వెలువడ్డాయి. మరోవైపు కొత్తగా చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు వివిధ రూపాల్లో చేస్తున్న లాబీయింగ్‌ సీఎంపై ఒత్తిడి పెంచిందంటున్నారు.

అప్పుడు తితిదే.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ: తితిదే పాలకమండలి, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాను ఖరారు చేసేందుకు సీఎం గతేడాది విపరీతమైన కసరత్తే చేయాల్సి వచ్చింది. ‘మంత్రివర్గంలోకి తీసుకునే వారి జాబితా సునాయాసంగా చేసుకోగలిగా కానీ, తితిదే విషయంలో మాత్రం అబ్బో..!’ అని అప్పట్లో మంత్రిమండలి సమావేశంలో సీఎం అన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజా కూర్పు తితిదే పాలకమండలి నియామకం కంటే సంక్లిష్టంగా మారినట్లుందని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులుగా ఉన్నవారు తిరిగి అదే పదవుల్లో కొనసాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు, సిఫార్సులు, ఇతరత్రా ఒత్తిడి ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అందువల్లే మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంలో సీఎం మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు.

నేటి మధ్యాహ్నానికి కొలిక్కి!: సోమవారం ఉదయం కొత్త మంత్రులు ప్రమాణం చేయాల్సి ఉంది. వారి జాబితా ఆదివారం మధ్యాహ్నానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సీఎం మార్పులు చేర్పులు చేస్తారని సీఎంవో ప్రతినిధులే చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి జాబితా ఖరారైతే అప్పుడు దాన్ని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపనున్నారు. ఆ తర్వాతనే మంత్రులు కాబోతున్న ఎమ్మెల్యేలకు ఫోన్‌ ద్వారా సమాచారమిస్తారు. ఇంత ఉత్కంఠ 2019 ఎన్నికల ముందు 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది లోక్‌సభ అభ్యర్థుల ఎంపికప్పుడు కానీ, ఇటీవల వందల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ సమయంలో కానీ కనిపించలేదని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రచారంలో ఉన్న ప్రకారం పాత మంత్రుల్లో కొనసాగే వారి పేర్లు..!: గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌, నారాయణస్వామి, తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర నారాయణ, కొడాలి నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిలలో అయిదారుగురికి లేదా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఇంకో ఒకరిద్దరికీ కొత్త మంత్రివర్గంలో అవకాశంఉండొచ్చంటున్నారు.

రాజ్‌భవన్‌కు రాజీనామా పత్రాలు

రాష్ట్ర మంత్రివర్గంలోని 24 మంది మంత్రుల రాజీనామా పత్రాలు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం కోసం శనివారం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజ్‌భవన్‌ చేరుకున్నాయి. మంత్రుల రాజీనామాలు ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రి రాసిన లేఖను వాటికి జతచేసి పంపారు. సాధారణ పరిపాలన శాఖ అధికారులు ఆ దస్త్రాన్ని రాజ్‌భవన్‌కు అందజేశారు. మంత్రుల రాజీనామాల్ని గవర్నర్‌ ఆదివారం ఉదయం ఆమోదించనున్నారు. మంత్రివర్గంలో కొలువుదీరే కొత్త మంత్రుల జాబితాను ఆదివారం మధ్యాహ్నం తర్వాత గవర్నర్‌కు ముఖ్యమంత్రి పంపనున్నట్లు సమాచారం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని