స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి

రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది.

Published : 25 Apr 2024 06:09 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. స్వగ్రామాల్లో పిటిషనర్లు ప్రశాంత జీవనం సాగించేలా రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. రక్షణ కల్పిస్తామన్న పోలీసుల తరఫు న్యాయవాది వాదనలను నమోదు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 2019లో వైకాపా అధికారం చేపట్టాక తమను రాజకీయ కక్షతో గ్రామాల నుంచి వెళ్లగొట్టారని పేర్కొంటూ తెదేపా సానుభూతిపరులైన పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ఎం.యేసుదానం, మరో 49 మంది, జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన గుమ్మ పెదరాజయ్య, మరో 24 మంది హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, ముప్పాళ బాలకృష్ణ వాదనలు వినిపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా సానుభూతిపరుల కుటుంబాలపై వైకాపా నేతలు దాడి చేసి, గ్రామాల నుంచి వెళ్లగొట్టారన్నారు. గ్రామాల్లో అడుగుపెట్టొదని హెచ్చరించారని, దాంతో ప్రాణభయంతో పిటిషనర్లు ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నారని వివరించారు. స్వగ్రామాల్లో జీవనం సాగించేందుకు పిటిషనర్లకు రక్షణ కల్పించేలా ఆదేశించాలని కోరారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వారికి రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఈ వివరాలను నమోదు చేసిన న్యాయమూర్తి.. పిటిషనర్లకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ.. వ్యాజ్యాలను పరిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని