POLAVARAM PROJECT: పరిహారం..ఫలహారం

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో ఇది మరో అక్రమాల అంకం. కొండ పోరంబోకు భూములకు నకిలీ డి ఫాం పట్టాలతో దొంగ లబ్ధిదారులను సృష్టించి రూ.కోట్ల పరిహారం ఫలహారం చేశారు. ఇందులో దళారులు కీలకపాత్ర పోషించారు. వీరికి రెవెన్యూ సిబ్బంది, ఒకరిద్దరు అధికారులు సహకరించడం వల్లే ఈ స్థాయి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. గిరిజనుల పేరుతోనే ఆ మొత్తం బదిలీ అయ్యేలా చూసి వారికి కొంత మొత్తం అందించారు. సింహభాగం దళారులు, కొందరు రెవెన్యూ....

Updated : 05 May 2022 06:28 IST

పోలవరం భూసేకరణలో అక్రమాలు
పాత తహసీల్దార్ల సంతకాల ఫోర్జరీ, దొంగ ముద్రలు
నకిలీ పట్టాలతో దళారుల మోసాలు ..కొందరు అధికారుల వత్తాసు
345 ఎకరాల్లో అక్రమాలుజరిగినట్లు అనుమానాలు
బయటపడ్డవి కొన్నే..
లబోదిబోమంటున్న బాధితులు
పోలవరం నిర్వాసిత గ్రామాల నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి, న్యూస్‌టుడే - దేవీపట్నం

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ అంశంలో ఇది మరో అక్రమాల అంకం. కొండ పోరంబోకు భూములకు నకిలీ డి ఫాం పట్టాలతో దొంగ లబ్ధిదారులను సృష్టించి రూ.కోట్ల పరిహారం ఫలహారం చేశారు. ఇందులో దళారులు కీలకపాత్ర పోషించారు. వీరికి రెవెన్యూ సిబ్బంది, ఒకరిద్దరు అధికారులు సహకరించడం వల్లే ఈ స్థాయి అక్రమాలు చోటుచేసుకున్నాయన్న చర్చ జరుగుతోంది. గిరిజనుల పేరుతోనే ఆ మొత్తం బదిలీ అయ్యేలా చూసి వారికి కొంత మొత్తం అందించారు. సింహభాగం దళారులు, కొందరు రెవెన్యూ సిబ్బంది, అధికారులు పంచుకున్నారనే అనుమానాలు రేగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో ఈ అక్రమాలు తాజాగా వెలుగుచూశాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన జలాశయానికి, ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరిస్తున్నారు. మరోవైపు నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాస ప్రక్రియ సాగుతోంది. దేవీపట్నం మండలం చిన రమణయ్యపేట పంచాయతీలోని గ్రామాల్లో ఇలా నకిలీ డి ఫాం పట్టాలు సృష్టించినట్లు వెలుగులోకి వచ్చింది. 

ఎకరానికి రూ.7.50 లక్షల చొప్పున ఇప్పటికే ఆ మొత్తాలు నకిలీ లబ్ధిదారులకు అందించడం, ఆ సొమ్ము చేతులు మారడం పూర్తయింది. తాజాగా 30 ఎకరాలకు సంబంధించిన అక్రమాలు బయటపడ్డాయి. పోలవరం భూసేకరణలో కొన్నేళ్లుగా ఒక్క దేవీపట్నం మండలంలోనే 345 ఎకరాల వరకు ఇలా అక్రమ పట్టాల రూపేణా పరిహారం దారి మళ్లినట్లు సమాచారం. చాలా మంది గిరిజనులు ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. డి ఫాం పట్టాలకు పరిహారం చెల్లించే క్రమంలో ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరికి చెల్లిస్తున్నామనే డ్రాఫ్టు నోటిఫికేషన్‌, డ్రాఫ్టు డిక్లరేషన్‌ ఇవ్వకపోవడంతోనే ఇలాంటి అక్రమాలకు తావు ఏర్పడుతోందని అంటున్నారు. అసలు లబ్ధిదారులు పరిహారం కోసం ఎదురుచూస్తుంటే.. దొంగ పట్టాలతో ఆ పరిహారాన్ని కొందరు భోం చేస్తున్నారనే ఆరోపణలకు తాజా ఉదంతం బలం చేకూరుస్తోంది. ఈ విషయమై రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్యతో ‘ఈనాడు’ మాట్లాడి వివరణ కోరింది. 25 ఎకరాలకే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. 345 ఎకరాల అంశం తమ దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా నిర్దిష్టంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని వెల్లడించారు.

పాత తహసీల్దార్ల సంతకాలతో దొంగ పట్టాలు

దేవీపట్నం మండలంలో గతంలో పని చేసిన ముగ్గురు తహసీల్దార్ల ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ ముద్రలతో దళారులు ఇలా దొంగ పట్టాలు సృష్టించారని తెలిసింది. తహసీల్దార్లలో ఒకరు పదవీ విరమణ చేయగా మరొకరు మరణించారు. ఇంకొకరు వేరే జిల్లాలో పని చేస్తున్నారు. ఈ పని చేసిన దళారుల పేర్లూ గ్రామస్థుల ఫిర్యాదులో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో ఎక్కడెక్కడ డి ఫాం భూములున్నాయి? అవి ఎవరివి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయో తెలిసినవారే అక్రమాలకు తెరతీశారు. చినరమణయ్యపేట పంచాయతీలో ఇంకా ఎవరెవరికి పరిహారం అందలేదో, వారి భూముల సర్వే నెంబర్లేవో తెలుసుకుంటున్నారు. అదే గ్రామంలో భూములు లేని వేరే గిరిజనుల పేరుతో దొంగ పట్టాలు సృష్టిస్తున్నారు. ఆ గిరిజనుల ఖాతా నంబర్లు తీసుకుని.. వారికి కొంత సొమ్ము ఇస్తామని బేరం కుదుర్చుకుని మిగిలిన మొత్తాలకు ముందే చెక్కులు తీసుకుంటున్నారు. ఇలా ఆయాచితంగా లబ్ధి పొందిన వారిలో కొందరు ఊరు వదిలి వెళ్లిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికే రూ.కోట్లు అక్రమార్కుల చేతికి చేరింది. ఆయా భూములకు జెన్యునిటీ సర్టిఫికెట్ల జారీలోనూ అక్రమాలు చోటుచేసుకోవడం వల్లే ఈ వ్యవహారం సాగిపోతున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడితే విచారణ జరుగుతోందని, రెండు మూడు రోజుల్లో నివేదిక సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


ఎలా బయటపడింది?

దేవీపట్నం మండలం గుబ్బలంపాడు, చినరమణయ్యపేట, సీతారం గ్రామాలకు చెందిన గిరిజనులు, గిరిజనేతరులు తమ భూములకు పరిహారం అందుతుందని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారు. అధికారులు వారికి పరిహారం అందుతుందనే చెబుతున్నారు. ఇంతలో అవే గ్రామాల్లో వేరేవారికి పరిహారం సొమ్ము అందింది. అలా పొందిన వారికి గ్రామంలో భూములు లేవు. వారికి పరిహారం ఎలా అందిందా అని గ్రామస్థులు తహసీల్దారు కార్యాలయంలోను, ఇతరత్రా కార్యాలయాల్లో విచారించారు. ‘మీ పేరున ఇప్పటికే భూసేకరణ పరిహారం చెల్లించేశారు’ అని సమాధానం వచ్చింది. దీంతో విస్తుపోవడం వీరి వంతయింది. అసలేం జరిగిందని గ్రామస్థులే ఆరా తీసి, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించగా ఎవరెవరికి, ఏ పట్టాలతో పరిహారం అందించారో ఆ వివరాలు బయటపడ్డాయి. తీరా చూస్తే అవన్నీ నకిలీ పట్టాలని గ్రామస్థులు గుర్తించారు.


ఫిర్యాదు చేశామని కేసులు

- డి.కాంతమ్మ, గుబ్బలపాలెం

మాకు ఆరు ఎకరాల భూమి అల్లుడు, కూతురి పేరున ఉంది. వారి కోసం నేను అధికారుల చుట్టూ తిరుగుతున్నా. పరిహారం రాలేదని ప్రాజెక్టు అధికారి వద్దకు వెళ్లాం. ఆయన జేసీ దగ్గరికి వెళ్లమంటున్నారు. ఈలోపు ఆ భూమికి పరిహారం వేరేవారికి ఇచ్చేశారు. ఆ విషయంపై ఫిర్యాదు చేస్తే దళారులు మాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమ్మల్ని స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించారు. మాకు న్యాయం చేయాలి.


మా భూములకు వేరే వారికి సొమ్ము ఇచ్చేశారు
- మిర్తివాడ సీతమ్మ, చినరమణయ్యపేట పంచాయతీ

మాకు సర్వే నంబరు 111/2లో మా అత్త పేరున భూమి ఉంది. ఆ భూమికి పరిహారం కోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో మా భూమి పేరుతో నకిలీ పట్టా సృష్టించి సొమ్ము ఇచ్చేశారని తెలిసింది. అధికారులకు ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని కోరుతున్నాం.


285 ఎకరాల్లో అక్రమాలపై సమాచారముంది
- మట్టా మెహర్‌బాబా గౌడ్‌, పాతూరు

మా భూమికి పరిహారం కోసం వెళ్తే అధికారులు తిప్పించుకున్నారు. తీరా వేరే వారికి పరిహారం ఇచ్చేశారని తెలిసింది. కొందరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. పాత అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. కొందరు అధికారులు వారితో కలిసి ఇలా చేస్తున్నారు. ఇంతవరకు 285 ఎకరాలకు సంబంధించి ఇలా అక్రమాలు జరిగాయని మేం సమాచారం సేకరించాం. సమగ్ర విచారణ జరపాలి. మాలాంటి బాధితులందరికీ న్యాయం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని