ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్‌ కొట్టివేత

యూరియా, అమోనియా ప్లాంట్‌ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్స్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్‌ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Updated : 07 May 2024 06:39 IST

ఏ ప్రక్రియను అనుసరించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమే: హైకోర్టు

ఈనాడు, అమరావతి: యూరియా, అమోనియా ప్లాంట్‌ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫెర్టిలైజర్స్‌ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్‌ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. భూములు, సహజ వనరుల కేటాయింపు, వేలం నిర్వహించడం లాంటి ప్రక్రియల్లో ఏది సరైనదని నిర్ణయించుకునే విచక్షణాధికారం ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొంది. పారిశ్రామికాభివృద్ధిని ఆకాంక్షిస్తూ భూముల కేటాయింపు జరపొచ్చంది. ఇఫ్కోకు కేటాయించిన భూములకు బహిరంగ వేలం నిర్వహించినట్లయితే ప్రభుత్వానికి మరింత ఆదాయం వచ్చేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

కేసు నేపథ్యం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరు పరిధిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానానికి చెందిన 1009 ఎకరాలతోపాటు కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం, రేగడిచెలిక, రాచర్లపాడు, తలమంచి తదితర గ్రామాల రైతులకు చెందిన 1767 ఎకరాల పట్టాభూములతో కలుపుకొని మొత్తం 2776 ఎకరాలను ఇఫ్కోకు ఇచ్చారని పేర్కొంటూ.. కొడవలూరు మండల అప్పటి జడ్పీటీసీ సభ్యులు ఈ. శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు 2017లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. భూకేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నందున సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని కోరారు. మరోవైపు తమ భూములను తీసుకొని పరిహారం చెల్లించకుండా ఇఫ్కోకు ఇచ్చారని పేర్కొంటూ మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం నిర్ణయాన్ని ప్రకటించింది. 1009 ఎకరాలు శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి చెందినవి కాదని.. ప్రభుత్వ భూములంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనం గుర్తుచేసింది.

ఇఫ్కో కోసం కేటాయించిన భూమిని ప్రైవేటు ప్రయోజనం కోసం ఇచ్చినట్లు భావించలేమంది. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో ఇఫ్కోకు భూములు కేటాయించి ఉండాల్సిందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. ఇఫ్కోకు 1997లో భూములు కేటాయించినప్పుడు ఆ విధానం అమల్లో లేదని గుర్తుచేసింది. ఎరువుల ప్లాంట్‌కు కేంద్రం అనుమతివ్వలేదని తెలిపింది. ఇఫ్కోకు కేటాయించిన భూమిని.. అనంతరం కిసాన్‌ ఎస్‌ఈజడ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని పేర్కొంది. ఎస్‌ఈజడ్‌ పరిధిలో లేని భూములను మాత్రమే కోకా కోలా, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కేటాయించారంది. ప్రభుత్వం కేటాయించిన నీటిని కనిగిరి రిజర్వాయర్‌ నుంచి కోకాకోల సంస్థ వినియోగిస్తుందని పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని