Updated : 03 Jul 2022 11:36 IST

5 కి.మీ. కొట్టుకుంటూ తీసుకెళ్లారు

నీళ్ల సీసా ఇచ్చి రక్తం కడిగేసుకోవాలన్నారు

ఆ తర్వాత మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు

పోలీసుల చిత్రహింసలను వివరించిన గార్లపాటి వెంకటేష్‌

ఈనాడు, అమరావతి: ‘అర్ధరాత్రి నన్ను ఇంట్లోంచి లాక్కొచ్చి పోలీసు వాహనం ఎక్కించారు. నాకు అటూ ఇటూ ఇద్దరు పోలీసులు కూర్చున్నారు. ఒకరు మోచేత్తో బలంగా నా ముఖంపై కొట్టారు. పెదవి పగిలి రక్తం కారుతుండటంతో... ఆ బాధతో నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ముందుకు వంగాను. అప్పుడు మెడ మీద గట్టిగా కొట్టారు. 5 కిలోమీటర్ల దూరం వెళ్లేదాకా కొడుతూనే ఉన్నారు. పోలీసుల దెబ్బలకు తలంతా దిమ్ముగా అయిపోయి... మాట్లాడలేకపోయాను’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడన్న అభియోగంపై సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వాహకుడు, ధరణికోటకు చెందిన గార్లపాటి వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకటేష్‌ వాపోయారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో కలసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెడకు పట్టీతో ఉన్న వెంకటేష్‌... పోలీసుల కస్టడీలో, ఆసుపత్రిలో వైద్య చికిత్సల సమయంలో తనకు ఎదురైన అనుభవాల్ని వివరించారు. ‘పోలీసుల దెబ్బలకు పెదవి పగిలి రక్తం కారితే... కార్లోనే నీళ్ల సీసా ఇచ్చి శుభ్రం చేసుకోవాలన్నారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్‌ ముందుకు తీసుకెళ్లారు. పోలీసులు నన్ను కొట్టారని, భుజం నొప్పిగా ఉందని మెజిస్ట్రేట్‌తో చెప్పాను. మెజిస్ట్రేట్‌ నా అవస్థ గమనించి అర్ధరాత్రి 12 గంటలకు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పరీక్షల కోసం పంపారు’ అని తెలిపారు.

వైద్యులనూ మేనేజ్‌ చేశారు..
ఆసుపత్రికి వెళ్లాక వైద్యులను పోలీసులు మేనేజ్‌ చేశారని వెంకటేష్‌ చెప్పారు. ‘నన్ను అసలు కొట్టనేలేదని, దెబ్బలేమీ తగల్లేదని డాక్టర్లకు చెప్పాలంటూ నాతో పోలీసులు అన్నారు. నాకు ఎక్కడ నొప్పిగా ఉందో డాక్టర్లకు చెబుతుంటే... ‘నువ్వు యాక్షన్‌ చేస్తున్నావ్‌’ అంటూ పోలీసులు నన్ను గద్దించారు. డాక్టర్లు కూడా... నటిస్తున్నావన్నారు. నిజంగానే నాకు చాలా ఇబ్బందిగా ఉందని పరీక్షలు చేస్తే సమస్య తెలుస్తుందని వారితో చెప్పాను. రాత్రి 12 గంటల నుంచి మర్నాడు సాయంత్రం దాకా పరీక్షల తంతు కొనసాగింది. చేసిన పరీక్షే పది సార్లు చేశారు. చివరకు ఏమీ లేదని ఫేక్‌ రిపోర్టును సీల్డ్‌ కవర్‌లో పెట్టి జడ్జికి పంపించారు’ అని వెంకటేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

సునీల్‌ కుమార్‌కు జగన్‌, సజ్జల జీతం ఇస్తున్నారా?: వర్ల రామయ్య
‘సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ అన్ని పార్టీలనూ ఒకేలా ఎందుకు చూడటం లేదు? వైకాపా వాళ్లు చిన్న ఫిర్యాదు చేస్తే ఆగమేఘాల మీద దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి నకిలీ పత్రికా ప్రకటన విడుదల చేయడంపై గత నెల 5న సునీల్‌ కుమార్‌కు ఫిర్యాదు ఇస్తే ఇంతవరకు కేసే నమోదు చేయలేదు. ఆయనకు జగన్‌గానీ, సజ్జలగానీ సొంత డబ్బులు తీసి జీతం ఇస్తున్నారా? ప్రజల సొమ్ము తీసుకుంటూ, ప్రజలకు సేవ చేయాల్సిన ఆయన అధికార పార్టీకి ఊడిగం చేయడం సిగ్గుచేటు’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ధ్వజమెత్తారు. 

ఫోర్జరీ చేసిన వారిపై చర్య తీసుకోండి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ సీఐడీ అదనపు డీజీపీ సునీల్‌ కుమార్‌కు వర్ల రామయ్య శనివారం లేఖ రాశారు. వైకాపా మద్దతుదారులు జూన్‌ 13న, జులై 1న అచ్చెన్నాయుడి లెటర్‌ హెడ్‌ను, సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ప్రకటనలు విడుదల చేసి, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని