Updated : 04 Jul 2022 05:52 IST

వారసత్వ రాజకీయాలు ప్రమాదకరం

దేశంలో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్‌ యత్నం

మోదీ పాలనలో భారత్‌ ఎంతో ఎత్తుకు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్‌షా

ఈనాడు హైదరాబాద్‌: దేశంలో వారసత్వ, కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని భాజపా ఆందోళన వ్యక్తం చేసింది. పలు రాజకీయ పార్టీలు అప్రజాస్వామిక, వారసత్వ రాజకీయాలకు లొంగిపోవడంతో పాటు కుల, ప్రాంతీయతత్వాలను పెంచి పోషిస్తున్నాయని పార్టీ కార్యవర్గ సమావేశం పేర్కొంది. విచ్ఛిన్నకర శక్తులు, తుక్‌డే తుక్‌డే గ్యాంగ్‌లతో కలిసి దేశంలో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని విమర్శించింది. వారసత్వ రాజకీయాల వల్ల కాంగ్రెస్‌ సిద్ధాంత రహిత, అవకాశవాద, అవినీతి పార్టీగా మిగిలిపోయిందని ధ్వజమెత్తింది. హైదరాబాద్‌లో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండోరోజు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా 15 పేజీల రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న 30-40 ఏళ్లు భాజపా యుగమని వ్యాఖ్యానించారు. కర్ణాటక, అస్సాం ముఖ్యమంత్రులు బసవరాజ్‌ బొమ్మై, హిమంత బిశ్వశర్మ ఈ తీర్మానాన్ని బలపరిచారు. దీనిపై చర్చలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, తెరాస పాలన గురించి వివరించారు. రాజకీయ తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

అన్ని ప్రాంతాల్లో భాజపాకు ప్రజాదరణ 

‘మోదీ నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వం ప్రజాద]రణ పొందుతోంది. తాజా ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. గత కొన్ని దశాబ్దాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గెలవడం.. పైగా మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధించడం ఇదే మొదటిసారి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, పశ్చిమ నుంచి తూర్పు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు భాజపాకు ప్రజల ఆశీర్వాదం లభించింది. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ప్రధానమంత్రి మోదీకి గతంలో సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. దీంతో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని విపక్షాలు, కొన్ని ఎన్జీవోలు, మేధావులుగా చెప్పుకొనే వారితో పాటు విదేశీ నిధులతో నడిచే ఓ వర్గం మీడియా కుట్రలు బయటపడ్డాయి. ఇందుకు కాంగ్రెస్‌, దాని అనుబంధ సంస్థలు దేశానికి క్షమాపణ చెప్పాలి. అమృతాన్ని దేవతలకు అందించేందుకు శివుడు గరళాన్ని తన కంఠంలో ఉంచుకొన్నట్లు ఈ అల్లర్ల అంశంలో మోదీ కూడా ఆ నిందను ఇంతకాలం భరించారు. గతంలో దర్యాప్తు సంస్థలన్నింటికీ మోదీ సహకరించారు. రాజ్యాంగంపై తన విశ్వాసాన్ని చాటుకున్నారు. కానీ ప్రతిపక్ష నేతలపై అక్రమాల అభియోగాలు వస్తుంటే వారు ఆక్రోశంతో మోదీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. గత ఎనిమిదేళ్లుగా మోదీ నాయకత్వంలో రోజురోజుకు భారతదేశం ఎంతో ఎత్తుకు ఎదుగుతోంది. మహారాష్ట్ల్రలో అభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసమే ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందేేకు భాజపా మద్దతు పలికింది. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రి అయ్యారు. అవకాశవాద, సిద్ధాంతరహిత మైత్రితో ఏర్పడిన ‘మహావికాస్‌ అఘాడీ’ వల్ల మహారాష్ట్రలో అభివృద్ధి స్తంభించి.. తీవ్రస్థాయిలో అవినీతి జరిగింది. భాజపా అధికారం కోసం పాకులాడదని ప్రస్తుత పరిణామాలతో మరోసారి రుజువైంది’ అంటూ రాజకీయ తీర్మానం పేర్కొంది.

దక్షిణాదిలో అధికారంలోకి రావడంపై చర్చించాం 

కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వశర్మ విలేఖరుల సమావేశంలో వివరించారు. ‘దేశంలో కుల, మత, కుటుంబ రాజకీయాలకు ముగింపు పలుకుతూ పనితీరు, అభివృద్ధి కేంద్ర రాజకీయాలే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తోంది. పశ్చిమబెంగాల్‌, తెలంగాణల్లో కుటుంబ పాలనకు తెర దించుతాం. దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అధికారం సాధించడంపై చర్చించాం. కీలకమైన రాజకీయ తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ముఖ్యనాయకులంతా విస్తృతంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ వ్యవహారశైలిపైనా చర్చించాం. పూర్తి నిరాశతో ఉన్న ఆ పార్టీ సర్జికల్‌ స్ట్రైక్స్‌, ఆర్టికల్‌ 370 రద్దు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, జీఎస్టీ, చివరకు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ను కూడా తప్పుపడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళను నిలబెట్టినా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. చివరకు పార్టీకి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించుకోలేకపోతోంది. ఇంటింటికీ తిరంగా కార్యక్రమంలో రాజకీయం లేదు. భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో రాజకీయ వేధింపులు పెరిగాయి. ఆర్టికల్‌ 370 రద్దు, భారత్‌లో అంతర్భాగంగా జమ్మూకశ్మీర్‌, అగ్నిపథ్‌ ఏర్పాటు, సీడీఎస్‌ సహా పలు అంశాలపై చర్చ జరిగింది. దేశరక్షణ, ఆంతరంగిక భద్రతపై సమాలోచనలు జరిపాం. ప్రధాని మోదీ పాలనలో దేశంలో పేదరికం 22 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది. ప్రపంచ దేశాలకు భారత్‌ మార్గదర్శకంగా మారుతోంది. దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దడమే భాజపా లక్ష్యం. నరేంద్రమోదీ పాలనలో ఇద్దరు రాష్ట్రపతుల నియామకానికి అవకాశం రాగా.. మొదటిసారి దళితులకు, ఇప్పుడు ఆదివాసీ మహిళకు అవకాశం ఇచ్చారు.

ముర్ము జీవితంపై దృశ్యమాలిక రూపొందించాలి: ప్రధాని 

రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ముకు అవకాశం ఇవ్వడాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ఆమె జీవితంపై దృశ్యమాలికను రూపొందించాలన్నారు. సబ్‌కా సాత్‌... సబ్‌కా వికాస్‌ నినాదంతోనే ముందుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని తెలిపారు’ అని బిశ్వశర్మ వివరించారు. ఉదయ్‌పుర్‌, అమరావతి (మహారాష్ట్ర) ఘటనలపై స్పందిస్తూ.. దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించామన్నారు.


విజయం సాధించేదాకా విశ్రమించొద్దు 

తెలంగాణ నేతలతో నడ్డా, అమిత్‌షా ప్రత్యేక భేటీ

తెలంగాణలో భాజపాకు మంచి వాతావరణం ఉందని.. సద్వినియోగం చేసుకుని వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్‌షా రాష్ట్ర నేతలకు ఉద్బోధించారు. విజయం సాధించేదాకా విశ్రమించొద్దన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాత్రి 9.45కి ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు గంట సేపు జరిగింది. కేంద్ర   మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సీనియర్‌ నేతలు కె.లక్ష్మణ్‌, డీకే అరుణ,  ఈటల రాజేందర్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. నడ్డా తర్వాత రెండోస్థానంలో ఉన్న సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభతో పార్టీకి తెలంగాణలో మంచి ఊపు వచ్చిందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించారు.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని