సంక్షిప్త వార్తలు (5)

పాఠశాలల్లో ఫార్మెటివ్‌-1 పరీక్షలను సెప్టెంబరు6 నుంచి 9 వరకు నిర్వహించేందుకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫార్మెటివ్‌-2

Updated : 10 Aug 2022 05:49 IST

ఫార్మెటివ్‌ పరీక్షలు సెప్టెంబరు 6 నుంచి

ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో ఫార్మెటివ్‌-1 పరీక్షలను సెప్టెంబరు6 నుంచి 9 వరకు నిర్వహించేందుకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫార్మెటివ్‌-2 పరీక్షలను అక్టోబరు 12-15, సమ్మెటివ్‌-1 పరీక్షలు నవంబరు 21-30 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫార్మెటివ్‌-3 వచ్చే ఏడాది జనవరి 19-22, ఫార్మెటివ్‌-4 పరీక్షలు మార్చి 6-10 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి22 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు, సమ్మెటివ్‌-2 పరీక్షలను ఏప్రిల్‌ 13-27 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.


ఏపీఈసెట్‌ ఫలితాలు నేడు

ఏపీఈసెట్‌ ఫలితాలను బుధవారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈసెట్‌కు మొత్తం 38,801 మంది దరఖాస్తు చేయగా.. 36,440 మంది హాజరయ్యారు.


విద్యా వ్యతిరేక విధానాలపై 11న నిరసన

విద్యారంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 11న అన్ని జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట పికెటింగ్‌ నిర్వహించనున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజుల, భానుమూర్తి తెలిపారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, పాఠశాలల విలీన ప్రక్రియను నిలిపివేయాలని, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-117ను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్నారు.


కేజీబీవీలో బదిలీలు వాయిదా వేయాలి: ఏపీటీఎఫ్‌

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌-1987) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి డిమాండ్‌ చేశారు. బదిలీల్లో కనీసం రెండేళ్లు పూర్తికాని, ఎనిమిదేళ్ల పని సర్వీసులేని వారి విద్యాలయాలు ఖాళీలుగా చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నియామక తేదీలు తప్పులు సరిచేయకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టవద్దని కోరారు.


ఉద్యోగ విరమణ వయసు పెంచాలి: ఒంటేరు

ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని మోడల్‌ స్కూల్స్‌ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు. ఈ నెలలో కొందరు బోధన సిబ్బంది 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేయనున్నారని, వెంటనే వారికి 62 ఏళ్లు అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని