ఉప్పునీటితో ‘వెలుగులు’

సముద్ర ఉప్పునీటితో వెలిగే తొలి లాంతరును కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ శనివారం విడుదల చేశారు. ఇందులో నింపే సముద్రనీరే ప్రత్యేకంగా రూపొందించిన ఎలెక్ట్రోడ్స్‌

Published : 14 Aug 2022 03:24 IST

లవణ జల లాంతరుకు రూపకల్పన

ఈనాడు, దిల్లీ: సముద్ర ఉప్పునీటితో వెలిగే తొలి లాంతరును కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ శనివారం విడుదల చేశారు. ఇందులో నింపే సముద్రనీరే ప్రత్యేకంగా రూపొందించిన ఎలెక్ట్రోడ్స్‌ మధ్య ఎలెక్ట్రోలైట్‌గా పనిచేసి ఎల్‌ఈడీ బల్బులను వెలిగిస్తుంది. తొలిసారి రూపొందించిన ఈ లాంతరుకు రోషిణి అని నామకరణం చేసినట్లు మంత్రి వెల్లడించారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ సంస్థ నిర్వహిస్తున్న తీరప్రాంత పరిశోధన నౌక సాగర్‌ అన్వేషికను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ లాంతరును విడుదల చేశారు. దేశంలోని సముద్రతీరంలో నివసించే మత్స్యకారులు, ఇతర పేదల జీవితాల్లో ఈ లాంతరు వెలుగులు నింపి వారి జీవితాన్ని మరింత సులభతరం చేస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు ఎల్‌ఈడీ బల్బులు పంపిణీచేయడానికి 2015లో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఉజాలా స్కీంకి ఈ లవణ జల లాంతరు మరింత ఊతమిస్తుందని తెలిపారు. ఈ సాంకేతికతను దేశంలో సముద్ర జలాలు లభ్యంకాని ప్రాంతాల్లోనూ ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. సాధారణ ఉప్పు కలిపిన నీటిని కూడా వాడి ఇందులోని ఎల్‌ఈడీ దీపాలను వెలిగించవచ్చని, ఇది చాలా చౌకగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ సాంకేతికతను పరిశ్రమకు బదిలీచేయాలని ఆయన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీని కోరారు. దానివల్ల ఇలాంటి లాంతర్లను పెద్దఎత్తున ఉత్పత్తిచేసి పేదలకు పంపిణీచేయడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ప్రకృతివైపరీత్యాల సమయంలో గ్రామీణ ప్రాంతాలకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని