ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు

వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి.

Published : 09 May 2024 04:08 IST

రూ.8 కోట్లతో చేపట్టిన  సర్వజన వైద్యశాల అదనపు గదుల పనులు
మార్కాపురంలో ఘటన

మార్కాపురం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. గతంలో మార్కాపురానికి వైద్యకళాశాల మంజూరుగా కాగా.. దీనికి అనుబంధంగా జిల్లా వైద్యశాలను సర్వజన వైద్యశాలగా మార్పు చేసి రూ.8 కోట్ల నిధులతో రెండో అంతస్తులో 290 అదనపు పడకల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులను గతేడాది సెప్టెంబరులో మేఘా కంపెనీ చేపట్టింది. పడకల నిర్మాణం మొత్తం పూర్తకాగా.. బయట ప్లాస్టింగ్‌ పనులు సాగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన గదుల్లోని కొన్ని వార్డుల్లో ఇప్పటికే రోగులను కూడా ఉంచారు. అయితే మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో గదుల పైన రేకుల కింద ఉన్న గోడలు మూడు చోట్ల విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. రేకుల కింద ఏర్పాటు చేసిన పీవోపీ నిర్మాణం సైతం పూర్తిగా కూలిపోయింది. దాంతో వర్షం నీరు కిందకి కారుతోంది. ఒకవేళ తాము ఉన్న చోట గోడలు, పీవోపీ కూలి ఉంటే ప్రమాదం చోటుచేసుకునేదని అక్కడి రోగులు వాపోయారు. గదుల్లో కొని చోట్ల నీరు చేరడంతో వార్డుల్లోని రోగులను కింద వార్డుల్లోకి ఆసుపత్రి అధికారులు తరలించారు. నాసిరకం పనుల వల్లనే గదుల నిర్మాణం దెబ్బతిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని