జగన్‌ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు

జగన్‌ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్‌ అండ్‌ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది.

Updated : 09 May 2024 07:07 IST

ఏబీవీ సస్పెన్షన్‌ చెల్లదంటూ క్యాట్‌ తీర్పు
కక్ష సాధింపుతో అయిదేళ్లుగా పోస్టింగ్‌ ఇవ్వని వైనం
అప్పటినుంచి ఒంటరిగానే ఏబీ వెంకటేశ్వరరావు పోరు
హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా మళ్లీ సస్పెన్షన్‌
పదవీవిరమణ సమయంలోనూ ప్రభుత్వ వేధింపులు
సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి ఎట్టకేలకు ఊరట

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్‌ అండ్‌ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. ఆయనపై వైకాపా ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ చెల్లదంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తీర్పు వెలువరించి... కర్రుకాల్చి వాత పెట్టింది. తనపై కక్ష సాధింపే లక్ష్యంగా ఏళ్ల తరబడి పోస్టింగ్‌, వేతనాలు ఇవ్వకుండా, అక్రమ కేసులు, తప్పుడు అభియోగాలు పెట్టి వేధించినా.. ఎక్కడా తగ్గకుండా ఒంటరిగానే తొలి నుంచి తుది వరకూ ధైర్యంగా పోరాడినందుకు ఆయనకు చాలా ఆలస్యంగానైనా సరే న్యాయం చేకూరింది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మొదటి నుంచి వాదన వినిపిస్తున్న ఆయన చివరికి నైతికంగా గొప్ప విజయం దక్కించుకున్నారు. దురుద్దేశపూరితంగా తనకు ఆపాదించిన అభియోగాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ చెల్లదంటూ హైదరాబాద్‌లోని క్యాట్‌ బుధవారం తీర్పు ఇచ్చింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ గతేడాది ఏప్రిల్‌లో ఆయన హైదరాబాద్‌లోని క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌ ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. ఏబీవీ సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని ఒక సారి హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాక కూడా.. రెండోసారి సస్పెండ్‌ చేయడమంటే అది వేధించడమేనని వ్యాఖ్యానించింది. ఆయనకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జగన్‌ గద్దెనెక్కిన తొలి రోజు నుంచే కక్షసాధింపు, వేధింపులు

2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి... ఆ వెంటనే ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును అక్కడి నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. అది మొదలు ఎనిమిది నెలల పాటు ఆయనకు ఏ పోస్టింగూ ఇవ్వలేదు. జీతభత్యాలు చెల్లించలేదు. సుదీర్ఘకాలం పాటు వేచి చూసిన ఆయన పోస్టింగ్‌, జీతభత్యాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా... నిఘా, భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు మోపుతూ 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్‌ చేశారు.

అసలు ఆ నిఘా పరికరాలు కొనలేదు, వాటికోసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వ ఖజానాకూ నష్టం వాటిల్లలేదు. ఈ వ్యవహారంలో ఎవరికీ అనుచిత ప్రయోజనమూ కలగలేదు. అయినా సరే... తాము ముందుగా రూపొందించుకున్న అభియోగాలతో ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారించిన హైకోర్టు.. ‘‘ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ అక్రమం. చట్టవిరుద్ధం. ఏకపక్షం. అది చెల్లదు’’ అని తీర్పు ఇచ్చింది. దీన్ని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సస్పెన్షన్‌ రద్దుచేయాలని 2022 ఏప్రిల్‌ 22న ఆదేశాలిచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా జగన్‌ ప్రభుత్వం ఆయనకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆయన పదే పదే ఆ తీర్పు ప్రతులను, వినతిపత్రాలను సీఎస్‌కు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2022 జూన్‌ 14న ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. అత్యంత అప్రాధాన్యమైన పోస్టింగ్‌గా భావించే ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా ఆయన్ను నియమించారు.

విధుల్లోకి తీసుకున్న 14 రోజులకే మళ్లీ సస్పెన్షన్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీవీని విధుల్లోకి తీసుకున్నట్టే తీసుకున్న జగన్‌ ప్రభుత్వం... తర్వాత 14 రోజుల్లోనే, అంటే 2022 జూన్‌ 28న మళ్లీ సస్పెండ్‌ చేసింది. నిఘా, భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో నమోదైన కేసులో ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ సస్పెండ్‌ చేసింది. ఆయన్ను డిస్మిస్‌ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు. ఒకే ఆరోపణ, అభియోగంపై రెండుసార్లు సస్పెండ్‌ చేయటం జగన్‌ ప్రభుత్వానికే చెల్లింది. అఖిలభారత సర్వీసు అధికారుల నియమావళి ప్రకారం.. సస్పెన్షన్‌ను అధికారుల కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కానీ ఏబీవీపై విధించిన సస్పెన్షన్‌ను గత 21 నెలలుగా ఒక్కసారీ సమీక్షించలేదు. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసు తేల్చనేలేదు. క్రిమినల్‌ కేసులోనూ అభియోగపత్రం దాఖలు చేయలేదు. దురుద్దేశపూరితంగా అవేవీ తేల్చకుండా జాప్యం చేశారు. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్‌ను కొట్టేయాలంటూ ఆయన గతేడాది ఏప్రిల్‌లో క్యాట్‌ను ఆశ్రయించారు. అక్కడ కూడా సకాలంలో తేలకుండా ఉండేలా జగన్‌ ప్రభుత్వం ఎన్నెన్నో కొర్రీలు వేసింది. ఆయన పదవీవిరమణ తేదీ వచ్చేవరకూ సస్పెన్షన్‌పై ఏ నిర్ణయం రాకుండా చూసేందుకు ఎన్నెన్నో కుటిల వ్యూహాల్ని అమలుచేసింది. వాటన్నింటినీ దాటుకుని ఎట్టకేలకు ఆయన విజయం దక్కించుకున్నారు.

ఒంటరిగానే పోరాటం

ఒక పక్షికి ఆపదొస్తే... ఆదుకోవడానికి చుట్టూ పది పక్షులు వాలుతాయంటారు. అలాంటిది రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం కుట్రపూరితంగా వేధిస్తూ, కక్షసాధిస్తూ ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కరంటే ఒక్క ఐపీఎస్‌ అధికారి కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించలేదు. తమ మనోస్థైర్యం దెబ్బతీసేలా పత్రికల్లో కథనాలు వస్తున్నాయంటూ ఎన్నికల సంఘానికే ఫిర్యాదులు చేసిన ఐపీఎస్‌ అధికారుల సంఘం.. ఏబీవీ సస్పెన్షన్‌పై నోరే ఎత్తలేదు. వైకాపాకు కొమ్ముకాస్తూ, ఆ పార్టీ భజనలో మునిగి తేలుతూ కీలక పోస్టింగుల దక్కించుకున్న కొందరు అధికారులైతే ప్రభుత్వ దుశ్చర్యలకు అన్నివిధాలుగా తోడ్పాటు అందించారు. అయినా ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాను ఏ తప్పూ చేయలేదని, అలాంటప్పుడు ఎవరికైనా తలొగ్గాల్సిన, భయపడాల్సిన అవసరం ఏముందంటూ ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లి న్యాయపోరాటం చేశారు. చివరికి ఫలితం సాధించారు.

ఆయనకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?

అత్యంత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని ఒక ప్రభుత్వమే ఇంతలా వెంటాడి, వేటాడి వేధించిన ఘటనలు దేశచరిత్రలోనే అరుదు. కానీ 34 ఏళ్ల పాటు పోలీసుశాఖకు అత్యున్నత సేవలు అందించిన ఏబీ వెంకటేశ్వరరావుకు కేవలం కక్షసాధింపు కోసం జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పోస్టింగు ఇవ్వలేదు. దాదాపు నాలుగున్నరేళ్లు సస్పెన్షన్‌లో ఉంచింది. డీజీ క్యాడర్‌లో ఉన్న ఆయనకు జగన్‌ ప్రభుత్వం వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. రాష్ట్ర పోలీసు దళాల అధిపతిగా సేవలందించగలిగే సామర్థ్యం ఉన్న ఆయన్ను దురుద్దేశపూరితంగా వేధించింది. ఎవరైనా తమ కెరీర్‌ చివరిదశలో అత్యున్నతమైన పోస్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ఆయన పదవీవిరమణ వరకూ సస్పెన్షన్‌లో ఉంచేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆయన చివరి క్షణంలోనైనా నైతికంగా విజయం పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని