వారికి లేని బాధ మీకెందుకు?

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది.

Published : 09 May 2024 03:33 IST

పిటిషనర్‌కు హైకోర్టు సూటి ప్రశ్న
వివేకా హత్యపై మాట్లాడకుండా సునీత, షర్మిలను నిలువరించాలని పిల్‌
విచారణ అర్హత లేదంటూ కొట్టివేత

ఈనాడు, అమరావతి: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడకుండా సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను నిలువరించాలని, వారి ప్రసంగాలను ప్రచురితం, ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులే కోర్టును ఆశ్రయిస్తారని, ఎన్నికల్లో పోటీ చేసేవారికి లేని బాధ మీకెందుకని పిటిషనర్‌ను ప్రశ్నించింది. వ్యాఖ్యల వ్యవహారంపై కడప కోర్టు ఉత్తర్వులిచ్చిందని గుర్తుచేసింది. పిల్‌ను దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు లేదని తేల్చిచెప్పింది. వ్యాజ్యానికి విచారణార్హత లేదంటూ కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

వివేకా హత్యపై మాట్లాడకుండా సునీత, షర్మిలను నిలువరించాలని కోరుతూ విశ్రాంత ఎయిర్‌ఫోర్స్‌ అధికారి, గుంటూరు జిల్లా తొట్టెంపూడికి చెందిన చిర్రా శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. వివేకా హత్యపై సునీత, షర్మిల హత్య గురించి చెబుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు. ధర్మాసనం స్పందిస్తూ పిటిషనర్‌ ఎవరని, చరిత్ర ఏమిటని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ.. ఎయిర్‌ఫోర్స్‌లో సేవలు అందించారని, ఏడు పతకాలు పొందారని, రాజకీయ కారణంతో పిటిషన్‌ వేయలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేసేవారికి లేని బాధ మీకెందుకని ప్రశ్నించి, వ్యాజ్యాన్ని కొట్టేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని