దుల్హన్‌ బంద్‌ కియా ... ‘తోఫా’కో ధోకా దియా!

ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్‌ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్‌’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్‌ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్‌ తోఫాను రద్దు చేశారు.

Updated : 09 May 2024 08:28 IST

ముస్లింలకు జగన్‌ నయవంచన
రూ.కోట్ల విలువైన వక్ఫ్‌ ఆస్తుల రక్షణపై నిర్లక్ష్యం
మైనారిటీలకు రూ.40 వేల కోట్లు దక్కకుండా పన్నాగం
ఎన్నికల రాకతో ఇప్పుడు మళ్లీ జిత్తులమారి వ్యవహారం

ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్‌ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్‌’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్‌ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్‌ తోఫాను రద్దు చేశారు. ముస్లిం యువత ఎదిగేందుకు దోహదం చేసే నైపుణ్య శిక్షణకు పాతరేశారు. వెరసి.. చరిత్రలో ముస్లింలకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం చేశారు

మైనారిటీలకు ఉపప్రణాళికను పారదర్శకంగా అమలు చేస్తాం.

2019  మ్యానిఫెస్టోలో జగన్‌ ప్రకటన

ముస్లింలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఇస్లాం బ్యాంకు నెలకొల్పుతాం. దాని ద్వారా వడ్డీలేని రుణాలిస్తాం.

పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ

ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి టక్కుటమారా విద్యలను ప్రదర్శించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసగించని వర్గం అంటూ లేదు. ముస్లింలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చిన జగన్‌.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ధోకా(ద్రోహం) చేశారు. వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుచేయకుండా ఏరుదాటాక తెప్పతగిలేసిన చందంలా వ్యవహరించారు. ఉపప్రణాళికను కూడా తీసుకురాలేకపోయారు. గడిచిన ఐదేళ్లలో వారికి రూ.40 వేల కోట్లు దక్కకుండా కుట్ర పన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పేరు వస్తుందన్న అక్కసుతో ఆయన హయాంలో అమలుచేసిన పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి ఓట్లకు గాలం వేసేందుకు మళ్లీ జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు జగన్‌.ఆ భాగ్యమూ కలగలేదు..

ముస్లింలకు రంజాన్‌ పెద్దపండుగ. ఈ పండుగ పూట పేదలు మంచి భోజనం కూడా తినే భాగ్యం లేకుండా చేశారు జగన్‌. గత తెదేపా ప్రభుత్వం ముస్లింల కోసం అమలుచేసిన రంజాన్‌ తోఫానూ అధికారంలోకి రాగానే నిలిపేశారు. రేషన్‌కార్డు ఉన్న 11.25 లక్షల మంది పేద ముస్లింలకు ఈ పథకం కింద ఏటా పండుగ కానుకలను ఉచితంగా ఇచ్చేవారు. రంజాన్‌ రోజే కాకుండా సంక్రాంతి పండుగకు కూడా హిందువులతోపాటు ముస్లిం సోదరులకు కానుక అందించేవారు. జగన్‌ ఈ కానుకను రద్దుచేసి పేద ముస్లింలకు రంజాన్‌ సంతోషాన్ని దూరం చేశారు.

వక్ఫ్‌ ఆస్తుల రక్షణ గాలికి..

ముస్లింలకు చెందిన వక్ఫ్‌ ఆస్తుల రక్షణను గాలికి వదిలేశారు. వక్ఫ్‌ స్థలాల రక్షణకు గోడలు నిర్మిస్తానని, హోంగార్డులను కూడా వాటికి కాపలాగా ఉంచుతామని చెప్పి మాట తప్పారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు 2019 బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించినట్లు పైకి చూపించిన వైకాపా సర్కారు.. వాటి పరిరక్షణకు చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఈ నిధులను ఇతర పనులకు మళ్లించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 ఆస్తులు, నెల్లూరులో 6, తూర్పు గోదావరిలో 10, చిత్తూరులో 2, పశ్చిమ గోదావరిలో 6, అనంతపురంలో 9, కృష్ణాలో 9, ప్రకాశంలో 4, కడపలో 4, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 6 వక్ఫ్‌ ఆస్తులు కీలకమైన ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి రక్షణకు రూ.27 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. వైకాపా నేతలే వాటిని ఆక్రమించుకున్నా ఏమీ చేయలేకపోయింది. నెల్లూరు గుంటూరు, కడప నగరాలు, వినుకొండ, నరసరావుపేట, మదనపల్లె పట్టణాల్లో వక్ఫ్‌ భూములు కబ్జాకు గురైనా అధికారులు చర్యలు తీసుకోలేదు.

కాగితాలపైనే ఉపప్రణాళిక..

గత తెదేపా ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం ఉపప్రణాళికను ప్రవేశపెట్టింది. అప్పటికే ఉన్న  దాన్ని జగన్‌ తాను కొత్తగా తెస్తున్నట్టు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అయినా దాన్ని పట్టాలెక్కించిన పాపాన పోలేదు. మైనారిటీలకు ఉపప్రణాళికను అమలుచేస్తే 8.8 శాతం జనాభాకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. అంటే ఏటా దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టాలి. 2019 నుంచి 2022 వరకు బడ్జెట్లలో దాని ఊసే ఎత్తలేదు. 2022-23 ఏడాదిలో అమలుచేసినట్లు బడ్జెట్‌లో ప్రకటించినా ఆ మేరకు నిధులు కేటాయించలేదు. ఎన్నికల ఏడాది అయినా 2023-24లోనూ అదే వరుస. బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లను ప్రకటించారేగానీ.. ఆ నిధుల్ని మైనారిటీ సంక్షేమశాఖకు ఇవ్వలేదు. చివరికి.. అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల్లోని ముస్లిం లబ్ధిదారుల జాబితాను బయటకు తీశారు. వారికి అందిన ఆర్థికసాయం మొత్తాన్ని కలిపి అవే ఉపప్రణాళిక కింద వెచ్చించిన నిధులంటూ మైనారిటీలను మభ్యపెట్టారు. 2023-24 బడ్జెట్‌ను పక్కనపెట్టినా.. మైనారిటీలకు నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లను దక్కకుండా చేశారు జగన్‌.

షాదీఖానాలపై ఉదాసీనం

ఉర్దూ ఘర్‌ కమ్‌ షాదీఖానాల ఏర్పాటు విషయంలోనూ వైకాపా సర్కారు ఉదాసీనంగా వ్యవహరించింది. ముస్లిం వివాహాల కోసం తక్కువ అద్దెకు   కేటాయించడంతోపాటు యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకే గత తెదేపా ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2015-16 నుంచి 2018-19 మధ్య 344 షాదీఖానాల నిర్మాణాలు, మరమ్మతులకు గత తెదేపా ప్రభుత్వం రూ.83 కోట్ల మేరకు ఖర్చు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ వీటి నిర్మాణాలు, నిర్వహణను గాలికి వదిలేసి రూ.కోట్ల ప్రజాధనం వృథాగా మార్చారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపించడంతో ముస్లింలను మభ్యపెట్టేందుకు ఇటీవల కొన్ని పనులను పట్టాలెక్కించారు. ముస్లిం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమం కింద మంజూరుచేసిన వసతి గృహాలు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, జూనియర్‌ కళాశాలల నిర్మాణాల విషయంలోనూ వైకాపా సర్కారు అలాగే వ్యవహరించింది. పూర్తయిన భవనాలను అందుబాటులోకి తీసుకురాకుండా విద్యార్థులను అష్టకష్టాల పాలుచేసింది.

ఇస్లాం బ్యాంకు రాలేదు.. రాయితీ రుణం ఇవ్వలేదు

ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని జగన్‌ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారికి రూ.5 లక్షల వరకు రాయితీ రుణాలు ఇస్తామని నమ్మబలికారు. వారి ఓట్లు గంపగుత్తగా వేయించుకున్నాక.. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇస్లాం బ్యాంకు అనే పదం ఉచ్ఛరించలేదు. పైగా గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రాయితీ రుణ పథకాన్ని కూడా ఎత్తేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముస్లింల జనాభా 36.18 లక్షలు. మెజారిటీ ముస్లింలకు చిరు వ్యాపారాలు, చిన్న చిన్న పనులే జీవనాధారం. ఇలాంటివారికి వడ్డీ లేని రుణాలే వెన్నుదన్నుగా నిలుస్తాయి. అయితే, వారు అభివృద్ధి చెందుతుంటే ఇష్టపడని జగన్‌ రాయితీ రుణ పథకాన్ని ఎత్తేసి తన రాక్షసత్వాన్ని చాటుకున్నారు.

మరమ్మతులకు డబ్బు ఇవ్వలే..

ముస్లింల పక్షపాతినని చెప్పుకొనే జగన్‌.. మసీదులు, ఈద్గాలు, దర్గాల మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేదు. వీటి మరమ్మతులు, శ్మశానవాటికలకు ప్రహరీలను నిర్మించడానికి గత తెదేపా ప్రభుత్వం 648 వక్ఫ్‌ సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.50 కోట్లు ఖర్చు చేసింది. వైకాపా సర్కారు మాత్రం ఐదేళ్లలో 17 సంస్థలకు రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రాజకీయ సిఫార్సు ఉన్న సంస్థలకే ఈ నిధులు కేటాయించింది. ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ వందకుపైగా దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి.

ఇమామ్‌లు, మౌజమ్‌లకు వెన్నుపోటే...

గత తెదేపా ప్రభుత్వం ప్రతి నెలా ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజమ్‌లకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం అందించింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేల చొప్పున పెంచి ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఇమామ్‌లు, మౌజమ్‌లు ఉన్న మసీదులు రాష్ట్రంలో దాదాపు 15 వేల వరకు ఉంటే.. 5 వేల మసీదులకే గౌరవవేతనాన్ని పరిమితం చేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టారు.

5 శాతం పనుల పూర్తికీ నిధులు ఇవ్వలే..

2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ జిల్లా ముస్లింలకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రంలో రూ.25 కోట్లతో హజ్‌భవనాన్ని నిర్మించారు. 2019 ఎన్నికల నాటికే దాదాపు 95 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తిచేసి ఆ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకూ జగన్‌కు మనసొప్పలేదు. మిగిలిన 5 శాతం పనుల పూర్తికి నిధులివ్వాలని అక్కడి కలెక్టరు పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోలేదు. ఎన్నికలకు ఇక ఆరు నెలలు ఉండగా.. పూర్తి చేస్తున్నామంటూ హడావుడి చేశారు. రూ.10 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. కానీ ఆ పనులు చేపట్టేందుకు ఒక్క గుత్తేదారు కూడా ముందుకు రాలేదు.

షాదీ తోఫాలోనూ వంచనే...

అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచే షాదీ తోఫా అమలుచేస్తానన్న జగన్‌.. తర్వాత విస్మరించారు. ముస్లిం సంఘాలు కోర్టుకు వెళ్లి పోరాడితేగానీ ఈ పథకాన్ని అమలులోకి తీసుకురాలేదు. షాదీ తోఫా ఆర్థికసాయాన్ని పెంచినట్టు చూపించిన జగన్‌ తర్వాత నిబంధనల కత్తెర వేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికే షాదీ తోఫా ఇస్తామని మెలికపెట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 40 వేల మందికి పెళ్లికానుక సాయం అందితే.. జగన్‌ ఇప్పటివరకు 6,346 మందికే పంపిణీ చేశారు.

విదేశీ విద్య దూరం

గత ప్రభుత్వ హయాంలో అమలైన విదేశీ విద్యా పథకాన్ని జగన్‌ అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు పక్కన పెట్టారు. తర్వాత కోర్టు ఆదేశాలతో ఏడాదిన్నర క్రితం అమలులోకి తెచ్చినా.. నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను తెగ్గోశారు. వివిధ దేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి తెదేపా ప్రభుత్వం 527 మంది ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తే.. జగన్‌ సర్కారు నుంచి ఐదేళ్లలో ఆర్థికసాయం అందిన విద్యార్థుల సంఖ్య 70 దాటలేదు.

ఈనాడు, అమరావతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని