భూసేకరణ ప్రకటన ఉపసంహరణపై దాఖలైన పిల్‌ విచారణ వాయిదా

రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది.

Updated : 09 May 2024 08:05 IST

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతుసమాఖ్య’ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి సాంబశివరావు, రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. ఈ వ్యాజ్యం హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బుధవారం విచారణకు రాగా.. కొంతమంది రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి స్పందిస్తూ తమ భూములు తీసుకున్నందుకు సొమ్ము చెల్లించాలని ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను కోరామన్నారు. సొమ్ము చెల్లించడంలో విఫలమైనందున భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరామని, ఈ రైతుల తరఫున ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశామని చెప్పారు. దానిని అనుమతించాలని కోరారు. పిటిషనర్లు/ రాజధాని రైతు సంఘాల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఏదో చెప్పబోతుండగా.. తాము ఈ వ్యాజ్యాన్ని వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇంప్లీడ్‌ పిటిషన్‌ను అనుమతించింది.


ప్రభుత్వ వినతిపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పండి

ఈసీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: వైఎస్సార్‌ ఆసరా, ఈబీసీ నేస్తం నిధుల పంపిణీ విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది. నిధుల పంపిణీ ఆవశ్యకతపై కారణాలను పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం ఈసీకి ఇప్పటికే వినతి ఇచ్చిందని ప్రత్యేక జీపీ సుమన్‌ నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఆ వినతిపై నిర్ణయం తీసుకొని వివరాలను కోర్టుకు తెలపాలని ఈసీని ఆదేశించారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యాదీవెన, చేయూత వ్యవహారంపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలు గురువారానికి వాయిదా పడ్డాయని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఆ వ్యాజ్యాలతో ప్రస్తుత వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.


అనంతపురం రేంజ్‌ డీఐజీగా షేముషి

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం రేంజ్‌ డీఐజీగా షేముషి బాజ్‌పేయీను ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన షేముషి 2008లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.శిక్షణానంతరం అసిస్టెంట్‌ ఎస్పీగా కర్నూలు జిల్లా ఆదోనిలో పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలో విజిలెన్స్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు డీఐజీగా ఉన్న ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డిపై ఎన్నికల కమిషన్‌ వేటు వేయడంతో ఈ నియామకం జరిగింది.


పోలింగ్‌ ముగిసిన వెంటనే ‘ఫాం 17సీ పార్ట్‌-1’ను ఏజెంట్లకు ఇవ్వాలి

సీఈవోను కోరిన న్యాయవాది పారా కిషోర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పోలింగ్‌ ముగిసిన వెంటనే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఫాం 17సీ పార్ట్‌-1 (పోలింగ్‌ స్టేషన్‌, ఓటింగ్‌ మెషీన్‌, బ్యాలట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌, సంబంధిత పోలింగ్‌స్టేషన్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, టెస్ట్‌ ఓట్లు, నమోదైన ఓట్లు తదితర వివరాలు) ఇవ్వాలని సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాను న్యాయవాది పారా కిషోర్‌ కోరారు. సచివాలయంలో సీఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని బుధవారం అందజేశారు. ఫాం17సీ పార్ట్‌-1ని నింపాక పోలింగ్‌ ఏజెంట్‌తో సంతకం చేయించి ప్రిసైడింగ్‌ అధికారి సంతకంతో అటెస్ట్‌ చేసిన ట్రూకాపీని లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులకు విడివిడిగా వారి తరఫు పోలింగ్‌ ఏజెంట్లకు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తగు చర్యలు తీసుకుంటామని ముకేశ్‌కుమార్‌మీనా హామీనిచ్చినట్టు కిషోర్‌ వెల్లడించారు.


పదో తరగతి ఆంగ్ల పరీక్షలో ఐదో తరగతి స్థాయి ప్రశ్నలు

విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాశాఖ
సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్‌ మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇటీవల నిర్వహించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఆంగ్లం పేపర్‌లోని ప్రశ్నలు అయిదో తరగతి స్థాయి కూడా లేవని సామాజికవేత్త డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. ఇలా సులభమైన ప్రశ్నలు ఇస్తూ ఆంగ్లంలో విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని వారి తల్లిదండ్రులను రాష్ట్ర విద్యాశాఖ మోసం చేస్తోందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌లు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అయితే ఈ ఏడాది పబ్లిక్‌ పరీక్షల్లో సీబీఎస్‌ఈ, రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ప్రశ్నాపత్రాలను చూస్తే అసలు విషయం బట్టబయలవుతుంది. ఆంగ్ల పదాలు తప్పు రాసినా కూడా మూల్యాంకనంలో నూటికి నూరు మార్కులు ఎలా వేశారు. దీన్ని విద్యాశాఖ ఎలా సమర్థించుకుంటుంది? ఇది తల్లిదండ్రులను మోసం చేయడం కాదా? 2022 జులైలో బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. ఆ ఫలితాలను తల్లిదండ్రులకు ఇంతవరకు ఇవ్వలేదు. అందులో సుమారు పది లక్షల మంది తెలుగు వాక్యాలు, దాదాపు 17లక్షల మంది విద్యార్థులు సులభమైన ఆంగ్ల వాక్యాలనూ చదవలేరని తేటతెల్లమైంది. ‘గడప గడపకు’ కార్యక్రమం కింద ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి జరిగిందో కరపత్రాలు ఇచ్చి ప్రచారం చేసిన వైకాపా ప్రభుత్వం.. అదే మాదిరిగా బేస్‌లైన్‌ పరీక్ష ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదు’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని