అడ్డొస్తే అంతమే

‘మేం చెప్పిందే జరగాలి.... అడ్డొస్తే అంతమొందిస్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి... మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’

Updated : 03 Feb 2023 05:52 IST

అధికార పార్టీలోకి వస్తే సరే.. లేదంటే అంతే..
ఆధిపత్యం కోసం ప్రత్యర్థులపై దాడులు..హత్యలు
గ్రామాలు వీడుతున్న ప్రతిపక్ష నాయకులు
వ్యక్తిగత, పాతకక్షలేనని తేల్చేస్తున్న పోలీసులు


‘మేం చెప్పిందే జరగాలి.... అడ్డొస్తే అంతమొందిస్తాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి... మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’

 పల్నాడులో వైకాపా నేతల నుంచి పలువురికి నిత్యం ఎదురవుతున్న బెదిరింపులివి.


ఈనాడు-అమరావతి: గ్రామాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను తమవైపు రావాలని బెదిరించటం.. వినకపోతే వారిపై అక్రమ కేసులు బనాయించడం.. అప్పటికీ లొంగకపోతే దాడులు, హత్యలు చేసే విష సంస్కృతి పల్నాడు జిల్లాలో గత మూడున్నరేళ్లుగా అమలవుతోంది. తమ ఆధిపత్యానికి అడ్డుగా ఉంటున్నారనుకున్న వారిని వైకాపా కార్యకర్తలు అంతమొందిస్తున్నారు. వీరికి ఆ పార్టీ మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల అండదండలు ఉంటున్నాయి. దీంతో  ఇక్కడ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఈ అరాచక ధోరణి పెరుగుతోంది.

వైకాపా ప్రమేయం లేదని చెప్పడానికే పోలీసులు పరిమితం

గ్రామాల్లో బలంగా ఉండే ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా ఈ హత్యలన్నీ ఒక దాని తర్వాత మరొకటి ప్రణాళిక ప్రకారం సాగుతున్నా.. పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడులు, హత్యలు జరిగితే.. అవి వ్యక్తిగత, పాత కక్షలతోనే జరిగాయని... రాజకీయాలతో సంబంధం లేదని వెనువెంటనే ప్రకటించేస్తున్నారు. కనీస దర్యాప్తు కూడా లేకుండానే ఆ హత్యలు, దాడులతో అధికార పార్టీకి సంబంధం లేదంటూ తేల్చేస్తున్నారు. ఒకటి, రెండు రోజులు నిందితులను పట్టుకుంటున్నామంటూ హడావుడి చేసి ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తు పక్కనపెట్టేస్తున్నారు. దాడులు, హత్యలకు పాల్పడుతున్నవారికి వైకాపా నాయకుల అండదండలుంటున్నా వారి ప్రమేయంపై విచారణలు ఉండట్లేదు. దీంతో క్షేత్ర స్థాయిలో రెచ్చిపోతున్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు చెబుతున్నా..వారి రక్షణకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. దీంతో గ్రామాల్లో అధికారపార్టీని ఎదిరిస్తే ప్రాణాలకే ముప్పు వస్తుందన్న ఆందోళన ప్రతిపక్షాల కార్యకర్తల్లో నెలకొంది. కొందరైతే గ్రామాలు వదలివెళ్లి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి కొనసాగుతున్నా దాన్ని పోలీసులు నియంత్రించలేక పోతున్నారు. తాజాగా రొంపిచర్ల మండల తెదేపా నాయకుడు వెన్నా బాలకోటిరెడ్డిపై తుపాకీతో దాడి జరిగింది. గతంలోనూ ఆయనపై హత్యాయత్నం జరిగినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఇవన్నీ పోలీసుల వైఫల్యానికి నిదర్శనాలన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పల్నాడులో పట్టపగలే హత్యలు

దశాబ్ద కాలంపాటు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఇటీవల కాలంలో మళ్లీ ఫ్యాక్షన్‌ పడగ విప్పుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక, రాజకీయపరమైన కారణాలతోపాటు ఆధిపత్యం కోసం హత్యలు, దాడులు జరుగుతున్నాయి. తుపాకులు సైతం కొని ప్రత్యర్థులపై దాడిచేసే స్థితికి ఎదిగారు. ఇది పల్నాడు ప్రగతికి అడ్డంకిగా మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


కొన్ని ఘటనలు ఇలా..

* వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో తెదేపా నాయకుడు చంద్రయ్యను అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ ఎంపీపీ శివరామయ్య, తనయుడు ఆదినారాయణతోపాటు మరికొందరు పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్రామ నడిబొడ్డున గొంతుకోసి హత్యచేశారు. ఈ కేసులో అరెస్టు అయిన వారు బెయిల్‌పై బయటకు వచ్చారు.

* దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను వైకాపాకు చెందిన నాయకులు పట్టపగలు గ్రామం ప్రధాన రహదారిపై దాడిచేసి హత్యచేశారు. ఈ గ్రామంలో తెదేపా సానుభూతిపరులైన 50 కుటుంబాలు ఇప్పటికీ గ్రామం విడిచిపెట్టి బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నాయి. వీరి పొలాలు బీడుగా మారాయి.

* గురజాల మండలం అంబాపురంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తెదేపా కార్యకర్త విక్రమ్‌ను అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు హత్యచేశారు. గురజాల పోలీసుస్టేషన్‌ నుంచి ఇంటికి వెళుతుండగా రాత్రి 8.30గంటల సమయంలో గ్రామంలోనే దాడిచేసి మట్టుబెట్టారు.

* దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన మాజీ సర్పంచి, తెదేపా నేత పురంశెట్టి అంకుల్‌ దాచేపల్లిలో హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నేత ఒకరు హత్యలో కీలకపాత్ర పోషించారు. దాచేపల్లిలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం వద్దకు రావాలని పిలిచి గొంతుకోసి హత్యచేశారు.

* నరసరావుపేటలో ఇటీవల మసీదు స్థలం వివాదంలో తెదేపాకు చెందిన ఇబ్రహీంను జనసంచారంలోనే వైకాపా వాళ్లు కత్తులతో దాడి చేసి హతమార్చారు.

* పిడుగురాళ్ల పట్టణ శివారులో తుమ్మలచెరువుకు చెందిన తెదేపా కార్యకర్త షేక్‌ సైదాను వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడిచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఇక్కడి పరిస్థితిని అద్దంపట్టింది.

* మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా వారిపై వైకాపా వారు దాడులకు తెగబడ్డారు. అప్పట్లో గ్రామాలు వదిలివెళ్లిన 50 కుటుంబాలవారు ఇప్పటికీ బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. తురకపాలెంలో తెదేపా కార్యకర్త ఇంటికి నిప్పుపెట్టి తగలబెట్టారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే గ్రామంలో తెదేపా సానుభూతిపరులకు చెందిన నలుగురి గడ్డివాములు తగలబెట్టారు. కొత్తగణేశునిపాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా వారు దాడి చేసి కొట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు