మూడు వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపాం

కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్‌ఎస్‌) కింద 2020లోనే ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ తెలిపారు.

Updated : 04 Feb 2023 05:28 IST

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్‌ఎస్‌) కింద 2020లోనే ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ తెలిపారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, ఎన్‌.రెడ్డప్ప, గోరంట్ల మాధవ్‌, వంగా గీత, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఈ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్‌ సీట్లు, 11 కళాశాలల్లో 1,040 పీజీ సీట్ల పెంపునకు ఆర్థిక సహాయం చేశామన్నారు. పీఎం స్వాస్థ్య సురక్షా యోజన కింద మూడు వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ల ఏర్పాటుకు చేయూతను ఇచ్చామన్నారు. జననీ సురక్ష యోజన కింద ఆంధ్రప్రదేశ్‌ 2019-22 మధ్య రూ.61.99 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. ఈమేరకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* విశాఖపట్నం-కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేయదల్చిన పెట్రో కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌కు (పీసీపీఐఆర్‌) సంబంధించి హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ చేసిన ముందస్తు సాధ్యత అధ్యయనం పూర్తి కాలేదని కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ తెలిపారు. రాజమహేంద్రవరం, అనకాపల్లి ఎంపీలు మార్గాని భరత్‌, బీశెట్టి సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రధాన యూనిట్‌ ఎక్కడ పెట్టాలి, దాని సామర్థ్యంపై తుది నిర్ణయానికి వస్తే మాస్టర్‌ ప్లాన్‌ ఖరారవుతుందని, తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ఆ ప్రాంతంలో మౌలిక వసతులు, ఇళ్లు, ప్రజల జీవనోపాధిపై పీసీపీఐఆర్‌ ప్రభావం, పర్యావరణ సమస్యలపై అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం 2008లోనే పీసీపీఐఆర్‌-ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.

* నంద్యాల జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద జనఔషధ కేంద్రాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించినట్లు కేంద్ర రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ తెలిపారు. ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని పిల్లల రక్షణ కేంద్రాలకు వాత్సల్య పథకం కింద 2022-23లో రూ.19.76 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలోని పిల్లల సంరక్షణ కేంద్రాల్లో 2021-22 నాటికి 3,069 మంది పిల్లలు ఉన్నారన్నారు.

* సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టులో కనెక్టెవిటీ రోడ్డుకు రూ.23.17 కోట్లు, జువ్వలదిన్నె పోర్టులో ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధికి రూ.72 కోట్లు, కోస్తా జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధికి రూ.5.98 కోట్లు, కాకినాడ పోర్టు యాంకరేజ్‌కు రూ.42.92 కోట్లు, భవానీ ద్వీపంలో పర్యాటక పనులకు రూ.పది కోట్లు, విశాఖపట్నం పోర్టు నుంచి ఎన్‌హెచ్‌-5 అనుసంధాన రోడ్డుకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ వివరించారు. వీటితోపాటు విశాఖపట్నం పోర్టులో కోస్టల్‌ బెర్తుకు రూ.30 కోట్లు, విశాఖపట్నంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ మారిటైమ్‌ షిప్‌బిల్డింగ్‌కు రూ.37.52 కోట్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఫేజ్‌-1కు రూ.28 లక్షలు, విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణకు రూ.50 కోట్లు ఇచ్చామన్నారు. ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


ఏపీలో వరి రైతులకు తగ్గిన చెల్లింపులు

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం సేకరించిన రైతులకు చేస్తున్న చెల్లింపులు రెండేళ్లుగా తగ్గాయి. 2020-21 ఖరీఫ్‌, రబీ రెండింటిలో కలిపి రూ.15,199 కోట్లు చెల్లించగా... 2021-22లో అది రూ.14,819 కోట్లకు తగ్గింది. 2022-23 రబీ, ఖరీఫ్‌ సీజన్‌లలో (జనవరి 23నాటికి) రూ.9,871 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి శుక్రవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆహార రాయితీ కింద ఆంధ్రప్రదేశ్‌కు గత ఆరేళ్లలో రూ.39,842.86 కోట్లు ఇచ్చామని, రాష్ట్రం నుంచి సేకరించిన బియ్యానికి ఎఫ్‌సీఐ 25,855.57 కోట్లు చెల్లించామన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని