కుక్కలున్నాయ్‌.. పిక్కలు జాగ్రత్త!

వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి.

Published : 06 Mar 2023 04:22 IST

పట్టణం నుంచి పల్లెల వరకు వీధిశునకాల బెడద
పలు జిల్లాల్లో కానరాని ‘నియంత్రణ’ చర్యలు
గతేడాది కుక్కకాట్లలో దేశంలో మూడో స్థానంలో ఏపీ
ఈనాడు, అమరావతి

వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వాటి నియంత్రణపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. కుక్కల్లో సంతానోత్పత్తిని నిరోధించే శస్త్ర చికిత్సలు చాలాచోట్ల నిలిచిపోయాయి. సమస్యాత్మకమైన శునకాలను గుర్తించి ప్రత్యేక సంరక్షణ శిబిరాలకు తరలించడం వంటి విషయాలను పుర, నగరపాలక సంస్థలు పక్కన పెట్టేశాయి. కుక్కల దాడిలో పిల్లలు మరణించడం, తీవ్రంగా గాయపడడం వంటి విషాద ఘటనలు జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తుంటారు. హైదరాబాద్‌లోని బాగ్‌ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్‌ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లెలో వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పిల్లలు మృతి చెందాయి.

రాష్ట్రంలో సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు తగ్గించడంతో వీధి శునకాల సంఖ్య పెరుగుతోంది. 2022లో దేశంలో అత్యధికంగా కుక్కకాట్లు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉన్నట్లు గత ఏడాది డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. అత్యధికంగా 3,46,318 కుక్కకాట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో, 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 1,69,378 కుక్కకాటు కేసులతో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో 4.50 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. వీటిలో అత్యధికంగా 3.20 లక్షల కుక్కలు నగరాలు, పట్టణాల్లో ఉంటున్నాయి. ఆర్థిక వనరులు పరిమితంగా ఉండటం, సిబ్బంది కొరతతో పంచాయతీ కారణంగా సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయడం లేదు. 


ఆపరేషన్లు చేస్తున్నా ఎందుకు పెరుగుతున్నాయి? 

రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థలు, 25 పురపాలక, నగర పంచాయతీల్లో శునకాలకు విధిగా శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరపాలక సంస్థల్లో ఏటా ఇందుకోసం రూ. 1-2 కోట్లు వెచ్చిస్తున్నట్లు లెక్క చూపిస్తున్నారు. అయినా కుక్కల సంఖ్య ఎందుకు పెరుగుతుందన్నది ప్రశ్న. ఉదాహరణకు విజయవాడ నగరపాలక సంస్థలో గత ఐదేళ్లలో వీటి సంఖ్య 16 వేల నుంచి 20 వేలకు పెరిగినట్లు అంచనా. విశాఖలో 85,000 నుంచి 1,10,000కి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలులోనూ శునకాలు పెరిగిన విషయాన్ని అధికారులే అంగీకరిస్తున్నారు. పరిసర గ్రామాల్లోని కుక్కలు నగరాలు, పట్టణాల్లోకి రావడం, కొందరు తీసుకొచ్చి విడిచి పెట్టడంతో వాటి సంఖ్య పెరుగుతోందని చెప్పడం విశేషం.


ఫిబ్రవరి-ఆగస్టు మధ్యే ఎక్కువ సమస్య

టా ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమి, ఆహారం కొరత వంటి కారణాల వల్ల వీధి కుక్కలు అసహనానికి గురై ప్రజలపై దాడులు చేస్తుంటాయని పశు వైద్యాధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కాలంలో వీధి కుక్కలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటున్నారు. ప్రత్యేకించి ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు జాగ్రత్త వహించాలని తెలిపారు. వాటిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ కూడదని పశువైద్యాధికారి ఎన్‌.కిశోర్‌ సూచించారు.


* ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోని కడప నగరంలో, పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్‌ జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థలోనూ వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు నిలిపి వేశారు.

* అనంతపురంలో రెండేళ్లుగా ఆపరేషన్లు చేయడం లేదు.

* విజయవాడలో రెండేళ్ల తర్వాత గత ఏడాది మార్చి నుంచి మళ్లీ మొదలు పెట్టారు.

* విశాఖ, నెల్లూరు, తిరుపతి, కాకినాడలో రోజూ 20-30 శునకాలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.

* ద్వితీయ, తృతీయ శ్రేణి పురపాలక సంఘాల్లోనూ విధిగా శస్త్ర చికిత్సలు చేయాలన్న ఆదేశాలున్నా అమలు కావడం లేదు.

* ఒక్కో శునకానికి శస్త్ర చికిత్స కోసం రూ. 700-900 వరకు ఖర్చవుతుందని అధికారులు వెనకడుగు వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు