తెలుగు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది

న్యాయవ్యవస్థలో భారతీయ భాషల అమలును బలోపేతం చేయాల్సిన అంశం ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో చర్చకొచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర గుర్తుచేశారు.

Updated : 29 Mar 2023 05:13 IST

హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

ఈనాడు, అమరావతి: న్యాయవ్యవస్థలో భారతీయ భాషల అమలును బలోపేతం చేయాల్సిన అంశం ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సదస్సులో చర్చకొచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఏపీ న్యాయవ్యవస్థలో తెలుగు వినియోగించేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, జీవోలు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని, అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయాలని కోరుతూ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా సీజే ఈ వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ తెలుగు అమలుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్న ప్రభుత్వం..ఇప్పటికీ జీవోలు, ఉత్తర ప్రత్యుత్తరాలను ఆంగ్లంలోనే జారీచేస్తోందన్నారు. ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చి తెలుగు అమలయ్యేలా చూడాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. తెలుగు అమలు కోసం పలు చర్యలు తీసుకున్నామన్నారు. అమలు తీరుపై క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించి అదనపు అఫిడవిట్‌ వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తెలుగు అమలు కోసం తీసుకుంటున్న చర్యల వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు