Adimulapu Suresh: మంత్రి గుసగుసల మర్మమేంటి?

అప్పటికే  అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నల్ల టీ షర్ట్‌ వేసుకుని మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆయన వెనక ప్లకార్డులు, నల్ల బెలూన్లు, నల్ల జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మోహరించి ఉన్నారు.

Updated : 23 Apr 2023 07:02 IST

అదనపు ఎస్పీ శ్రీధర్‌తో ఆదిమూలపు సురేష్‌ మంతనాలు
ఆ తర్వాత చంద్రబాబుపై రాళ్లదాడి
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, ఒంగోలు-న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం: అప్పటికే  అక్కడ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నల్ల టీ షర్ట్‌ వేసుకుని మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆయన వెనక ప్లకార్డులు, నల్ల బెలూన్లు, నల్ల జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు మోహరించి ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా, పరుషమైన మాటలతో నినాదాలు చేస్తూ... రెచ్చగొడుతున్నారు. ఇంతలో మంత్రి సురేష్‌ దగ్గరకు ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్‌) శ్రీధర్‌రావు వచ్చారు. మంత్రి సురేష్‌ ఆయనతో మాట్లాడుతూ.. ‘కుడివైపునే కదా... రాంగ్‌ సైడు కాదు కదా! ’’ అంటూ ఏదో మాట్లాడారు. ఇంతలో ఎవరో... ‘ఇటే ఎడమ వైపే’ అని సమాధానం ఇచ్చారు. ‘సరే పక్కా’ అంటూ... అదనపు ఎస్పీ చెవిలో మంత్రి సురేష్‌ ఏదో చెప్పారు. ఆ వెంటనే వెనకున్న వైకాపా శ్రేణులు మరోసారి పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సభలకు మహిళలు ఎవరైనా నల్లరంగు చున్నీలు వేసుకుని వచ్చినా అడ్డుకుని, వాటిని తీసేసిన తర్వాతే సభలోకి అనుమతించే పోలీసులు... ఇక్కడ మాత్రం మంత్రి సురేష్‌  ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తలు ఎటు చూసినా నల్లటి బెలూన్లు, నల్ల జెండాలు పట్టుకుని, నల్ల చొక్కాలు వేసుకుని ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చోద్యం చూశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం చంద్రబాబు పర్యటన సందర్భంగా... ఆయన కాన్వాయ్‌పై వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేయడానికి ముందు చోటు చేసుకున్న ఘటన ఇది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... పోలీసుల వ్యవహారశైలిపై వివిధ వర్గాల నుంచీ విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో చూస్తుంటే... ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి మంత్రి సురేష్‌ పోలీసులతో మంతనాలు జరిపారా? ఇలా చేయండంటూ సూచనలిచ్చారా? చంద్రబాబు కాన్వాయ్‌కి సంబంధించి ఏమైనా ఆరా తీశారా? లేదా ఇలా చేద్దామని మంత్రి, అదనపు ఎస్పీ కూడబలుక్కున్నారా? వంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం వచ్చినప్పుడు నిరసన తెలియజేసేందుకు మంత్రి సురేష్‌ ఆధ్వర్యంలో ఉదయం నుంచే సన్నాహాలు జరుగుతున్నాయన్న విషయం పోలీసులకు తెలుసు. తెదేపా నాయకులు స్వయంగా జిల్లా ఎస్పీ దృష్టికి ఆ విషయం తీసుకెళ్లారు. అయినా వారు ఏ చర్యలు తీసుకోలేదు.

నియంత్రించాల్సింది పోయి.. తలాడిస్తూ..

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు కార్యక్రమం అప్పటికప్పుడు నిర్ణయించుకున్నది కాదు. అంతకు ముందు రెండు రోజుల నుంచి జరుగుతోంది. శుక్రవారం మూడో రోజు..! మంత్రి సురేష్‌ ఆధ్వర్యంలో చంద్రబాబుకి నిరసన తెలపాలన్నది ముందుగా ప్రకటించిన కార్యక్రమం కాదు. ఆ రోజుకి ఆరోజే నిర్ణయం తీసుకున్నారు. పైగా చంద్రబాబు జడ్‌ప్లస్‌ సెక్యూరిటీలో ఉన్న నేత, మాజీ ముఖ్యమంత్రి. ఉద్రిక్తతలు తీవ్రమై... వైకాపా, తెదేపా కార్యకర్తలు ఘర్షణలకు దిగితే, పరస్పరం దాడులకు పాల్పడితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉండేవి..! ఆ మాత్రం పోలీసులకు తెలీదా? వారు నియంత్రించాల్సింది ఎవర్ని? అప్పటికప్పుడు నిరసనలకు సిద్ధమై, ఉద్రికత్తలు రెచ్చగొడుతున్న వైకాపా వర్గాల్ని కదా? వారిని భయపెట్టో, బెదిరించో, నచ్చజెప్పో అక్కడి నుంచి పంపించేసి, ఉద్రిక్తతల్ని చల్లబరిచి, చంద్రబాబు పర్యటన సాఫీగా జరిగేలా చూడాలి కదా..! అవేమీ చేయకుండా.. అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు మంత్రి సురేష్‌ దగ్గరికి వెళ్లి మాట్లాడం, ఆయనేదో చెవిలో చెప్పడం... ఆయన చెప్పిన దానికి అదనపు ఎస్పీ తలాడించడం... ఇదంతా చూస్తుంటే జరగబోయే పరిణామాల గురించి పోలీసులతో మంత్రి సురేష్‌ ముందుగానే మంతనాలు జరిపినట్టుగా, అంతా తెలిసే పోలీసులు చేతులు కట్టుకుని కూర్చున్నట్టుగా అనిపిస్తోందని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. పోలీసులు మంత్రితో మాట్లాడి వెళ్లిన తర్వాత... వైకాపా శ్రేణులు మరింత రెచ్చిపోవడం, మంత్రి సురేష్‌ చొక్కా విప్పి మరీ సవాళ్లు చేయడం, చంద్రబాబు కాన్వాయ్‌పైకి వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వడం వంటి ఘటనలన్నీ ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగాయని, అంతా తెలిసీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్‌షోలో పాల్గొనేందుకు వస్తున్న చంద్రబాబుకు కాకుండా.. ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రహదారికి ఇరువైపులా నిలిచిన వైకాపా శ్రేణులకు పోలీసులు రోప్‌ పార్టీని రక్షణగా నిలపడం చర్చనీయాంశమైంది. ఈ సమయంలో రోడ్డుపై చంద్రబాబు వాహనానికి ముందుగా వస్తున్న వారిపై సీఐ స్థాయి అధికారులు పలుమార్లు దురుసుగా వ్యవహరించారు. ఈ రాళ్ల దాడిలో తమ కమాండెంట్‌ గాయపడిన ఉదంతంపై ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారులూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు