ఆ ముగ్గురే... ఇష్టారాజ్యంగా!

రాష్ట్ర జలవనరుల శాఖలో తాజా బదిలీలు ఇష్టారాజ్యంగా మారాయి. నిబంధనలు, నియమాల్ని గాలికి వదిలి కొందరి నిర్ణయాలతోనే పోస్టింగులు దక్కుతున్నాయి.

Published : 01 Jun 2023 05:16 IST

జలవనరుల శాఖ బదిలీల్లో నిబంధనలు గాలికి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖలో తాజా బదిలీలు ఇష్టారాజ్యంగా మారాయి. నిబంధనలు, నియమాల్ని గాలికి వదిలి కొందరి నిర్ణయాలతోనే పోస్టింగులు దక్కుతున్నాయి. కీలకస్థానాల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారిలో ఒకరికి సహాయకారిగా ఉండే మరో కీలక వ్యక్తి ప్రమేయంతోనే బదిలీలు ప్రహసనంగా తయారయ్యాయి. జలవనరుల శాఖలో ఎప్పటి నుంచో అన్ని పోస్టుల్లో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో పాలన సాగిస్తున్నారు. సీనియారిటీలు ఖరారు చేసి పదోన్నతులు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటికీ ఆ అంశాన్ని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పరిష్కరించలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ముందుకు సాగితే ఇప్పుడు కీలకస్థానాల్లో ఉన్న కొందరు ఆ పోస్టులను కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో ఈఈలు, ఎస్‌ఈలు,  చీఫ్‌ ఇంజినీరు పోస్టుల్లో అదనపు పూర్తి బాధ్యతలతో నియమించి వ్యవహారాలు నడిపిస్తున్నారు. కిందటి ఏడాది బదిలీలు చేసిన క్రమంలో ఈ అదనపు బాధ్యతల అంశాన్ని అడ్డుగా పెట్టుకుని కీలక వ్యక్తులు తాము డిమాండ్‌ చేసింది అందించిన వారినే అందలం ఎక్కించారు. ఒక కీలక వ్యక్తికి సహాయకారిగా ఉన్న అధికారే చక్రం తిప్పారు. ప్రస్తుతం అన్ని చోట్ల ముఖ్య పోస్టుల్లో అదనపు బాధ్యతల్లో ఉన్న వారిలో కొందరు ఆ స్థానాన్ని కోల్పోకుండా ఉండేందుకు మళ్లీ తాపత్రయ పడుతున్నారు. మళ్లీ అదే కీలక వ్యక్తిని ఆశ్రయించి కావాల్సింది సమర్పించుకునే పనిలో పడ్డారు.

వారికే అవకాశాలు..

సాధారణంగా ఐదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని బదిలీ చేసేందుకు నిబంధనల్లో వీలు కల్పించారు. జలవనరుల శాఖ నాణ్యత నియంత్రణ విభాగం పోస్టులకు మాత్రం మూడేళ్ల నిబంధన విధించారు. ఈ పోస్టులకు బాగా డిమాండ్‌ ఉంది. నాణ్యత నియంత్రణ విభాగంలో ఏఈ, డీఈ, ఈఈ, ఎస్‌ఈ పోస్టులు దక్కాలంటే ఒక్కో ధర పలుకుతోంది. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక డీఈ పోస్టులో గతంలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరును పూర్తి అదనపు బాధ్యతల్లో నియమించారు. ఒక మంత్రి బంధువైన ఏఈ పైరవీలతో ఆ డీఈ  పోస్టును సాధించారు. నిజానికి తాజా బదిలీల్లో ఆ డీఈ స్థానాన్ని ఖాళీల్లో చూపించాలి. వేరేచోట నుంచి ఎవరైనా డీఈ ఆ స్థానాన్ని కోరుకుంటే సీనియారిటీ పాయింట్ల ఆధారంగా అందులో నియమించాలి. తాజా బదిలీల్లో ఆ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతల్లో ఏఈ ఉన్నా డీఈ పోస్టును ఖాళీగా చూపడం లేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి అనేకం ఉన్నాయి. కృష్ణా డెల్టా వ్యవస్థలో అనేక ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్న వారు ఉన్నారు. కిందటి ఏడాది బదిలీల్లో వారికి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం మళ్లీ అదే మినహాయింపు ఇచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐదేళ్లు ఒకే స్థానంలో ఉంటే బదిలీ చేయాలనే నిబంధనను వీరికి వర్తింపజేయడం లేదు. ఒకేచోట ఏడేళ్లు పని చేసిన వారినీ మళ్లీ అక్కడే కొనసాగించేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. నియమాల ప్రకారం బదిలీల సమయంలో ఖాళీ పోస్టులు చూపడం, బదిలీకి అర్హమైన వారికి నిబంధనల ప్రకారం ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయడం అనే సంప్రదాయం ఇక్కడ సాగడం లేదు. ఇతరత్రా కారణాలు చెప్పి ఆయా స్థానాలు కావాలనుకునే వారికి నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా ఒక విభాగాధిపతి ఆధ్వర్యంలో పని సర్దుబాటులో భాగంగా డిప్యుటేషన్లపై నియామకాలు చేపడుతుంటారు. అలాంటి డిప్యుటేషన్లనూ ఆ అధికారి స్థాయిలో చేయవద్దని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు