Polavaram: పోలవరం నిధుల కోసం జగన్‌ నేల చూపులు.. బేల మాటలు

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇక రూ.12,911.15 కోట్లు మాత్రమే ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తాజాగా తేల్చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2017లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన మొత్తానికి ఇక అదనంగా ఇంతే ఇస్తామని ఒక నోట్‌లో పేర్కొంది.

Updated : 10 Jul 2023 08:20 IST

ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911 కోట్లేనట!
కేంద్ర ఆర్థికశాఖ నోట్‌లో స్పష్టం
మరో రూ.23,249 కోట్ల మాటేమిటి?
పూర్తి నిధులు ఇవ్వబోమని కేంద్రం చెప్పినా నోరెత్తని సీఎం
ప్రజలు నమ్మి 22 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్రాన్ని బతిమాలుకుంటున్న జగన్‌
ఈనాడు - అమరావతి

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇక రూ.12,911.15 కోట్లు మాత్రమే ఇవ్వబోతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తాజాగా తేల్చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2017లో కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన మొత్తానికి ఇక అదనంగా ఇంతే ఇస్తామని ఒక నోట్‌లో పేర్కొంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ప్రతి పత్రికా ప్రకటనలోనూ పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548.87 కోట్లు ఇవ్వాలని అడిగినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఏం అడిగారో ప్రధానమంత్రి కార్యాలయం ఏనాడూ అధికారికంగా వెల్లడించింది లేదు. ఈ లెక్కన చూస్తే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం గతంలో మంజూరుచేసిన రూ. రూ.20,398.61 కోట్లు మినహాయిస్తే మిగిలిన మొత్తం రూ.35,150.26 కోట్లకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపాలి. అయితే కేంద్రం ఇక ఇస్తానని చెబుతున్నది రూ.12,911 కోట్లే. ‘పోలవరానికి నిధులు పూర్తిగా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని ఆర్థికశాఖ ఉత్తర్వుల సారాంశం చెబుతోంటే సీఎం జగన్‌ ఎందుకు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్‌ చేయరు? గట్టిగా ఒక్కమాట అనేందుకూ నోరు ఎందుకు పెగలదు? నాడు.. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేకహోదా, పోలవరం నిధులు తెస్తామన్న జగన్‌.. ఇప్పుడు ఎందుకు బేలగా మారిపోయారు’ అన్న ప్రశ్నలు ప్రజలనుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.

పునరావాస ప్యాకేజీ అమలు చేయాలంటే..

‘పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 45.72 కాంటూరు స్థాయి వరకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలంటే రూ.20 వేల కోట్లు కావాలి. ఇందుకోసం కేంద్రాన్ని బతిమాలుతూనే ఉన్నా. లేఖలు రాస్తూనే ఉన్నా.. మన చేతుల్లో ఏముంది? కేంద్రం ఇస్తేనే నిర్వాసితులకు నిధులు ఇవ్వగలం. వాళ్లు ఇవ్వకపోతే మనం ఎక్కడినుంచి తేగలం? రూ.500 కోట్లో, రూ.1,000 కోట్లో అయితే నా చేతుల్లో ఉన్నదైనా ఇచ్చేస్తాం. రూ.20వేల కోట్లు అంటే కచ్చితంగా కేంద్రం సాయం చేయాల్సిందే. వాళ్ల దగ్గరే డబ్బు లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుంది? మన  ఖర్మేంటి అంటే పునరావాస ప్యాకేజీ ఇవ్వాలంటే రూ.20వేల కోట్లు కావాలి. దానికోసమే కేంద్రంతో కుస్తీపడుతున్నాం’ అని గత ఏడాది జులై 27న చింతూరు, వేలేరుపాడుల్లో సీఎం జగన్‌ పర్యటించినప్పుడు నిర్వాసితులను ఉద్దేశించి బేలగా అన్నారు.

ఇప్పటివరకు ఏం జరిగింది?

  • పోలవరం ప్రాజెక్టుకు తొలిసారి 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • తర్వాత 2013-14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు మరోసారి మంత్రిమండలి అంగీకరించింది.
  • 2017 మార్చి 15న నిర్వహించిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో 2014 ఏప్రిల్‌ 1 నాటికి సాగునీటి విభాగం కింద పోలవరానికి ఎంత ఖర్చవుతుందో ఆ మేరకు వందశాతం నిధులు తిరిగి చెల్లిస్తామని నిర్ణయించింది. ఆ తర్వాత పడే అదనపు భారం ఇవ్వబోమని స్పష్టం చేసింది.
  • పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ధరల ప్రకారం రూ.55 వేల కోట్లకు పైగా ఇవ్వాలని ఆ ప్రభుత్వం డీపీఆర్‌-2ని సమర్పించింది.
  • పోలవరం అథారిటీ అనేక కొర్రీలు వేసి జల్‌శక్తిశాఖకు సమర్పించింది. ఆ తర్వాత ఆ శాఖ సాంకేతిక సలహా కమిటీని ఏర్పాటుచేసింది. వారు అనేక చర్చలు జరిపి.. 2019 ఫిబ్రవరిలో 2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లకు పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించారు. పాత ప్రభుత్వ హయాంలోనే ఈ పరిణామం జరిగింది.
  • అదే ప్రభుత్వ హయాంలోనే కేంద్రం పోలవరంపై రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీని ఏర్పాటుచేసింది. వారు పరిశీలించి పోలవరం ప్రాజెక్టుకు రూ.47,725.24 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించారు.
  • ఆ మేరకు కేంద్రం పెట్టుబడి వ్యయాన్ని ఆమోదిస్తే సరిపోతుంది. రెండోదశ పునరావాసం నిధులూ అందులో ఉంటాయి.
  • అయితే రెండు కమిటీలు దాటి వచ్చి ఆమోదం పొందిన మొత్తాన్ని జగన్‌ సర్కార్‌ కేంద్రం వద్ద ఆమోదించుకోలేకపోయింది.
  • ప్రస్తుతం ఇక రూ.12,911 కోట్లే ఇస్తామని, అంతకుమించి ఇవ్వబోమని తేల్చింది. పోలవరానికి పాత మంత్రిమండలి ఆమోదించిన మొత్తానికి అదనంగా ఈ మేరకు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది.
  • జగన్‌ జులైలో మాట్లాడుతూ పునరావాసానికి ఇంకా రూ.20 వేల కోట్లు కావాలని చెప్పారు. ఈ ఏడాది జులై వచ్చేసరికి ఆ రూ.20 వేల కోట్లు ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. అంటే మరో రూ.35,150.26 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంటే రూ.12,911.15 కోట్లే ఇస్తామని తేల్చేసింది.

పోలవరం పూర్తిచేయడం ఎలా?

కేంద్రం రెండోదశ పునరావాసానికి నిధులు ఇవ్వకపోతే రాష్ట్రం ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులిచ్చే పరిస్థితుల్లో లేదనీ చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రూ.12,911 కోట్లే అని తేలింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో ఎప్పటికి నీళ్లు నిలబెడతారు? పోలవరం భవితవ్యం అగమ్యగోచరమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


కేంద్రం ఆ నిధులు ఇవ్వనంది!

పోలవరం ప్రాజెక్టుకు రెండుదశలూ కలిపి నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ మొత్తంతో రూ.55,548.87 కోట్లకు డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించాలి. నాలుగేళ్లుగా (బతిమాలుకున్నా) ఆ పని జరగలేదు. కేంద్ర ఆర్థికశాఖ తాజాగా జూన్‌ 5న నోట్‌ విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టుకు ఇక రూ.12,911.15 కోట్లే ఇస్తామని స్పష్టం చేసింది. ఈ మొత్తానికి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. దీనికి కేంద్రమంత్రి మండలి ఆమోదించాలని తెలిపింది.  ఇప్పటివరకు కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన రూ.20,398.61 కోట్లు మినహాయిస్తే మిగిలిన రూ.35,150.26 కోట్లకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపాలి. అయితే తాజాగా జూన్‌ 5న ఆర్థికశాఖ ఆదేశాల మేరకు పోలవరానికి ఇక ఇచ్చేది రూ.12,911.15 కోట్లేనని.. తేల్చి చెప్పేసింది. అయినా వైకాపా ప్రభుత్వం మిగిలిన నిధుల కోసం గట్టిగా ఒక మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.


రాజ్యసభలో బలం ఉన్నా..

కేంద్రప్రభుత్వం ఏ చట్టం తేవాలన్నా.. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం తప్పనిసరి. లోక్‌సభలో భాజపాకు కావాల్సినంత బలం ఉన్నా, రాజ్యసభలో ఆ మెజారిటీ లేదు. అనేక సందర్భాల్లో వైకాపా రాజ్యసభ సభ్యుల బలం కేంద్రానికి అవసరమైంది. అలాంటి కీలక పరిస్థితుల్లో తమ రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేకహోదా సాధనకు ముఖ్యమంత్రి ఎందుకు ఉపయోగించుకోలేకపోయారన్న ప్రజల ప్రశ్నలకు వైకాపా ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందన్నది చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని