స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం

ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్‌టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్‌ ప్రభుత్వం మోపనుంది.

Published : 30 Apr 2024 05:38 IST

ఆరు నెలల ముందే.. అధిక ధరకు కొనేలా జగన్‌ ప్రభుత్వం ఒప్పందాలు
అప్పటి ధరలో సగానికే ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటు

ఈనాడు, అమరావతి: ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్‌టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్‌ ప్రభుత్వం మోపనుంది. ఎస్‌టీవోఏల ద్వారా 3,640 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ కొనుగోలుకు వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో గత ఏడాది అక్టోబరులో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటే తక్కువ ధరకే విద్యుత్‌ రావాలి. కానీ, జగన్‌ ప్రభుత్వ నిర్వాకం చూడండి. రియల్‌ టైం మార్కెట్‌లో ఏరోజుకారోజు కొనుగోలు చేసే విద్యుత్‌ ధర కంటే దాదాపు రెట్టింపు ధరకు అంటే ఒక యూనిట్‌కు సగటున రూ.8.69 చొప్పున కొనేందుకు విద్యుత్‌ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాలో కోతలు పెడితే జనం ‘ఓటు వాతలు’ పెడతారనే భయంతో ముందస్తుగా విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ‘విద్యుత్‌ షాక్‌’ నుంచి తప్పించుకునే  ప్రయత్నంలో భాగంగా ప్రజలపై అధిక భారం పడుతుందని తెలిసీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. గత రెండేళ్లూ జగన్‌ ప్రభుత్వం వేసవిలో విద్యుత్‌ కోతలతో ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని  చూపింది. ఎన్నికల ఏడాదిలోనూ గతంలో మాదిరే విద్యుత్‌ కోతలు పెడితే.. ఆ ప్రభావం ఓట్లపై పడే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కరెంటు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేసి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని కొంతైనా తగ్గించాలని భావించి అధిక ధరకు విద్యుత్తును కొనేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఆ భారాన్ని ట్రూఅప్‌.. ఇంధన సర్దుబాటు ఛార్జీల (ఎఫ్‌పీపీసీఏ) పేర్లతో ప్రజలపైనే మోపనుంది. ఇప్పుడు కొత్త ఒప్పందాల ద్వారా పడ్డ భారం రూ.1274 కోట్లను ఎన్నికల తర్వాత ప్రజల నుంచి పిండుకునేలా ప్రతిపాదనలను సిద్ధంగా ఉంచింది.

ముందస్తు అంచనాల్లోనూ తడబాటు!

టైం బ్లాక్‌ వారీగా (15 నిమిషాలు టైం బ్లాక్‌) విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేసే సాంకేతికతను వినియోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ శనివారం 250.79 ఎంయూలుగా ఉంది. గత వారం రోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ కొంచెం అటూఇటుగా ఉంటోంది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, కేంద్ర విద్యుత్‌ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల ద్వారా అందుబాటులో ఉన్న విద్యుత్‌ పోగా.. ఎస్‌టీవోఏలతో సుమారు 35 ఎంయూల విద్యుత్‌ సర్దుబాటు అవుతోంది. కొన్ని టైం బ్లాక్‌లలో డిమాండ్‌ సర్దుబాటు కోసం డిస్కంలు డ్యామ్‌, ఆర్‌టీఎం మార్కెట్‌లో విద్యుత్తును కొంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. ఆరు నెలల ముందుగా కుదుర్చుకున్న ఎస్‌టీవోఏ ధర కంటే.. సగానికి సగం తక్కువకే ఎక్స్ఛేంజీలలో విద్యుత్తు దొరుకుతోంది.  ఎస్‌టీవోఏలతో యూనిట్‌కు రూ.8.69 చొప్పున డిస్కంలు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్ఛేంజీల్లో యూనిట్‌ విద్యుత్‌ సగటున రూ.4.50కే లభిస్తోంది. ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు, సరఫరా నష్టాల కింద యూనిట్‌కు 69 పైసల చొప్పున మినహాయించినా ప్రస్తుతం యూనిట్‌కు కనీసం రూ.3.5 అదనంగా చెల్లించాల్సి రావడం గమనార్హం. ఈ లెక్కన రెట్టింపు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

  ఎంతో కొంత.. అమ్ముకుందాం

ఎస్‌టీవోఏలతో కొనుగోలు చేసిన విద్యుత్తు వల్ల కొన్ని సందర్భాల్లో మిగులు ఉంటోంది. ఆ కరెంటును వినియోగించకపోయినా బిల్లులు చెల్లించక తప్పదు. ఈ కారణంగా విద్యుత్‌ ఎక్స్ఛేంజీల్లో కొంత విద్యుత్తును డిస్కంలు విక్రయిస్తున్నాయి. ఎక్స్ఛేంజీల్లో డిస్కంలు కొనుగోలు చేసే ధర కంటే ఎక్కువ మొత్తానికి విక్రయించడానికి అవకాశమే లేదు. అదే రోజు డిస్కంలు కొన్న ధరతోనే  విక్రయించక తప్పదు. అయితే  విద్యుత్తును కొన్న ధర కంటే తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఎస్‌టీవోఏలతో సుమారు 800 మెగావాట్ల విద్యుత్తును కొంటే.. సుమారు 200 మెగావాట్ల మేర మిగులు ఉంటోందని విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని