చేపా చేపా ఎందుకు ఎండావ్‌?

సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.

Published : 30 Apr 2024 05:13 IST

జగన్‌ దెబ్బకు కుదేలైన రైతులు
పెరిగిన విద్యుత్‌ ఛార్జీలతో తీవ్రనష్టం
చేపలు కొని డబ్బులివ్వక ముఖం చాటేసిన దళారులు
అప్పులు తీర్చడానికి పొలాల అమ్మకాలు
ఈనాడు, బిజినెస్‌ బ్యూరో

సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. కానీ ఉపాధికి ఊతమిస్తూ.. ఆదాయాన్ని పెంపొందించే ఈ రంగాన్ని జగన్‌ కాలదన్నారు. మేత ధర నియంత్రించక... విద్యుత్‌ రాయితీలు ఇవ్వక... దళారుల దందాను అడ్డుకోక... చేపల రైతులతో చెడుగుడు ఆడుకున్నారు..


ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల సముద్రతీరం, కృష్ణా-గోదావరి నదీ ప్రవాహాలు, కాల్వలకు తోడు చేపల పెంపకానికి అత్యంత అనువైన కొల్లేరు ప్రాంతం ఉంది. దీంతో రాష్ట్రంలో సహజసిద్ధంగానే చేపల పెంపకం, ప్రాసెసింగ్‌ యూనిట్లు విస్తరించాయి. ఇతర రాష్ట్రాలకు పెద్దఎత్తున ఎగుమతి చేసి ఆకర్షణీయ ఆదాయాన్ని తెచ్చిపెట్టేదిగా ఈ రంగం గుర్తింపు పొందింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 50 లక్షల మెట్రిక్‌ టన్నుల చేపలు లభిస్తాయి. చెరువుల్లో చేపల సాగుపై ఆధారపడిన రైతులు ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, ఇతర జిల్లాల్లో లక్షల మంది ఉన్నారు. చేపల చెరువుల సాగుకు రైతులు ఏటా ఎకరానికి రూ.500 చొప్పున ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తున్నారు.


కొల్లేరు కాంటూర్‌ 5 పరిధిలో శీలావతి, కట్ల రకం చేపలు విరివిగా పెరుగుతాయి. ఇక్కడి నీళ్లలో నాచు లభ్యత రైతులకు కలిసొచ్చే అంశం. ఈ సానుకూలతలను అందిపుచ్చుకుని అటు ఆదాయాన్ని... ఇటు సంపదను  పెద్దఎత్తున పెంచుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. కానీ, జగన్‌ నిర్లక్ష్య వైఖరితో అంతా నీరుగారిపోతోంది.


ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువల ద్వారా వచ్చే నీటితో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చెరువులను నింపుతారు. నగరాల్లోని కాలుష్యానికి తోడు పంచదార ఫ్యాక్టరీ నుంచి మొలాసిస్‌ వ్యర్థాలు ఆ కాలువల్లో కలుస్తున్నాయి. దీంతో కాలుష్యం తీవ్రమై చెరువుల్లోని చేపలు వ్యాధుల బారిన పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నీరు అంది చేపల రైతులకు కాలుష్యం బెడద కొంత తప్పేది. సీఎం జగన్‌ నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదు.. చేపల రైతుల సమస్యలు తీరలేదు.


చేపల పెంపకానికి దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌ నిర్లక్ష్య వైఖరి అటు రైతులకు, ఇటు మత్స్య రంగానికి అశనిపాతంలా పరిణమించింది. వైకాపా సర్కారు కరెంటు ఛార్జీలను అడ్డగోలుగా పెంచేసింది. తద్వారా చేపల పెంపకం, ప్రాసెసింగ్‌, ఎగుమతులపై తీవ్రభారం మోపింది. నీటి కాలుష్యాన్ని పట్టించుకోలేదు. నకిలీ మందులు సరఫరా అవుతున్నా చర్యలు చేపట్టలేదు. చేపల మేత ధరలపై నియంత్రణ కరవైంది. ఇన్ని సమస్యలను తట్టుకుని చెరువులు ఏర్పాటుచేస్తే.. దళారుల బెడద నుంచి తప్పించుకోలేని పరిస్థితి. చేపలను కొనుగోలు చేసిన దళారులు చివరకు నగదు చెల్లించకుండా మాయమయ్యారు. దీంతో.. అప్పులు తీర్చలేక, మేత బిల్లులు చెల్లించలేక రైతులు విలవిల్లాడారు. చెరువులు వేయడమే మానుకున్నారు. కొందరైతే తమ చెరువులను అయినకాడికి అమ్ముకున్నారు. జగన్‌ జమానాలో చేపలు సాగు చేసే రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మత్స్యరంగం నుంచి రాష్ట్రానికి ఏటా దాదాపుగ రూ.70వేల కోట్లు ఆదాయం వస్తోంది. లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోన్న ఈ రంగాన్ని జగన్‌ సర్కారు పూర్తిగా మూలకు నెట్టేసింది.

మేత ధర ఐదింతలు...

పచ్చి తవుడు నుంచి నూనె తీసేయగా వచ్చే డీఓబీ (డీ ఆయిల్డ్‌ బ్రాన్‌)ని చేపల మేత(ఫీడ్‌)గా వినియోగిస్తారు. తొమ్మిదేళ్ల క్రితం దీని ధర టన్నుకు రూ.4000 ఉండగా ఇప్పుడు రూ.20,000కు పెరిగింది. రాష్ట్రంలో శీలావతి, కట్ల రకం చేపలను చెరువుల్లో ఎక్కువగా పెంచుతారు. అప్పట్లో కిలో చేప ధర రూ.40 ఉంటే.. ప్రస్తుతం రూ.100 పలుకుతోంది. చేప ధర రెండున్నర రెట్లు పెరిగితే.. ఫీడ్‌ ధర ఐదింతలు అయింది. ఎకరం లీజు ధర కూడా రూ.40 వేల నుంచి రూ.80-90 వేలకు పెరిగింది. ఈ లెక్కన 12-14 నెలల వ్యవధిలో రెండు పంటలు సాగు చేస్తేనే రైతుకు కలిసొస్తుంది. పెట్టుబడి ఆలస్యమయ్యే కొద్దీ రైతుకు నష్టమే మిలుగుతుంది.

ధరల నియంత్రణలో విఫలం...

చెరువుల్లో పెంచుతున్న చేపలకు నీటి కాలుష్యం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో వాటి ఎదుగుదల ఆలస్యమవుతోంది. 100 గ్రాముల పిల్లలు కిలో బరువు పెరిగేందుకు గతంలో 7 నెలలు పట్టేది. ఇప్పుడు 10 నెలలు కూడా పడుతోంది. 7 నెలల వ్యవధిలో అయితే ఒక చేపకు 2.5 కిలోల డీఓబీ మేత సరిపోతుంది. 10 నెలల వరకు అయితే 3.5- 4 కిలోల మేత కావాల్సి వస్తోంది. దీంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. మేత ధరలను నియంత్రించడంలో వైకాపా సర్కారు ఘోరంగా విఫలమైంది.  చేపల చెరువుల్లో దాదాపు ఆరు అడుగుల మేర నీరు నిల్వ ఉండాలి. ఎండవేడిమికి నీరు ఆవిరవుతూ ఉంటుంది. వాటిలో తగినంత నీరు నింపడం కోసం మోటార్లను వాడుతున్నారు. దీంతో రైతులకు విద్యుత్తు బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో యూనిట్‌ కరెంటు ధర 90 పైసలుగా ఉండేది. ప్రస్తుత జగన్‌ సర్కారు యూనిట్‌ ధరను రూ.3.50కు పెంచడంతో చేపల రైతుల నడ్డి విరిగింది.


దళారుల దందాలు...

రాష్ట్రంలోని చెరువుల్లో ఐదేళ్ల నుంచి రూప్‌చంద్‌, ఫంగస్‌ రకం చేపలను కూడా పెంచుతున్నారు. వీటి కోసం డీఓబీ, మీల్‌ వినియోగించి చేసే పిల్లెట్లను మేతగా వాడటం తప్పనిసరి. చేప పిల్ల ఒక కిలో చేపగా ఎదిగేలోపు 1.5 కిలోల పిల్లెట్లు సరిపోతాయని కంపెనీలు నమ్మబలికాయి. ఈ మేత వల్ల చేపలు వేగంగా పెరుగుతాయని రైతులను మభ్యపెడుతూ కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నాయి. అవసరమైన మేరకు మేతను కొనుగోలుచేసి చేపలు పట్టే సమయంలో ఆ మొత్తం చెల్లించాలంటూ అప్పుపై సరకును అంటగడుతున్నాయి. ఇప్పుడే డబ్బులు చెల్లించే అవసరం లేకపోవడంతో రైతులు చేపలు త్వరగా ఎదిగేందుకు పిల్లెట్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అజమాయిషీ కరవవడంతో కంపెనీలు ఇష్టమొచ్చిన ధరకు సరఫరా చేస్తున్నాయి. అయితే, ఈ మేతను వాడినా చేప పిల్ల కిలో బరువుకు చేరేందుకు సాధారణంగా పట్టే సమయం 7 నెలలే అవుతోందని, పైగా 2 కిలోల పిల్లెట్లు వాడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ రకం చేపల ధర కిలో రూ.60 మాత్రమే పలుకుతోంది. ఈ లెక్కన కిలో చేప విక్రయించినా.. మేత ఖర్చు రూపంలో కిలోకు రూ.20 నష్టం వస్తోంది. విద్యుత్తు బిల్లుల భారం అదనం. వీటికితోడు నెల రోజుల తర్వాత డబ్బు చెల్లిస్తామని నమ్మబలుకుతూ దళారులు చేపలు కొనుగోలు చేస్తున్నారు. తర్వాత చాలా మంది.. ఆ రైతుల వంక కూడా చూడడంలేదు. మరికొందరు ఐపీ పెడుతున్నారు. ఇలా మేతను సరఫరా చేసే కంపెనీల మాయాజాలం, దళారుల మోసాలకు రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల ఊబిలోంచి గట్టెక్కేందుకు రైతులు పొలాలను అమ్ముకున్నారు. అయినా కంపెనీలు, దళారుల ఆగడాలను అరికట్టి రైతులను ఆదుకునే దిశలో చర్యలు చేపట్టలేకపోయారు జగన్‌.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని