అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!

ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు.

Published : 30 Apr 2024 05:41 IST

రిజిస్ట్రేషన్‌ ముసుగులో వైకాపా నేతల దందా
శ్రీకాళహస్తిలో పార్టీ అనుయాయులకు ప్రత్యేక కోటా
కర్నూలు జిల్లాలో పొసెషన్‌ సర్టిఫికెట్ల జారీ
మచిలీపట్నంలో నకిలీ పత్రాల పంపిణీ

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-శ్రీకాళహస్తి: ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వేనంబర్లతో నకిలీ పట్టాలను సృష్టించి ఇస్తూ అమాయకులను దగా చేస్తున్నారు. చివరకు వైకాపా ప్రజాప్రతినిధులు చెప్పినవారి పేర్లే భూరికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఈ అక్రమాలకు రెవెన్యూ అధికారులు వంత పాడుతున్నారు. రాష్ట్రంలోని జగనన్న లేఅవుట్లలో కొన్ని ప్లాట్లను తమ ఆధీనంలోనే వైకాపా ప్రజాప్రతినిధులు ఉంచుకున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి అక్రమాలు ఎక్కువగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, ఏర్పేడు తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు పాత తేదీలతో అక్రమాలను కొనసాగించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు జగనన్న కాలనీలో సుమారు 350, ఏర్పేడు మండలం చిందేపల్లి జగనన్న కాలనీలో 150 వరకు ప్లాట్లను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు స్వాధీనం చేసుకుని అనుచరులకు కేటాయించారు. రాజీవ్‌నగర్‌లో జగనన్న కాలనీకి అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని 150 మంది అనుచరులకు పంచారు. ఏర్పేడు మండలం వికృతమాలలోని జగనన్న కాలనీలోనూ వందల్లోనే పట్టాలను వైకాపా వారికి పంచిపెట్టారు. బడా నేతలకు కాలనీ వెలుపల ఉన్న ప్రభుత్వభూమిని కేటాయించారు. ఈ భూములు పొందినవారు ప్లాట్లుగా విభజించి సెంటు రూ.3లక్షల చొప్పున విక్రయించుకున్నారు. ఒంగోలులోనూ పార్టీ అనుయాయులకు ప్లాట్లు కేటాయించారు. వారి వివరాలు రికార్డుల్లో నమోదు కాలేదు. కొన్నిచోట్ల రికార్డుల్లో పేర్లు ఉన్నా స్థలం కేటాయించలేదు. స్థలం కేటాయించినా లబ్ధిదారుల పేర్లు రికార్డుల్లో లేవు.

నిబంధనలు బేఖాతరు

రేషన్‌కార్డు, ఆధార్‌, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ధ్రువపత్రం, కుటుంబ యజమాని ఎక్కడా ప్రభుత్వ ఇల్లు పొందకుండా ఉంటేనే జగనన్న కాలనీలో ఇల్లు పొందేందుకు అర్హుడవుతారు. ఈ నిబంధనలేవీ వైకాపా నాయకులకు అమలవడం లేదు. నేతలు చెప్పినవారే లబ్ధిదారులవుతున్నారు. వీరికి స్థిరచరాస్తులు ఉన్నా పేదలుగానే చెలామణి అవుతున్నారు. రెవెన్యూ అధికారులు సంతకాలు పెడుతుంటే ఇతర వివరాలను వైకాపా నేతలు నమోదు చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి.

లబ్ధిదారులు కాకున్నా పునాదుల కోసం గుంతలు తవ్వారు!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాయకరావుపేట మండలం సీతారామపురానికి చెందిన సుమారు 40 మందికి స్థానిక వైకాపా నేతలే జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు కేటాయించారు. లబ్ధిదారులను నేతల అనుచరులు స్వయంగా స్థలాల వద్దకు తీసుకెళ్లి పునాదుల కోసం గుంతలు తీయించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో ప్రస్తుతానికి పనులు నిలిచాయి.

  • శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మదనాపురంలో అర్హుల జాబితాను సిద్ధం చేసినప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. ఇంటింటికి అందిన సంక్షేమ పథకాలపై తయారుచేసిన కరపత్రంలో మాత్రం ఇద్దరు లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని ఇచ్చినట్లు చూపించారు.
  • కర్నూలు జిల్లా మద్దికెర మండలం అగ్రహారం పంచాయతీ సర్వేనంబరులో 28 మందికి పొసెషన్‌ సర్టిఫికెట్లను పది రోజుల కిందట రాత్రికి రాత్రి తయారుచేసి మండల వైకాపా నేతలు అందజేశారు. వారు చాలాకాలం నుంచి ఈ భూమిలోనే ఉంటున్నందున సర్టిఫికెట్లు ఇచ్చినట్లు సమర్థించుకుంటున్నారు. ఇక్కడ సెంటు ధర రూ.3 లక్షల వరకుంది. వాస్తవానికి ఈ భూమి అనుభవదారులు ఎవరూ లేరు.

వివరాల నమోదులో ఎన్నెన్నో లోపాలు

తిరుపతి జిల్లాలో 6 వేలు, ప్రకాశం జిల్లాలో 4 వేలు, అనంతపురం జిల్లాలో 3,500, కాకినాడ- 3,300, ఎన్టీఆర్‌-3,277, నంద్యాల-2,900, విశాఖపట్నం-2,642, అన్నమయ్య-2,600, ఏలూరు-2,500, పశ్చిమగోదావరి-2,200, కోనసీమ-2,100, విజయనగరం జిల్లాలో 2,000 మంది లబ్ధిదారుల వివరాలు గందరగోళంగా ఉన్నాయి. వాటిని అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఈ కన్వేయన్స్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు అదనపు ప్రయోజనం లేకున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ల ముసుగులో స్థానిక ప్రజాప్రతినిధులు పేట్రేగిపోతున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాగాలి, చిందేపల్లి జగనన్న కాలనీల్లో తిరుపతి, రేణిగుంట ప్రాంతాలకు చెందినవారికి కొత్తగా పట్టాలివ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు జగనన్న కాలనీల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లించనందున వారు అడ్డుకుంటున్నారు.

లబ్ధిదారులు ఏమయ్యారు..?

ఇంటి పట్టాలు పొందినవారికి ‘కన్వేయన్స్‌ డీడ్‌’ రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. పట్టాలు పొందినవారిలో ప్రస్తుతం లక్షన్నర మంది వివరాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీరిలో సుమారు 50 వేల మంది మరణించారు. వీరికి వారసులు లేకపోవడం లేదా అనర్హులవడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొలిక్కిరాలేదు. తిరుపతి జిల్లాలో వీరి సంఖ్య 12,804, చిత్తూరు జిల్లాలో 11,049 వరకు ఉండడం గమనార్హం. కడప జిల్లాలో 9,800, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాలలో 3వేల మందికి రిజిస్ట్రేషన్లు నిలిచాయి. ఆవాస ప్రాంతాలకు దూరంగా స్థలాలివ్వడంతో లబ్ధిదారులు ముందుకురాని సంఘటనలూ ఉన్నాయి.

అక్రమార్కులకు రిజిస్ట్రేషన్లు

అన్నమయ్య జిల్లా పీలేరు-మదనపల్లె మార్గంలోని ఏపీఐఐసీ లేఅవుట్‌-3లో పదినెలల కిందట 1,700 మందికి ఇళ్ల స్థలాలనిచ్చి ప్లాట్‌నంబరుతో కూడిన స్లిప్పులను ‘డిప్‌’ ద్వారా లబ్ధిదారులకు అందజేశారు. వీరిలో కొంతమందికి పట్టాలిచ్చి మరికొందరికి ఇవ్వలేదు. ఈ లేఅవుట్‌లోనే 250 ప్లాట్‌నంబర్లతో కూడిన స్లిప్పులు వైకాపా నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. డిప్‌ ద్వారా స్లిప్పులు పొందిన అర్హులకు కేటాయించిన స్థలాల మ్యాపింగ్‌ నత్తనడకన సాగుతోంది. అక్రమంగా స్లిప్పులు పొందినవారికి మాత్రం రిజిస్ట్రేషన్లు అయ్యాయి.


చర్యలు ఎక్కడ?

కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సుమారు 20 డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు వెయ్యికిపైగా నకిలీ పట్టాలను పేదలకు ఇచ్చారు. వీటిపై విచారణ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రాలేదు. మచిలీపట్నంలో కొంతమందికి రోడ్ల పక్కనున్న ఖాళీ స్థలాలకు నేరుగా పట్టాలిస్తున్నట్లు ప్రజాప్రతినిధుల అనుచరులు పత్రాలను అందజేశారు. పత్రాల్లో కొన్నింటికి సర్వేనంబర్లు వేశారు. భూరికార్డుల్లో మాత్రం ఆ సర్వేనంబర్లు లేవు. కొన్నింట్లో సర్వేనంబర్లు తప్పుగా ఉన్నాయి. పట్టాలపై ప్రభుత్వ ముద్ర, తేదీలు లేవు. తహసీల్దార్‌ సంతకాలున్నాయి. అధికారికంగా ఇచ్చే పట్టాల్లో స్థల వివరాలు, సరిహద్దులు, లేఅవుట్‌ నంబరు, ఇతర వివరాలు ప్రభుత్వసీల్‌, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. తహసీల్దార్‌ కార్యాలయ భూరికార్డుల్లోనూ నమోదు చేయాలి. ఇవి సంపూర్ణంగా లేకుండా పత్రాలను ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. బదిలీపై వెళ్లిన తహసీల్దార్‌ సునీల్‌బాబు సంతకం ఒకటే కొన్ని పత్రాల్లో కనిపిస్తోంది. మచిలీపట్నం తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా అక్రమ ఇళ్లపట్టాల తయారీ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని